Share News

అభయప్రదాత

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:04 AM

సమస్త జీవరాశుల్లో శక్తికి మూలం నరసింహస్వామి. భక్తులు కానివారికి వారి కర్మ నిర్దేశిత గమ్యాన్ని అనుసరించి శక్తిని ప్రసాదిస్తాడు. విశుద్ధ భక్తి ప్రపత్తులను పెంపొందించుకున్న...

అభయప్రదాత

హరేకృష్ణ

సమస్త జీవరాశుల్లో శక్తికి మూలం నరసింహస్వామి. భక్తులు కానివారికి వారి కర్మ నిర్దేశిత గమ్యాన్ని అనుసరించి శక్తిని ప్రసాదిస్తాడు. విశుద్ధ భక్తి ప్రపత్తులను పెంపొందించుకున్న వారికి... తను కోరుకుంటే తనతో సమానమైన శక్తియుక్తులను కూడా అనుగ్రహించే భక్తవత్సలుడు శ్రీనారసింహుడు.

ధర్మాన్ని కాపాడడానికి, తన భక్తులను అసురీ శక్తుల నుంచి రక్షించడానికి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతాడు. వాటిలో శ్రీనరసింహావతారాన్ని తన పరమ భక్తుడైన ప్రహ్లాదుడి కోసం ధరించాడు. అయిదేళ్ళ బాలకుడైన ప్రహ్లాదుడికి అతని తండ్రి హిరణ్యకశిపుడి చెరనుంచి, హింస నుంచి విముక్తి కలిగించడానికి అవతరించాడు. ప్రహ్లాదుడికి అభయాన్ని ప్రసాదించిన నరసింహ స్వామి... అదే అభయాన్ని తన భక్తులకు నిత్యం ప్రసాదిస్తాడు. నరసింహస్వామిని ‘విఘ్న వినాశకుడు’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భక్తుల హృదయాల్లో అజ్ఞానం అనే చీకటితోపాటు భక్తిమార్గంలో ఎదురయ్యే సమస్త ఆటంకాలను ఆయన తొలగిస్తాడు. గణపతి కూడా విఘ్నాలను తొలగించే శక్తి కోసం నరసింహస్వామిని ఆరాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుడు అంతటా వ్యాపించి (సర్వవ్యాపి) ఉన్నాడని తన భక్తుడు పలికిన మాటల్లోని సత్యాన్ని నిలబెట్టడానికి స్తంభం నుంచి నారసింహుడిగా శ్రీహరి అవతరించాడు.

ఆ క్రోధమూ ఆరాధనీయమే

భగవంతుడు సైతం క్రోథాన్ని కలిగి ఉండడం కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అయితే, సర్వోన్నతమైన శక్తికీ ఒక రూపం ఉన్నదనీ, ఆ రూపం సమస్త భావాలకూ నిలయమనీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం. ఏ నేరం ఎరుగని తన భక్తుడైన ప్రహ్లాదుడిపట్ల హిరణ్యకశిపుడు కిరాతకంగా వ్యవహరించినందుకు భగవంతుడు కోపోద్రిక్తుడయ్యాడు. సర్వానికీ మూలమైన ఆ భగవంతుడే ప్రేమ, క్రోధం అనే భావాలకు కూడా మూలం. మనమందరం ఆ పురుషోత్తముడి అంశలం కనుకనే మనలోనూ ఆ భావాలు ఉన్నాయి. కానీ, మనలోని క్రోధం దుష్పరిణామాలకు హేతువు కాగా, భగవంతుని క్రోధం ఆరాధనీయమైనది. అదే మనకూ భగవంతుడికీ మధ్య ఉన్న వ్యత్యాసం. నేడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధభయం, రాజకీయ అస్థిరత, అశాంతి రాజ్యమేలుతున్నాయి. హిరణ్యకశిపుడి లాంటి అసురీ శక్తులు ఆధునిక రూపాల్లో సమాజాన్ని పీడిస్తున్న సమయంలో ‘నా భక్తుడు ఎన్నటికీ నశించడు’ అనే భగవంతుడి అభయం మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది. ‘నరసింహ కవచం’ పారాయణం, నామస్మరణ ద్వారా ప్రజలు మానసిక ఆందోళన నుంచి విముక్తిని, భద్రతా భావాన్ని పొందగలరు.


నరసింహ జయంతి పర్వదినాన దేవాలయాలలో విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే చందన లేపనం, సుగంధ పుష్పాలతో విశేష అలంకరణ చేస్తారు. ఆ రోజున శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహిస్తారు. రాత్రి సమయంలో ఏకాంత సేవ జరుపుతారు. పండ్లను, పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే నరసింహ హోమాలు కూడా జరుగుతాయి. ఈ హోమం ద్వారా వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. అసురీ ప్రవృత్తులను, దుష్టశక్తులను హరింపజేయడానికి ఈ హోమం శక్తిమంతమైన సాధనం. భక్తితో దీనిలో పాల్గొనేవారికి భగవంతుడు అభయాన్ని ప్రసాదిస్తాడు.

దేవాలయాలకు వెళ్ళలేని భక్తులు తమ ఇళ్ళలోనే నరసింహ జయంతిని వైభవంగా జరుపుకోవచ్చు. ఇంట్లో ఉన్న నరసింహస్వామి లేదా లక్ష్మీనరసింహ చిత్రపటానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున నరసింహ ప్రమాణ మంత్రాన్ని, ‘హరేకృష్ణ’ మహా మంత్రాన్ని జపించడం అత్యంత శ్రేష్టం. సాత్వికమైన ఆహారాన్ని (ప్రసాదాన్ని) భగవంతుడికి నివేదించి, కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించడం ద్వారా స్వామివారి దివ్యకృపకు పాత్రులు కావచ్చు.

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

ఇవి కూడా చదవండి...

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News

Updated Date - Apr 24 , 2026 | 05:04 AM