Share News

నోబెల్‌ పీఠాన.. నారీతేజం

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:01 AM

ఒకరు ప్రాచీన గ్రీకు కావ్యాలకు ఆధునిక కవితా రూపాన్నిచ్చి విశ్వ సాహిత్యాన్ని పరవశింపజేశారు. మరొకరు అంతర్జాతీయ చట్టాలనే అస్త్రాలుగా మలచి అణచివేతకు గురైన కోట్లాదిమందికి న్యాయం అందించారు.

నోబెల్‌ పీఠాన.. నారీతేజం

ఒకరు ప్రాచీన గ్రీకు కావ్యాలకు ఆధునిక కవితా రూపాన్నిచ్చి విశ్వ సాహిత్యాన్ని పరవశింపజేశారు. మరొకరు అంతర్జాతీయ చట్టాలనే అస్త్రాలుగా మలచి అణచివేతకు గురైన కోట్లాదిమందికి న్యాయం అందించారు. శాంతి, సాహిత్య రంగాలలో అత్యున్నత ‘నోబెల్‌’ పురస్కారాన్ని కైవసం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా నారీశక్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరవేశారు.. నవనీతమ్‌ నవీ పిళ్లై, యాన్‌ కార్సన్‌.

  • న్యాయమే ఆమె అస్త్రం

ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురైన గొంతుకలకు ఆసరాగా నిలిచి.. అంతర్జాతీయ చట్టమే శాంతికి అసలైన పునాది అని చాటిచెప్పిన భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికా న్యాయకోవిదురాలు నవనీతమ్‌ ‘నవీ’ పిళ్లైని 2026 నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది. అపార్తీడ్‌ (వర్ణవివక్ష) విధానంపై పోరాటం నుంచి ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం హైకమిషనర్‌ బాధ్యతల వరకు ఆమె సాగించిన నిరంతర ధర్మపోరాటమే ఆమెకు ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలసవెళ్లిన పేద కుటుంబంలో జన్మించిన నవీ పిళ్లై ప్రయాణం ఏమంత సునాయాసంగా సాగలేదు. వర్ణవివక్ష రాజ్యమేలుతున్న రోజుల్లో ఆమె తన చదువును కొనసాగించారు. 1967లో దక్షిణాఫ్రికాలోని నాతాల్‌ ప్రావిన్స్‌లో లాయర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు. నెల్సన్‌ మండేలా వంటి మహోన్నత నాయకులు, అనేకమంది రాజకీయ ఖైదీలను రాబెన్‌ జైలులో నిర్బంధించినప్పుడు కోర్టులో వారి తరపున ధైర్యంగా నిలబడి వాదనలు వినిపించిన ఏకైక న్యాయవాది నవీ పిళ్లై. 1995లో జాతి వివక్ష అంతమయ్యాక దక్షిణాఫ్రికా హైకోర్టులో మొదటి నల్లజాతి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


  • చారిత్రక మైలురాళ్లు

నవీ పిళ్లై కేవలం దక్షిణాఫ్రికాకే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ న్యాయపీఠంపై ఆమె వేసిన ముద్రలు చరిత్రలో నిలిచిపోతాయి. 1995లో రువాండా అంతర్జాతీయ నేర నిరూపణ ట్రైబ్యునల్‌ జడ్జ్‌గా బాధ్యతలు చేపట్టిన పిళ్లై.. అక్కడి నరమేధం కేసుల్లో సంచలన తీర్పులిచ్చారు. యుద్ధ సమయంలో జరిగే లైంగిక హింస, అత్యాచారాలను కేవలం నేరాలుగా కాక ‘జాతి సంహార చర్యలు’గా గుర్తించిన చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది పిళ్లైనే. ఆ తర్వాత ది హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం జడ్జిగా, 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం హైకమిషనర్‌గా సేవలు అందిస్తూ అణచివేతదారుల గుండెల్లో నిద్రపోయారు.

  • సత్యం చెప్పడానికి ధైర్యం ఎందుకు?

