Share News

హైదరాబాద్‌ అమ్మలాంటిది

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:10 AM

టాలీవుడ్‌లో ‘సీత’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ఇప్పుడు రూటు మార్చింది. సుకుమారమైన పాత్రల నుంచి సాహసోపేతమైన యాక్షన్‌ వైపు అడుగులు వేస్తోంది. అడవి శేష్‌తో కలిసి ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘డెకాయిట్‌’ మొన్ననే విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలు, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం...

హైదరాబాద్‌ అమ్మలాంటిది

టాలీవుడ్‌లో ‘సీత’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ఇప్పుడు రూటు మార్చింది. సుకుమారమైన పాత్రల నుంచి సాహసోపేతమైన యాక్షన్‌ వైపు అడుగులు వేస్తోంది. అడవి శేష్‌తో కలిసి ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘డెకాయిట్‌’ మొన్ననే విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలు, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం...

  • నమస్కారం మృణాల్‌ గారు.. ఎలా ఉన్నారు?

నేను బాగున్నా.

  • ‘సీతారామం’తో మీరు ఒక క్లాసిక్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘డెకాయిట్‌’లో యాక్షన్‌ రోల్‌ చేయడం ఒక ప్రయోగమే కదా. వైబ్‌ ఎలా ఉంది?

వైబ్‌ చాలా పాజిటివ్‌గా ఉంది. ‘హాయ్‌ నాన్న’ సమయంలో చాలామంది ప్రేక్షకులు నన్ను యాక్షన్‌ సినిమాల్లో చూడాలని కోరుకున్నారు. వారి కోరిక మేరకే ఈ ప్రాజెక్ట్‌ ఓకే చేశాను. యాక్షన్‌ జానర్‌లో నేను చేసిన మొదటి ప్రయోగం ఇది. ఇందులో రొమాన్స్‌తోపాటు పవర్‌ఫుల్‌ యాక్షన్‌, భావోద్వేగాలు ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్‌ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది.

  • ‘దురంధర్‌ 2’ లాంటి సినిమాల తర్వాత యాక్షన్‌ ట్రెండ్‌ పెరిగింది. ‘డెకాయిట్‌’లో ఎలాంటి యాక్షన్‌ ఆశించవచ్చు?

దయచేసి ‘దురంధర్‌’తో ‘డెకాయిట్‌’ను పోల్చవద్దు. ‘ధురంధర్‌’ ఒక దేశభక్తి, ఇంటర్నేషనల్‌ మిషన్‌ నేపథ్యంలో సాగే సినిమా. కానీ మా ‘డెకాయిట్‌’ కథ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె నేపథ్యంలో సాగుతుంది. దీని రిథమ్‌, బీట్‌ పూర్తిగా భిన్నం. తుపాకులు పట్టుకుని కాల్చుకోవడమే దీని వైబ్‌ కాదు. ‘ఇద్దరు మాజీ ప్రేమికులు 13 ఏళ్ల తర్వాత కలిస్తే ఏం జరిగింది?’ అనే పాయింట్‌ చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ప్రతీకారం ఉన్నా అది ఒక హ్యూమన్‌ డ్రామా. కాబట్టి ‘దురంధర్‌’తో పోల్చకుండా ఒక క్లీన్‌ మైండ్‌తో చూడండి.


  • ఈ సినిమా మేకింగ్‌కు దాదాపు మూడేళ్లు పట్టిందని విన్నాం. ఈ మధ్యలో మీరు ఇతర సినిమాలు చేశారు కదా! పాత్రల మధ్య మారడం కష్టంగా అనిపించలేదా?

ఈ సినిమా మేకింగ్‌కు మూడేళ్లు పట్టి ఉండొచ్చు. కానీ, నేను టీమ్‌లో జాయిన్‌ అయి మాత్రం ఏడాదిన్నర అవుతోంది. రైటింగ్‌ పరంగా శేష్‌కి ఎక్కువ సమయం పట్టి ఉండొచ్చు. ఈ గ్యాప్‌లో నేను ఇతర సినిమాలు చేస్తున్నప్పటికీ నా పూర్తి ఫోకస్‌ ‘డెకాయిట్‌’ మీదే ఉంది. వచ్చే నెలలో నా హిందీ సినిమా ‘హై జవానీతో ఇష్క్‌ హోనా హై’ కూడా విడుదలవుతోంది. ఒక పాత్రలోంచి మరో పాత్రలోకి మారడం కష్టమే కానీ , హైదరాబాద్‌ రావడమంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ కష్టం తెలియలేదు.

  • హైదరాబాద్‌ అంటే మీకు ఎందుకంత ఇష్టం?

