Share News

శుభకార్యమా! ఏ బహుమతి ఇవ్వాలి?

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:00 AM

ఏదైనా ఒక శుభలేఖ వస్తే చెప్పలేని అలజడి మనసులో ప్రారంభం అవుతుంది. సంపన్నులైనవాళ్ళకి బహుమతి ఇవ్వడం ఒక లెక్క కాదు. మరీ దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళలో...

శుభకార్యమా! ఏ బహుమతి ఇవ్వాలి?

ఏదైనా ఒక శుభలేఖ వస్తే చెప్పలేని అలజడి మనసులో ప్రారంభం అవుతుంది. సంపన్నులైనవాళ్ళకి బహుమతి ఇవ్వడం ఒక లెక్క కాదు. మరీ దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళలో... వాళ్ళలో వాళ్ళకు ఒక అవగాహన, సర్దుబాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఏ బహుమతి ఇవ్వాలనేది పెద్దగా ఆలోచించాల్సినంత సమస్య కాదు. వచ్చే చిక్కల్లా మధ్యతరగతి వాళ్ళకే. ఏదో ఇచ్చేసి ‘మమ’ అనిపించుకుందాం అనుకుంటే ఇంట్లో భార్య, సంతానం అంగీకరించరు. అలాగని ఇతరులతో పోల్చుకొని ఇద్దామని భావిస్తే... తడిసి మోపెడవుతుంది. ఇలాంటి సందర్భాల్లో నాకు తెలిసిన ఎంతోమంది శుభకార్యం రోజున ఏదో వంకన తప్పించుకుంటున్నారు. బంధువులు వీరిని వెలి వేసినట్టుగా చూస్తున్నారు. మరి దీనికి ధర్మబద్ధమైన పరిష్కారం ఏమిటి? ఎందువల్ల అది ఉత్తమమైనది?


పురాణాల్లో ఉదాహరణలు ఎన్నెన్నో...

భాగవతాన్ని పరిశీలిస్తే... శ్రీహరి వామనునిగా అవతరించాడు. ఆయన ఉపనయనం జరిగింది. దేవతల గురువైన బృహస్పతి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు. చంద్రుడు పాలాశంలో (మోదుగ కర్రలో) ఉంటాడు కాబట్టి దాన్ని ఇచ్చాడు. ఆకాశ అధిదేవత ఒక గొడుగు ఇచ్చింది. బ్రహ్మగారు ఒక కమండలం బహూకరించారు. సప్త ఋషులు ఒక్కొక్క తీరు దర్భ చొప్పున ఏడు దర్భలను వామనుణ్ణి ఆశీర్వదిస్తూ ఇచ్చారు. తన చేతిలో నిరంతరం ఉండే భిక్షాపాత్రతో సమానమైన చక్కని భిక్షాపాత్రను శంకరుడు, తొలి బిచ్చాన్ని (ప్రథమ భిక్ష) పార్వతీదేవి, ఏ గాయత్రీ మంత్రోపదేశం అతి ముఖ్యమో దాన్ని ఆ గాయత్రీ మంత్రాధిదేవత అయిన సవిత (సూర్యుడు) ఇచ్చారు. గమనించండి... ఎవరెవరు నిత్య నియమ అనుష్ఠానాలతో వేటిని సొంతం చేసుకోగలిగారో వాటినే... అంటే తమ వద్ద ఉన్నవాటినే ఉపనయన శుభకార్యంలో వటువుకు ఆశీఃపూర్వకంగా ఇచ్చారు. శ్రీమద్రామాయణంలో... రామకథను గానం చేస్తున్న కుశలవులకు... అక్కడక్కడ ఆశ్రమాల్లో తపస్సు చేసుకోవడమే పరమ లక్ష్యంగా ఉన్న మహర్షులు ఒక్కొక్కరూ (కశ్చిత్ర్పాదాత్‌ యజ్ఞసూత్రం జపమాలా మథాపరః... ఆయుష్య మపరే ప్రోచుః...) క్రమంగా యజ్ఞోపవీతాన్ని, జపమాలను, తాము ధరించిన, దాచుకున్న రెండు కౌపీనాలు (గోచీలు) కాకుండా అదనంగా ఉన్న కౌపీనాలను బహుమతులుగా ఇచ్చారని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఉన్న అవధూతలు... తాము సంపాదించిన ఆ తపశ్శక్తితోనే కుశ-లవ ద్వయాన్ని ఆశీర్వదించారట. ఆశీస్సులుగా తపశ్శక్తిని ఇవ్వడం సామాన్యం కాదు కదా! ఇక పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి... సంగీతానికి అనుగుణంగా బ్రహ్మ తాళాన్ని మోగించగా, శ్రీహరి కంజీర వాయిద్యాన్నీ (పటహం), సూర్యచంద్రులు వేణునాదాన్ని, అప్సర కాంతలు శ్రుతి పెట్టెలను, నారదుడు సంగీత గానాన్ని, సరస్వతి వీణాధ్వనినీ తమ తమ కానుకలుగా సమర్పించుకున్నారట. శ్రీకృష్ణ దేవరాయలు తన భార్యలతో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి సందర్భంలో... అతను రాజ్యాధిపతి కాబట్టి విశాలమైన భూమిని, బంగారు ఆభరణాలను, సేవకులను సమర్పించారు.

అదే సరైన కానుక

ఇలా ఎవరెవరికి ఏయే నైపుణ్యం ఉందో, ఏది వారి ఆధీనంలో ఉందో వాటినే కానుకలుగా సమర్పించుకున్నారు. కురువరత్తినంబి కుమ్మరిదాసుడు కాబట్టి కుండలను, గాన నైపుణ్యం ఉన్న అన్నమయ్య రోజుకో కీర్తన గానపూర్వకంగానూ సమర్పించారు. కాబట్టి ఎవరికి ఏ విద్య వచ్చో దాన్ని, లేదా ఏ వృత్తి చేస్తున్నారో దానికి సంబంధించిన వస్తువును, ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార వస్తువును కానుకగా అందించడం సరైనది. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే... ఆ శుభకార్యం జరిగే దూరానికి కుటుంబ సమేతంగా చేస్తున్న రాకపోకలే పెద్ద కానుక.

-డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

Updated Date - Feb 27 , 2026 | 12:00 AM