గాజా, ఇజ్రాయెల్‌ మానవహక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి విచారణ కమిషన్‌కు నేతృత్వం వహించిన నవీ పిళ్లై.. ఈ నోబెల్‌ శాంతి పురస్కారంపై ఎంతో నిరాడంబరంగా స్పందించారు. ‘‘నోబెల్‌ కమిటీ నన్ను ధైర్యవంతురాలని కొనియాడటం చూసి ఆశ్చర్యపోయాను. నిజం చెప్పడానికి ప్రత్యేకంగా ధైర్యం ఎందుకు కావాలి? చట్టాన్ని నిష్పక్షపాతంగా వ్యాఖ్యానించడం, వాస్తవాలను సమాజం ముందు ఉంచడమే జడ్జిగా నా ప్రాథమిక బాధ్యత’’ అని ఆమె వ్యాఖ్యానించడం ఆమె నిష్పాక్షికతకు అద్దం పడుతోంది.

ప్రపంచ శాంతికి అంతర్జాతీయ చట్టమే దిక్సూచి. యుద్ధాలు, ఘర్షణలు ప్రపంచాన్ని అశాంతి దిశగా నెట్టివేస్తున్న ప్రస్తుత తరుణంలో, అంతర్జాతీయ చట్టాల పటిష్టత ఎంత అవసరమో నోబెల్‌ కమిటీ ఈ పురస్కారం ద్వారా స్పష్టం చేసింది. అణచివేతకు గురవుతున్న కోట్లాదిమందికి, న్యాయ వ్యవస్థపై నమ్మకముంచే ప్రతి పౌరుడికి 86 ఏళ్ల నవీ పిళ్లై జీవితం ఎంతో ఆదర్శం.


  • ప్రాచీన కావ్యాలకు ఆధునిక రూపు

కవిత్వం.. వచనం.. వ్యాసం.. అనువాదం.. ఈ విభిన్న ప్రక్రియల సరిహద్దులను తుడిచేస్తూ ప్రాచీన గ్రీకు పురాణాలకు ఆధునిక రూపునిచ్చిన అరుదైన సృష్టికర్త యాన్‌ కార్సన్‌. శతాబ్దాల నాటి మానవ వేదనను నేటి పాఠకుడి హృదయానికి హత్తుకునేలా మలచి 2026 నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని ముద్దాడారు ఈ కెనడియన్‌ కవయిత్రి.

కెనడాలోని టొరంటోలో 1950లో జన్మించిన యాన్‌ కార్సన్‌ బాల్యం నుంచే ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. తండ్రి బ్యాంకు ఉద్యోగి కావడం వల్ల వివిధ ప్రాంతాలు మారుతూ పెరిగిన ఆమె చిన్నతనంలోనే అక్షరాల ప్రపంచంలో తన ఓదార్పును వెతుక్కున్నారు. హైస్కూల్‌ రోజుల్లో ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ప్రాచీన గ్రీకు భాషను అభ్యసించడం ప్రారంభించారు. ఆ భాషలోని సౌందర్యం, లోతు ఆమెను బాగా ఆకర్షించాయి. టొరొంటో విశ్వవిద్యాలయంలో ప్రాచీన గ్రీకు సాహిత్యంలో అధ్యయనం పూర్తిచేసిన కార్సన్‌.. పురాతన గ్రీకు కావ్యాల్లోని లోతును అన్వేషించడాన్ని తన శ్వాసగా మార్చుకున్నారు. మెక్‌గిల్‌, ప్రిన్స్‌టన్‌, మిచిగాన్‌ యూనివర్సిటీల్లో అధ్యాపకురాలిగా సేవలందిస్తూనే.. తన కలానికి పదునుపెట్టారు. గ్రీకు తత్వశాస్త్రం, పురాణాల పట్ల ఉన్న అపార పరిజ్ఞానమే ఆమె తదనంతర సాహిత్య సృష్టికి కొండంత బలమైంది.

  • ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ రెడ్‌

కార్సన్‌ రచనా శైలి చాలా విలక్షణమైనది. ఆమె ఒక రచన చేస్తే దానిని కేవలం కవిత్వమనో, లేదా ఒక నవల అనో వర్గీకరించడం సాధ్యం కాదు. 1998లో వెలువడిన ఆమె జగద్విఖ్యాత రచన ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ రెడ్‌’ సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. ప్రాచీన గ్రీకు కవి స్టెసికోరోస్‌ రాసిన పురాణ కథలోని ‘గెరియోన్‌’ అనే ఎర్రటి రెక్కల రాక్షసుడి పాత్రను ఆధారంగా చేసుకుని ఆమె ఈ పుస్తకాన్ని మలిచారు. ఆ పురాణ పాత్రను ఆధునిక సమాజంలోని ఒక ఒంటరి యువకుడిగా, ఛాయాగ్రాహకుడిగా ఊహించి అద్భుతమైన వచనాత్మక కవితా నవలగా రూపొందించారు. ప్రేమ, బాధ, అభద్రత, సామాజిక బహిష్కరణకు గురైన హృదయాల ఆవేదనను ఆమె ఆవిష్కరించిన తీరు పాఠకులను మంత్రముగ్ధులను చేసింది. సమకాలీన కవితా జగత్తులో ఇదొక మాస్టర్‌ పీస్‌గా నిలిచిపోయింది.


  • సరిహద్దులు లేని సాహిత్య ప్రక్రియ

కార్సన్‌ కేవలం పురాణాలను తిరగ రాయడమే కాకుండా మానవ సంబంధాల లోతును విశ్లేషించడంలోనూ దిట్ట. 1986లో వెలువడిన ఆమె తొలి వ్యాస గ్రంథం ‘ఎరోస్‌ ది బిట్టర్‌ స్వీట్‌’ ప్రేమ, కోరికల వెనకున్న తీపి, చేదుల తత్వాన్ని ఎంతో అద్భుతంగా విశ్లేషించింది. ప్రసిద్ధ గ్రీకు కవయిత్రి సాఫో కవితా ఖండాలను ‘ఇఫ్‌ నాట్‌, వింటర్‌: ఫ్రాగ్మెంట్స్‌ ఆఫ్‌ సాఫో’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన తీరు పండితుల ప్రశంసలు అందుకుంది. 2001లో వెలువడిన ‘ది బ్యూటీ ఆఫ్‌ ది హజ్బెండ్‌’ అనే రచనకు గానూ ఆమె ప్రసిద్ధ టి.ఎస్‌. ఇలియట్‌ పురస్కారాన్ని అందుకున్నారు. తన సోదరుడి ఆకస్మిక మరణం తర్వాత ఆమె రూపొందించిన ‘నోక్స్‌’ అనే పుస్తకం సంప్రదాయ పుస్తక ఆకృతికి భిన్నంగా.. ఒక పెట్టెలో అకార్డియన్‌ శైలిలో మడతపెట్టిన కొలేజ్‌ రూపంలో ఉండి ఆమె సృజనాత్మకతకు అద్దపట్టింది. 2004లో వెలువడిన ‘రాంగ్‌ నార్మా’ వంటి రచనలతో ఆమె నిరంతరం కొత్త రూపాలను అన్వేషిస్తూనే ఉన్నారు.

  • అక్షరానికి పట్టాభిషేకం

కార్సన్‌ రచనలలో అపారమైన పాండిత్యం ఉంటూనే.. పాఠకుడిని కదిలించే మానవీయ వేదన ఉంటుంది. కవిత్వానికి, వ్యాసానికి, అనువాదానికి మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ ఒక సరికొత్త రకం సాహిత్య రూపాన్ని సృష్టించినందుకు గాను ప్రపంచవ్యాప్తంగా పాఠకుల నుంచి కార్సన్‌కు ప్రశంసలు దక్కాయి.

  • ఐస్‌లాండ్‌ నిశ్శబ్దంలో నోబెల్‌

స్వీడిష్‌ అకాడమీ 2026 అక్టోబర్‌ 8న నోబెల్‌ సాహిత్య బహుమతిని ప్రకటించిన సమయంలో... కార్సన్‌ ఐస్‌లాండ్‌లోని సుదూర ప్రాంతంలో గడుపుతున్నారు. అక్కడ వీచే ఈదురు గాలులను ఆస్వాదిస్తూ.. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆమెకు అకాడమీ నుంచి నేరుగా ఫోన్‌ పిలుపు వెళ్లింది. ‘‘గ్రీకు సాహిత్య సంప్రదాయంతో అద్భుతమైన సంభాషణ జరుపుతూ.. ఆధునిక సాహిత్యానికి వినూత్న రూపాలను అందించిన ఆమె సాహసోపేతమైన, సృజనాత్మక సాహిత్యానికి గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాం’’ అని నోబెల్‌ కమిటీ కొనియాడింది.

Updated Date - Oct 10 , 2026 | 12:01 AM