ఇక్కడి మనుషులు, సినిమా పట్ల వారికి ఉన్న గౌరవం, ఆతిథ్యం, కల్చర్‌... అబ్బో చాలా ఉన్నాయండి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కూతుర్ని. చిన్నప్పటి నుంచి చాలా నగరాలు తిరిగాను. కానీ, హైదరాబాద్‌లో దొరికినంత ఆత్మీయత ఎక్కడా దొరకలేదు. ఇక్కడ షూటింగ్‌ ఉందంటే చాలు... ఏదో కొత్త విషయం నేర్చుకుంటాననే నమ్మకం కలుగుతుంది. నాకు హైదరాబాద్‌ అమ్మ అయితే, ముంబై నాన్న లాంటిది. ఈ రెండూ లేకుండా ఉండలేను.

  • ఒక హీరోయిన్‌గా మీరు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఏంటి?

సరైన స్ర్కిప్ట్‌ను ఎంచుకోవడమే అతి పెద్ద సవాలు. గతంలో నేను కొన్ని సినిమాలు కేవలం స్నేహం కోసమో, కాంబినేషన్ల కోసమో చేసి చేతులు కాల్చుకున్నాను. పేపర్‌ మీద బాగున్న కథలు స్ర్కీన్‌ మీద ఎగ్జిక్యూట్‌ కాకపోవచ్చు. ‘సెల్ఫీ’, ‘గుమ్రా’ లాంటి సినిమాలు నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితులను ఇచ్చాయి, కానీ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. ఆ తప్పుల నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. ఆడియన్స్‌ ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఇక మీదట స్ర్కిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను.


  • సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌, రూమర్స్‌ను ఎలా తీసుకుంటారు?

తొలినాళ్లలో అవి నన్ను బాధించేవి. అయితే, ఆ తర్వాత నేను వాటిని పట్టించుకోను. రూమర్లు చూసి బాధపడితే అనారోగ్యం పాలవుతాం. మనం పాపులర్‌ అయినప్పుడే ఇలాంటి వార్తలు వస్తాయని నేను నమ్ముతాను. ఎవరైనా నా గురించి రాస్తున్నారంటే నేను సరైన దారిలో ఉన్నానని అర్థం. రేప్పొద్దున్న ప్రజలు ఈ వార్తలు మర్చిపోతారు. కానీ, నేను చేసిన మంచి సినిమాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. గురుదత్‌ గారి ‘ప్యాసా’ లాంటి సినిమాలు అప్పట్లో ఫ్లాప్‌ అయినా, నేడు మనం వాటిని క్లాసిక్స్‌గా చూస్తున్నాం. నాకు బాక్సాఫీస్‌ కంటే నా పర్ఫార్మెన్స్‌ ఇచ్చే తృప్తి ముఖ్యం.

  • ప్రపంచవ్యాప్తంగా మన సినిమాల ప్రభావం పెరగడంపై మీ అభిప్రాయం?

నా తమ్ముడు అమెరికాలో చదువుకుంటున్నాడు. అక్కడ వాళ్ల క్లాసులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను స్ర్కీన్‌ప్లే పాఠంగా చూపిస్తున్నారట. అది విన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఒక నటిగా నేను కూడా అలాంటి గొప్ప చిత్రాల్లో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు నన్ను చూసి ఇన్‌స్పైర్‌ అవుతున్నామని చెబుతుంటే అవార్డు వచ్చినంత సంతోషంగా అనిపిస్తుంది.

  • సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ మీ గ్లామర్‌ వెనుక మీ సోదరి పాత్ర ఉందని విన్నాం. నిజమేనా?

అవును, నా సిస్టర్‌ నా అతి పెద్ద ఎమోషనల్‌ సపోర్ట్‌. తనే నా మేకప్‌, ప్రోస్తెటిక్స్‌ అన్నీ చూసుకుంటుంది. ‘సూపర్‌ 30’ నుంచి నేటి ‘డెకాయిట్‌’ వరకు నా ప్రతి లుక్‌ వెనుక తన కష్టం ఉంది. కొన్ని సీన్లలో డైరెక్టర్‌ అసలు మేకప్‌ వద్దని అన్నా, లేక కొంచెం డర్టీగా ఉండాలని అన్నా అన్నీ తనే మేనేజ్‌ చేస్తుంది. నా ‘సీత’ లుక్‌ కూడా తను క్రియేట్‌ చేసిందే. తను నన్ను ముద్దు చేస్తుంది. అదే సమయంలో కోప్పడుతుంది కూడా.

Updated Date - Apr 12 , 2026 | 03:10 AM