టీచరే రైతుగా... లాభాల పంట
ABN , Publish Date - Oct 12 , 2026 | 02:48 AM
చదువుకొనే రోజుల్లో ఒకటే కల... ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నతంగా స్థిరపడాలని. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో... సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. బడిలో కొంతకాలం పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె...
చదువుకొనే రోజుల్లో ఒకటే కల... ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నతంగా స్థిరపడాలని. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో... సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. బడిలో కొంతకాలం పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె... ఆ తరువాత రైతుగా మారి స్ర్టాబెర్రీ సాగు మొదలుపెట్టారు. వేల పెట్టుబడితో... లాభాల పంట పండిస్తూ... నేడు లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అరుదైన గుర్తింపునూ పొంది... మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న 35 ఏళ్ల జెడ్‌టీ లాల్‌రిథంగీ కథ ఇది.
‘‘వెనక్కి తిరిగి చూసుకొంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. మంచి చదువు, ఆ తరువాత అందమైన కెరీర్. అందరు అమ్మాయిల్లా ఇదే నేను ఊహించుకున్నది. దాని కోసం శక్తి వంచన లేకుండా శ్రమించాను. డిగ్రీ తరువాత సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో బాగా కష్టపడ్డాను. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పాఠాలు చెబుతూనే... పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. కానీ పదే పదే విఫలమయ్యాను. అది నన్ను కుంగదీసింది. అయితే కొన్నాళ్లకు నాకు నేను సర్దిచెప్పుకున్నాను. జీవితంలో ఒకరిపై ఆధారపడకుండా ఉన్నతంగా స్థిరపడాలంటే సర్కారీ కొలువు ఒక్కటే మార్గమా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇంకో విశేషం ఏమిటంటే అప్పటికి నాకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఏ లోటూ లేకుండా కుటుంబం గడవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అలాగని నేను ఒకరికి భారం కాదలుచుకోలేదు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. నాకంటూ ఒక గుర్తింపు కావాలని నా మనసు కోరుకొంటోంది. సాధికారత దిశగా అడుగులు వేయాలని అది తపిస్తోంది. అన్నిటికీ మించి... ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నేను చదివిన చదువుకు అర్థం ఏముంటుంది! అందుకే సొంతంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. మరి ఏం చేయాలి? అప్పటికి స్పష్టత లేదు.
పిల్లలు నిద్ర పోయాక...
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలోని సంగౌ మా స్వస్థలం. సాధారణంగా పెళ్లి, పిల్లలు తరువాత మహిళల కెరీర్ ఆగిపోతుంది. నా చుట్టూ అలాంటి మహిళలను ఎంతోమందిని చూశాను. కానీ అలా నా జీవితం కాకూడదని అనుకున్నాను. అందుకే పట్టుబట్టి కార్యక్షేత్రంలోకి దిగాను. ఏంచేయాలని ఆలోచిస్తుంటే... పొరుగున ఉన్న సిహాయా జిల్లాలోని రైతులు గుర్తుకువచ్చారు. వారు స్ర్టాబెర్రీలు బాగా పండిస్తున్నారు. మంచి లాభదాయకంగా సాగుతోంది వారి సాగు. నేను కూడా వారి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాను. కానీ లేచింది మొదలు ఇంట్లో ఒకటే పని. రాత్రి పిల్లలు పడుకున్నాకగానీ నాకంటూ సమయం దొరికేది కాదు. ఆ సమయాన్నే సద్వినియోగం చేసుకున్నాను. అర్ధరాత్రిపూట యూట్యూబ్‌లో స్రాబెర్రీ సాగుకు సంబంధించిన వీడియోలు చూస్తూ, అవగాహన పెంచుకున్నాను. ఒకొక్కటిగా నేర్చుకున్నాను. అంతర్జాలంలో శోధించి సందేహాలు నివృత్తి చేసుకున్నాను.
వెయ్యి మొక్కలతో మొదలై...
మా గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న భూమి ఉంది. ముందుగా, అంటే 2024లో అందులో వెయ్యి స్ట్రాబెర్రీ మొక్కలు తెచ్చి నాటాం. మొదటి సంవత్సరం పంటతో లక్షన్నర రూపాయల ఆదాయం లభించింది. లాభాలు లేవు కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించాం. అది నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆ ఉత్సాహంతో క్రమంగా మొక్కల సంఖ్య పెంచుకొంటూ వెళ్లాం. ప్రస్తుతం ఐదెకరాల్లో స్ర్టాబెర్రీ సాగు చేస్తున్నాం. మొత్తం పది వేలకు పైగా చెట్లు మా పొలంలో ఉన్నాయి. గత ఏడాది పంట దిగుబడి ద్వారా ఆదాయం పది లక్షల రూపాయలు దాటింది. స్థానిక మార్కెట్‌లో స్ర్టాబెర్రీలకు మంచి డిమాండ్ ఉంది. అందుకు కారణం ఇక్కడ వాటితో వైన్ కూడా తయారు చేయడమే. ఏదిఏమైనా రెండేళ్లు వెనక్కి తిరిగి చూసుకొంటే... ‘ఇది నేనేనా’ అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎలాంటి వ్యవసాయ నేపథ్యం గానీ, అనుభవం కానీ లేని, అదీ ఒక మహిళగా ఇంత తక్కువ సమయంలో ఇంత సాధించగలిగానంటే గర్వంగా ఉంది.
ఇతర పంటలు కూడా...
ఆరంభంలో స్థానిక ఉద్యాన శాఖను సంప్రదించాను... సాయం చేయమని. కానీ స్ట్రాబెర్రీలు తమ ప్రాజెక్ట్ పరిధిలోకి రావని వారు చెప్పారు. దాంతో అనుభవం లేకపోయినా నేనే రంగంలోకి దిగాను. నా కష్టం ఫలించి ఇవాళ మంచి రాబడి వస్తోంది. నాతోపాటు నా భర్త కూడా వ్యవసాయంలో సహకరిస్తున్నారు. అందరి మద్దతుతో ఇవాళ అనుకున్నది సాధించగలిగాను. స్ర్టాబెర్రీలతో పాటు అవకాడో, అరటి తదితర పండ్లు, కూరగాయలు కూడా పండిస్తున్నాను. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన వ్యవసాయం లాభసాటిగా మారడం ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంది.
అరుదైన గుర్తింపు...
ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ (ఎఫ్‌ఏఓ) ఈ సంవత్సరానికి గాను ప్రకటించిన ‘వ్యవసాయ ఆహార వ్యవస్థలు... గ్రామీణాభివృద్ధిలో టాప్ 100 ఉమెన్ హీరోస్’ జాబితాలో నేను కూడా ఉన్నాను. మొత్తం 131 దేశాల నుంచి వచ్చిన ఆరు వందలకు పైగా నామినేషన్ల నుంచీ తుది జాబితా రూపొందించారు. భారత్ నుంచి నాతోపాటు మరొకరికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభించింది. అంతటి గుర్తింపు నాకు దక్కుతుందని ఎన్నడూ ఊహించలేదు. ఎంపికైన మహిళలందరినీ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా రోమ్‌లోని ఎఫ్‌ఏఓ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెలలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొడానికి నేను రోమ్ వెళుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం పరితపించి విఫలమైన మహిళ నేడు తనకంటూ ఒక మార్గాన్ని సృష్టించుకొని విజయవంతమైన ప్రయాణం సాగిస్తోంది. ఇంతకు మించిన సంతోషం, సంతృప్తి ఎక్కడ ఉంటాయి!’’