మొహర్రం... సత్యానికి, త్యాగానికి ప్రతీక
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:05 AM
చరిత్ర పుటలను తిరగేస్తే కొన్ని నెలలు కేవలం కాలగమనంలో భాగంగా మాత్రమే కాకుండా... మానవాళికి మార్గదర్శకంగా కనిపిస్తాయి. వాటిలో పవిత్రమైన మొహర్రం మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇస్లామీయ...
సందేశం
నేడు మొహర్రం
చరిత్ర పుటలను తిరగేస్తే కొన్ని నెలలు కేవలం కాలగమనంలో భాగంగా మాత్రమే కాకుండా... మానవాళికి మార్గదర్శకంగా కనిపిస్తాయి. వాటిలో పవిత్రమైన మొహర్రం మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇస్లామీయ (హిజ్రీ) క్యాలెండర్ ప్రకారం తొలి నెలగా ఆరంభమయ్యే ఈ మాసం... విశ్వాసం, త్యాగం, సహనం, న్యాయం, అల్లాహ్ విధేయతలకు ప్రతీకగా నిలిచింది. ఈ మాసం పేరు వినగానే ప్రవక్త మూసాను అల్లాహ్ రక్షించిన సంఘటన గుర్తుకు వస్తుంది. అలాగే కర్బలా నేలపై సత్యం కోసం ప్రాణాలను అర్పించిన ఇమామ్ హుసైన్ త్యాగ గాథ హృదయాలలో మెదిలి, కన్నీరు తెప్పిస్తుంది.
అధర్మం ఎంత బలంగా కనిపించినా... చివరికి సత్యానిదే విజయం. కష్టాలు ఎంత పెద్దవైనా అల్లా్‌హపై విశ్వాసం ఉంచినవారికి ఆయన సాయం తప్పకుండా లభిస్తుంది. ప్రతి ముస్లిం తన జీవితాన్ని పరిశీలించుకొని, తన ‘ఇమాన్’ (దైవంపట్ల విశ్వాసం)ను బలోపేతం చేసుకోవడానికి, అల్లా్‌హకు మరింత చేరువ కావడానికి అపూర్వమైన అవకాశాన్ని ఈ మాసం అందిస్తుంది. పన్నెండు మాసాల్లో నాలుగింటిని పవిత్రమైనవిగా అల్లాహ్ ప్రకటించారు. అవి: జుల్ ఖఅదా, జుల్ హిజ్జా, మొహర్రం, రజబ్. కాగా మొహర్రం నెలను ‘షహ్రుల్లాగ్’ (అల్లాహ్ తాలూకు నెల) అని దైవప్రవక్త మహమ్మద్ పేర్కొన్నారు. ఇది ఇతర మాసాలకు లభించని ప్రత్యేక గౌరవం. ‘‘రంజాన్ తరువాత అత్యుత్తమమైన ఉపవాసం... అల్లాహ్ మాసమైన మొహర్రంలో చేసే ఉపవాసం’’ అని దివ్యఖుర్‌ఆన్‌లోని ఒక హదీసు వివరించింది. ‘మొహర్రం’ అనే పదానికి ‘పవిత్రమైనది’, ‘గౌరవం పొందినది’ అని అర్థం.
అశూరా ప్రాధాన్యత
మొహర్రం మాసంలోని పదో రోజును ‘యౌముల్ ఆశూరా’ అంటారు. ఆ రోజున ఎన్నో చారిత్రక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా తన ప్రవక్త మూసాను, బనీ ఇజ్రాయిల్ ప్రజలను ఫిరౌన్ దౌర్జన్యం నుంచి అల్లాహ్ రక్షించారు. దైవప్రవక్త మహమ్మద్... మదీనాకు వచ్చినప్పుడు అక్కడ యూదులు ఆశూరా ఉపవాసం పాటిస్తున్నట్టు గమనించారు. కారణం అడిగారు. ‘‘ఈ రోజున మూసాను అల్లాహ్ రక్షించాడు కదా!’’ అని వారు చెప్పారు. అప్పుడు ‘‘మూసాతో మీకన్నా మాకు ఎక్కువ సంబంధం ఉంది ’’అని చెబుతూ... ముహర్రం మాసంలో తొమ్మిది, పది లేదా పది, పదకొండు రోజుల్లో ఉపవాసం ఉండడంతోపాటు తన సహచరులను కూడా ఉపవాసం ఉండాలని ఆయన ప్రోత్సహించారు.
చరిత్రలో చెరగని అధ్యాయం
మొహర్రం నెలలో సంభవించిన అత్యంత హృదయవిదారక సంఘటన... ఇరాన్‌లోని కర్బలా ప్రాంతంలో జరిగిన యుద్ధం. అధికారంలో ఉన్న యజీద్‌కు విధేయత ప్రకటించాలని ఇమామ్ హుసైన్‌పై ఒత్తిడి వచ్చింది. కానీ ఆయన సత్యం కోసం నిలబడ్డారు. చివరకు కర్బలా మైదానంలో ఇరుపక్షాలకూ యుద్ధం జరిగినప్పుడు... హుసైన్ కుటుంబ సభ్యులకు, సహచరులకు శత్రువులు నీరు కూడా అందకుండా కట్టడి చేశారు. అయినా తమ విశ్వాసాన్ని వారు విడిచిపెట్టలేదు. చివరకు మొహర్రం మాసంలోని పదో రోజున ఇమామ్ హుసైన్, ఆయన సహచరులు అమరులయ్యారు. సత్యం కోసం నిలబడాలని, అన్యాయానికి తలవంచకూడదనీ, దైవ విశ్వాసం కోసం త్యాగం చెయ్యాలనీ, కోరుకోవాల్సింది అల్లాహ్ సంతృప్తినే తప్ప అధికారాన్ని కాదని కర్బలా యుద్ధం నేర్పుతుంది. అలాగే పవిత్ర మాసాల్లో పాపాలకు దూరంగా, అల్లాహ్ పట్ల భయంతో జీవించాలని, ఈ మాసంలో ఉపవాసాలు పాటించాలని, సహనంతో మెలగాలని, సత్యం కోసం పోరాడాలనీ మొహర్రం మాసం బోధిస్తుంది.
ఫ మహమ్మద్ వహీదుద్దీన్