ఈ వంటపాత్రలు వెలకట్టలేనివి
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:11 AM
సంప్రదాయ వంట పాత్రల ఉపయోగాలు, ప్రయోజనాల పట్ల ఆసక్తితో, అంతరించిపోతున్న చేతివృత్తులకు జీవం పోయాలనే సంకల్పంతో....
సంప్రదాయ వంట పాత్రల ఉపయోగాలు, ప్రయోజనాల పట్ల ఆసక్తితో, అంతరించిపోతున్న చేతివృత్తులకు జీవం పోయాలనే సంకల్పంతో ‘జిష్ట’ అనే బ్రాండ్‌కు శ్రీకారం చుట్టారు.. తమిళనాడుకు చెందిన మీరా రామకృష్ణన్. ఆరోగ్య ప్రయోజనాలను అందించే వంటపాత్రల విక్రయాలతో, అటు కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, ఇటు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా దోహదపడుతున్న మీరా నవ్యతో పంచుకున్న విశేషాలు...
రాయి, మట్టి, రాగి, కంచు, ఇనుము, కలప, ఇత్తడి, టిన్... ఇలా ప్రతి వంటింట్లో 8 రకాల పదార్థాలతో తయారైన పాత్రలు ఉండాలి. మన పూర్వీకులు వీటిని విభిన్న అవసరాల కోసం ఉపయోగించేవారు. నా చిన్నతనంలో మా ఇంట్లో వందల సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వచ్చిన ఒక పాత్రను ఉపయోగించడం చూశాను. ఆసక్తికొద్దీ ఆరా తీస్తే వంటపాత్రలు వాటి ప్రయోజనాల గురించి నాన్న గారు వివరించి చెప్పారు. అలాగే ఏయే ప్రాంతాలు ఏయే చేతివృత్తులకు ప్రసిద్ధి పొందాయో చెప్పేవారు. ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి. పెంబర్తి, ఎంబోజింగ్ పనితనానికి పేరు పొందింది. ఇంతటి విలువైన కళారూపాలన్నీ తన తరంతోనే అంతరించిపోతాయేమోనని నాన్న బాధపడుతూ ఉండడం దగ్గరి నుంచి చూశాను. తానెక్కడకు వెళ్లినా నన్ను వెంట తీసుకువెళ్తూ స్థానిక రైతులు, కళాకారులు, చేతి వృత్తులను నాకు చూపించేవారు. ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టే సంప్రదాయ చేతివృత్తులు అంతరించిపోకుండా ఏదైనా చేయాలనే తపన నాలో పెరిగింది. అలా ఏర్పడిందే ‘జిష్ట’.
15 రాష్ట్రాలు... 650 మంది కళాకారులు
2016లో నేనీ పనికి పూనుకునే సమయానికి కొన్ని రకాల చేతివృత్తులు, కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వినియోగదారుల మద్దతు కొరవడడంతో సహజంగానే గిరాకీ తగ్గి, వాటి తయారీ ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని గమనించి అసలైన, ప్రామాణికమైన కళారూపాలకు కొత్త జీవం పోసి, వాటి విలువను, ప్రయోజనాలను వినియోగదారులకు తెలియచెప్పాలనే సంకల్పంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జిష్ఠను స్థాపించాను. ఈ ఏడాది జులైతో జిష్ఠను స్థాపించి ఒక దశాబ్దం పూర్తవుతుంది. జిష్ట స్థాపించిన తర్వాత 15 రాష్ట్రాలు తిరిగి విభిన్నమైన కళాకారులను కలిశాను. ప్రారంభంలో తమిళనాడులో స్థానికంగా మనుగడలో ఉన్న మూడు రకాల చేతివృత్తులతో జిష్టను మొదలుపెట్టాను. తమిళనాడు, కేరళ సరిహద్దులో తయారయ్యే ‘సెంగొట్టాయి దేశ కల్లు’ (దోశల పెనం), కుంభకోణంలో మాత్రమే తయారయ్యే ‘ఈయ చొంబు’ అనే టిన్ పాత్ర (రసం పాత్ర), రతి చిప్ప (రాతి పాత్ర)లతో జిష్టకు శ్రీకారం చుట్టి, నేడు 15 రాష్ట్రాలకు చెందిన 650 మంది కళాకారులతో కలిసి పనిచేస్తూ, 8 రకాల పదార్థాలతో రూపొందే 500 రకాల విభిన్నమైన పాత్రలను వినియోగదారులకు విక్రయించే స్థాయికి ఎదిగాను. వీటిలో 70 శాతం ఉత్పత్తులు వంట పాత్రలైతే, మిగతా 30 శాతం పూజ, అలంకరణ సామాగ్రి ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 దేశాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం!

పాత్రలు పోషకాలను జోడిస్తాయి
మన పూర్వీకులు 8 రకాల సంప్రదాయ పదార్థాలతో తయారైన పాత్రలను వంటలకు, పదార్థాల నిల్వకు ఉపయోగించడం వెనకొక బలమైన కారణం ఉంది. వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్య సంతులనంతో పాటు సామరస్యం సాధ్యపడుతుంది. ఇనుప పాత్రలో వంటతో ఐరన్‌ను పొందవచ్చు. కంచుతో జీర్ణవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి, త్రిదోషాలను సరిదిద్దుకోవచ్చు. రాగి, శుద్ధికి తోడ్పడుతుంది. రాయి, పోషకాలను ప్రోది చేస్తుంది, హానికారక సూక్ష్మక్రిములను చంపి, మెగ్నీషియంను అందిస్తుంది. రాయి, ఇనుము, మట్టి, కంచుతో తయారయ్యే పాత్రలు వేసవిలో మనకు అవసరమైన చల్లదనాన్ని అందిస్తాయి. ఇలా ప్రతి పదార్థం ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో 8 రకాల పాత్రలనూ ఉపయోగించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సాధారణంగా అల్యూమినియం వంటపాత్రలనే అందరూ ఎక్కువగా ఉపయోగిస్తారు.
వీటిలో పుల్లని పదార్థాలను వండుకున్నప్పుడు అల్యూమినియం కరిగి పదార్థాల్లో కలిసిపోతుంది. నాన్‌స్టిక్ పాత్రలకు గీత పడితే వాటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతాయి. స్టెయిన్‌లె్‌స స్టీల్ పాత్రల నుంచి కూడా క్రోమియం, నికిల్ లోహాలు లీక్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలన్నా, వంటకాలకు అదనపు పోషకాలు తోడవ్వాలన్నా, పర్యావరణహితానికి తోడ్పడాలన్నా సంప్రదాయ వంట పాత్రలనే ఎంచుకోవాలి.
గ్యారేజీ నుంచి దుకాణం వరకూ...
తిరునల్వేలి దగ్గరున్న కడయంలో మా మూలాలున్నాయి. కడయం దగ్గరున్న తెన్‌కాశిలో నేను పుట్టాను. నాన్న బ్యాంకు ఉద్యోగి కాబట్టి ఆయనతో పాటు రాష్ట్రాలు మారుతూ వేర్వేరు చోట్ల చదువు పూర్తి చేశాను. మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎమ్‌బిఎ చేశాను. గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ప్రారంభంలో 2016 జులై 16న బెంగుళూరులో, స్నేహితులకు చెందిన వంద చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఒక చిన్న కారు గ్యారేజీలో జిష్టను మొదలుపెట్టి ఏడాది తర్వాత ఒక చిన్న ఇంట్లోకి తరలించాను. ఆ తర్వాత 2021లో చెన్నైలో మొదటి దుకాణాన్ని నెలకొల్పి, తర్వాత బెంగుళూరు, హైదరాబాద్‌లకు విస్తరించాను. జిష్టతో, సంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగావకాశాలను నాలుగు రెట్లకు పెంచడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని ఏకంగా 30 రెట్లకు పెంచగలిగాను. జిష్ట అనే పేరును సంస్కృత పదమైన ‘శిష్ట’ నుంచి ఎంచుకున్నాను. శిష్ట అనే పదానికి ఉన్నత విద్యావంతులు, సంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు అని అర్థం. కాల పరీక్షలకు తట్టుకుని నిలబడిన సంప్రదాయాలు, పద్ధతుల పట్ల గౌరవంతో, చేతివృత్తులకు కొత్త జీవం పోయాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పనికి తగిన పేరు జిష్ట అని భావించాను.