ఇన్‌స్టాలో ఫైనాన్స్ పాఠాలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:31 AM
చాలామందికి ఒక గొప్ప రికార్డు సాధించగానే గమ్యం చేరుకున్నామనే తృప్తి కలుగుతుంది. కానీ, మధ్యప్రదేశ్‌కు చెందిన నందినీ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నం. 19 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సీఏగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నందిని నేడు ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది యువతకు ఫైనాన్షియల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
చాలామందికి ఒక గొప్ప రికార్డు సాధించగానే గమ్యం చేరుకున్నామనే తృప్తి కలుగుతుంది. కానీ, మధ్యప్రదేశ్‌కు చెందిన నందినీ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నం. 19 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సీఏగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నందిని నేడు ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది యువతకు ఫైనాన్షియల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
నందిని ప్రస్తుతం దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థల్లో ఆడిటింగ్, ఫైనాన్షియల్ అనాలసిస్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అయితే ఆమె ప్రయాణం కేవలం కార్పొరేట్ కార్యాలయాలకే పరిమితం కాలేదు. తన విజ్ఞానాన్ని పదిమందికీ పంచాలనే ఉద్దేశంతో సోషల్‌మీడియా వేదికగా లక్షలాదిమంది విద్యార్థులకు చేరువయ్యారు. సంక్షిష్టమైన ఫైనాన్స్ అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా విడమర్చి చెబుతూ ఒక ‘యంగ్ ఫైనాన్షియల్ ఐకాన్’గా ఎదిగారు.
నమ్మశక్యం కాని రీతిలో...
నందిని అగర్వాల్ ప్రయాణం ఒక అసాధారణ అకడమిక్ వండర్ అని చెప్పాలి. ఆమె అడుగులు వేగంగా పడ్డాయి. ఆలోచనలు అంతకంటే వేగంగా సాగాయి. సాధారణంగా పిల్లలు ఆటపాటలతో గడిపే వయసులోనే ఆమె పుస్తకాలతో స్నేహం చేసింది. ఫలితంగా పదమూడేళ్ల వయసులోనే పదో తరగతి బోర్డు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడితో ఆమె వేగం తగ్గలేదు. 15 ఏళ్లకే ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. ఆ తర్వాత లక్ష్యం ఏమిటన్న ప్రశ్నకు అత్యంత కఠినమైన చార్టర్డ్ అకౌంటెన్సీ అని సమాధానమిచ్చింది. చాలామంది విద్యార్థులు కెరీర్ పట్ల అయోమయంలో ఉండే వయసులోనే ఆమె తన గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని అడుగులు వేసింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్
చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షలు అంటేనే ఒక సింహస్వప్నం. ఏళ్ల తరబడి శ్రమించినా ఉత్తీర్ణత సాధించడం గగనమయ్యే ఈ రంగంలో నందిని తొలి ప్రయత్నంలోనే అద్భుతాలు చేసింది. 2021లో వెలువడిన సీఏ ఫైనల్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకోవడమే కాకుండా, ఆమె సాధించిన స్కోరు విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. మొత్తం 800 మార్కులకు గాను 614 మార్కులు సాధించి తన మేధస్సును చాటుకుంది. దాదాపు 83 వేల మంది అభ్యుర్థులతో పోటీపడి విజయం సాధించిన నందిని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. నందిని అగర్వాల్ కేవలం 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులోనే సీఏ పూర్తిచేసి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. విశేషం ఏంటంటే ఆమె అన్నయ్య కూడా అదే ఏడాది సీఏలో ఆలిండియా ర్యాంకు సాధించారు.
ఆర్థిక అక్షరాస్యతే లక్ష్యంగా
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను కేవలం వినోదం కోసమే కాకుండా, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎలా వాడుకోవచ్చో నందిని నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో లక్షలాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమె నిత్యం వారికి మార్గదర్శిగా నిలుస్తోంది. ముఖ్యంగా సీఏ ప్రిపరేషన్‌లో ఉన్న విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను తీరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. చదువుతోపాటు ఆర్థిక అక్షరాస్యత ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆమె చేస్తున్న వీడియోలు సామాన్యులకు సైతం ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెట్టుబడులు ఎలా పెట్టాలి? పొదుపు సూత్రాలు ఏమిటి? అనే అంశాలపై ఆమె ఇస్తున్న సలహాలు యువతలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.
స్ఫూర్తినిచ్చే ప్రస్థానం
నందిని అగర్వాల్ కథ కేవలం ఒక ర్యాంకు గురించి మాత్రమే కాదు, ఆ ర్యాంకును పునాదిగా చేసుకుని ఒక వ్యక్తి తన వృత్తిలోను, సమాజానికి తోడ్పటంలోనూ ఎలా ఎదగవచ్చో చెప్పే అద్భుత ప్రయాణం. చిన్న పట్టణం నుంచి వచ్చామా?లేదా పెద్ద నగరమా అన్నది ముఖ్యం కాదు, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని ఆమె నిరూపించింది. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపచంలో కీలక పాత్ర పోషిస్తూనే, లక్షలాదిమందికి స్ఫూర్తినిస్తున్న నందిని ప్రస్థానం అభినందనీయం.