దేవికి మిల్లెట్స్ నైవేద్యాలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:27 AM
దసరా నవరాత్రుల్లో చివరి నాలుగు రోజులు ప్రత్యేకమైనవిగా భావిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి రకరకాల నైవేద్యాలను సమర్పించి ఇంటిల్లిపాదీ స్వీకరిస్తుంటారు. వీటిలో కొన్నింటిని మిల్లెట్స్‌తో కొత్తగా ఆరోగ్యకరంగా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
మిల్లెట్స్ కదంబం దుర్గాదేవి
కావాల్సిన పదార్థాలు: మిల్లెట్స్ (కొర్రలు/సామలు/అరికెలు)- కప్పు, కందిపప్పు- పావు కప్పు, పెసర పప్పు- పావు కప్పు, చింతపండు గుజ్జు- అర కప్పు, కూరగాయల ముక్కలు- గుమ్మడి, బంగాళదుంప, చిలగడ దుంప, క్యారెట్, మునక్కాయ, సొరకాయ, వంకాయ, బెండకాయ, టమాటా.....తదితరాలు, పచ్చిమిర్చి- రెండు, కదంబం మసాల పొడి- రెండు చెంచాలు, పసుపు- అర చెంచా, ఉప్పు- తగినంత, కారం- చెంచా, నెయ్యి- నాలుగు చెంచాలు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర- కొద్దిగా, ఇంగువ- పావు చెంచా
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో చెంచా పచ్చి శనగపప్పు, చెంచా మినపగుండ్లు, అర చెంచా మెంతులు, పావు చెంచా మిరియాలు, పావు కప్పు ధనియాలు, రెండు ఎండు మిర్చి, చెంచా జీలకర్ర వేసి దోరగా వేయించి చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో మిల్లెట్స్, కందిపప్పు, పెసరపప్పు వేసి కడిగి అయిదు కప్పుల నీటిని పోసి పావు చెంచా పసుపు వేసి నాలుగు గంటలు నానబెట్టి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆపైన మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదిపి రెండు కప్పుల నీటిని పోసి కలపాలి. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి కూరగాయల ముక్కలు, పావు చెంచా పసుపు, చెంచా ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి రెండు కప్పుల నీటిని పోసి ఉడికించాలి. తరువాత చింతపండు గుజ్జు, కారం, కదంబం మసాల పొడి వేసి కలిపి మరో పది నిముషాలు ఉడికించాలి. ఆపైన మెత్తగా ఉడికించిన మిల్లెట్స్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి. స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలపాలి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దించాలి.
కొర్రల పాయసం సరస్వతీ దేవి
కావాల్సిన పదార్థాలు: కొర్రలు- కప్పు, బెల్లం తురుం- కప్పు, యాలకుల పొడి- చెంచా, నెయ్యి- నాలుగు చెంచాలు, కాజు- 9, కిస్మిస్లు- కొన్ని, కాచి చల్లార్చిన పాలు- అర లీటరు, పచ్చ కర్పూరం- చిటికెడు, ఎండు కొబ్బరి ముక్కలు- పావు కప్పు
తయారీ విధానం: కుక్కర్లో కొర్రలు వేసి మూడు కప్పుల నీటిని పోసి నాలుగు గంటలు నానబెట్టి ఆపైన మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి దించాలి. తరువాత గరిటెతో కొర్రలను మెత్తగా మెదపాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం తురుం వేసి కప్పు నీటిని పోసి కరిగించి కొర్రల మిశ్రమంలోకి వడబోయాలి. ఈ కుక్కర్‌ని మరల స్టవ్ మీద పెట్టి కొర్రల మిశ్రమాన్ని కలుపుతూ పది నిమిషాలు ఉడికించి దించాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి, కాజు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించి కొర్రల మిశ్రమంలో వేసి కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత కాచి చల్లార్చిన పాలు పోసి యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి కలపాలి.
సామల గారెలు మహిషాసురమర్దిని
కావాల్సిన పదార్థాలు: సామలు- అర కప్పు, సగ్గుబియ్యం- ఒకటిన్నర చెంచాలు, పెరుగు- చెంచా, నెయ్యి- చెంచా, అల్లం తురుం- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- రెండు, నూనె- డీప్ ఫ్రైకి తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు- తగినంత
తయారీ విధానం: మిక్సీలో సామలు, సగ్గుబియ్యం వేసి మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఓ కప్పు నీటిని పోసి ఉప్పువేసి బాగా మరగనివ్వాలి. తరువాత అందులో కొద్ది కొద్దిగా సామల పిండిని వేస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద అయిదు నిముషాలు ఉడికించి దించాలి. దీనిమీద మూతపెట్టి అరగంటసేపు అలాగే ఉంచాలి. ఆపైన పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, అల్లం తురుం, పెరుగు వేసి చేత్తో ముద్దలా కలపాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. చేతికి నెయ్యి రాసుకుని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గారెల మాదిరి చేసి నూనెలో మెల్లగా జారవిడచాలి. వీటిని అన్ని వైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి.
అరికెల పూర్ణాలు మహాలక్ష్మీ దేవి
కావాల్సిన పదార్థాలు: అరికెలు- కప్పు, పచ్చి శనగపప్పు- కప్పు, బెల్లం తురుం- కప్పు, మినప్పప్పు- కప్పు, బియ్యం- అర కప్పు, కొబ్బరి తురుం- అర కప్పు, యాలకుల పొడి- చెంచా, ఉప్పు- చిటికెడు, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం: ముందుగా అరికెలు, పచ్చి శనగపప్పులను నాలుగు గంటలు నానబెట్టాలి. అలాగే బియ్యం, మినప్పప్పులను కూడా నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీయాలి. చిటికెడు ఉప్పు కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అరికెలు, పచ్చి శనగపప్పు వేసి కొద్దిగా నీటిని పోసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆపైన నీటిని వడగట్టి మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదిపి యాలకుల పొడి, బెల్లం తురుం, కొబ్బరి తురుం వేసి కలపాలి. ఈ కుక్కర్‌ను మరల స్టవ్‌మీద పెట్టి పూర్ణం మిశ్రమం గట్టి పడే వరకు ఉడికించి దించాలి. ఆపైన చిన్న చిన్న వుండలుగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. ఒక్కో పూర్ణం ఉండను పిండిలో ముంచి నూనెలో వేసి అన్నివైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి.