ప్రశాంతత కోసం సర్వం వదలి
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:01 AM
ఎంబీఏ డిగ్రీ, ఫ్యాషన్ డిజైనింగ్‌లో నైపుణ్యం, సొంత బొటిక్ ద్వారా మంచి గుర్తింపు, ఆర్థికంగా స్థిరపడేందుకు ఎన్నో అవకాశాలు... కానీ... వ్యాపారం, ఆస్తిపాస్తులు, వ్యక్తిగత సౌకర్యాలు, విలాసాలు... అన్నిటినీ వదిలేసి ...
ఎంబీఏ డిగ్రీ, ఫ్యాషన్ డిజైనింగ్‌లో నైపుణ్యం, సొంత బొటిక్ ద్వారా మంచి గుర్తింపు, ఆర్థికంగా స్థిరపడేందుకు ఎన్నో అవకాశాలు... కానీ... వ్యాపారం, ఆస్తిపాస్తులు, వ్యక్తిగత సౌకర్యాలు, విలాసాలు... అన్నిటినీ వదిలేసి ఈ ఆదివారం జైన సాధ్వి దీక్ష స్వీకరణతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు సంజన లునావత్. పుట్టుకతో జైన కుటుంబానికి చెందని ఆమె ఆధ్యాత్మకతలోనే ఆనందం, ప్రశాంతత లభిస్తాయన్న నమ్మకమే తన నిర్ణయానికి కారణమంటున్నారు. తన అభిప్రాయాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
అయిదు వ్రతాలు... జీవితకాల నియమాలు
‘‘జైన సాధ్వుల జీవితం అయిదు మహావ్రతాలపై ఆధారపడి ఉంటుంది. అవి అహింస, సత్యం, అస్తేయం (దొంగతనం లాంటి పనులకు దూరంగా ఉండడం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (సంపదల మీద, వస్తువుల మీద మమకారం లేకుండా ఉండడం). ఈ వ్రతాలు కేవలం ఆచారాలు కావు. జీవితాంతం పాటించవలసిన నియమాలు. సాధ్వులు పాదరక్షలు లేకుండా నడవాలి. నిరాడంబరమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఆహార నియమాలను కచ్చితంగా పాటించాలి.
భౌతిక సౌఖ్యాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత ఆస్తులు, వస్తువులు, అలంకరణల మీద ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టాలి. అంతేకాదు... ‘కేశలోచ’ అనే సంప్రదాయ ఆచారంలో భాగంగా... తల వెంట్రుకలను ఒక్కొక్కటిగా చేతులతో పెకిలించుకోవాల్సి ఉంటుంది. ఇది శరీర సౌందర్యం మీద మమకారాన్ని విడిచిపెట్టడానికి ప్రతీక. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని, బొటిక్ నడిపిన నేను... ఇకపై అందమైన దుస్తులు, అలంకరణలకు దూరంగా ఉండడం, ఫ్యాన్లు, విద్యుత్ లాంటి సౌకర్యాలను వదిలెయ్యడం... చాలామందికి కష్టంలా కనిపించవచ్చు. కానీ వాటన్నిటినీ ఇష్టంగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’’
‘‘నా ఆధ్యాత్మిక ప్రయాణం నిన్ననో, మొన్ననో మొదలైనది కాదు. నాలో ప్రగాఢమైన భక్తికి పన్నెండేళ్ళ వయసులోనే బీజాలు పడ్డాయి. విద్యార్థినిగా హాస్టల్‌లో ఉన్న రోజుల్లో జైన ధార్మిక సమావేశాలకు, ప్రవచనాలకు వెళ్ళడం, జైన సాధువు బోధలు వినడం, ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేయడం అలవాటుగా మారింది. కొన్నాళ్ళకు ఈ సంగతి బంధువుల ద్వారా నా తల్లిదండ్రులకు తెలిసింది. మేము జైనులం కాదు. కానీ ఆ ధర్మం పట్ల నాకు ఆసక్తి పెరుగుతోందని వారు సంతోషించారు. అయితే... ఎక్కడ సాధ్విగా మారుతానోనని భయపడ్డారు కూడా. చివరకు వారి భయమే నిజమయింది.
ఆ మార్గాన్నే ఎంచుకున్నా
నేను మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా భడగావ్ పట్టణంలో పుట్టి పెరిగాను. నా ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే సాగింది. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం నాసిక్ వెళ్ళాను. అక్కడ బీబీఏ వరకూ చదివాను. ముంబైకి వెళ్ళి ఎంబీఏ పూర్తి చేశాను. అక్కడే ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేశాను. కానీ సొంతంగా ఏదైనా చెయ్యాలనిపించింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ పొందాను. నా కజిన్‌తో కలిసి సొంతంగా బొటిక్ ప్రారంభించాను. క్రమంగా వ్యాపారం అభివృద్ధి చెందింది. మా బొటిక్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
యువ వ్యాపారవేత్తగా ఎదగడానికి మంచి అవకాశాలు కూడా లభించాయి. అయితే... నా మనసు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికత వైపే మొగ్గు చూపేది. జైన గ్రంథాల అధ్యయనం, బోధలు వినడం కొనసాగుతూ వచ్చింది. నాకు నిజమైన ఆనందం, మనశ్శాంతి ప్రశాంతత ఈ భౌతిక ప్రపంచంలో కాకుండా జైన ధర్మానికి అంకితమైన జీవితంలోనే లభిస్తాయనే నమ్మకం బలపడింది. ఒక వైపు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆర్థిక స్వావలంబన... మరోవైపు సంయమనం, త్యాగం, ఆత్మ సాధన... చివరకు రెండో మార్గాన్నే ఎంచుకున్నాను.
మూడేళ్ళుగా సన్నాహాలు
జైన సాధ్విగా మారడం అంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించడం, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు. పూర్తిగా భిన్నమైన జీవన విధానాన్ని స్వీకరించడం. వ్యక్తిగత అలవాట్లు, ఆహారం, వస్త్రధారణ, నడవడిక, కుటుంబ సంబంధాలు, భౌతికమైన సౌకర్యాలు.. వీటన్నిటినీ మార్చుకోవాలి. అంతటి కఠినమైన జీవితానికి ఒక్కసారిగా సిద్ధం కావడం కష్టం. అందుకే మూడేళ్ళపాటు నన్ను నేను మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకున్నాను.
సాధ్వి జీవితం సులభం కాదని నాకు తెలుసు. దానికి ఎన్నో నియమాలు, పరిమితులు ఉంటాయి. శారీరకమైన ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. అయినా అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నేను వదులుకుంటున్నదానికన్నా నేను అన్వేషిస్తున్న ఆధ్యాత్మిక లక్ష్యమే నాకు ముఖ్యం. కుటుంబ సంబంధాల మీద నాకున్న భిన్నమైన దృక్పథం కూడా నా నిర్ణయానికి మరో కారణం. నేను పెళ్ళి చేసుకుని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నా తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు మాత్రమే వారిని కలుసుకోగలను. కానీ జైన సాధ్విగా మారితే ధార్మిక కార్యక్రమాలు, సమావేశాల్లో కూడా నన్ను కలుసుకునే అవకాశం ఉంటుంది. మొదట్లో నా మీద బెంగపడొచ్చు.
నా నిర్ణయాన్ని అంగీకరించడం కష్టంగా అనిపించవచ్చు. అయితే ప్రపంచంలో ఏ బంధం శాశ్వతం కాదు. జీవితంలో విడిపోవడం, మార్పు, మరణం సహజం. తమకు అత్యంత దగ్గరైనవారిని కోల్పోయాక... కొంతకాలానికి ఆ బాధ నుంచి మనుషులు బయటపడి జీవితాన్ని కొనసాగించడం నన్ను ఆలోచింపజేసింది. ఆ ఆలోచనలు, అనుభవాలు భౌతిక బంధాలమీద మమకారాన్ని తగ్గించుకొని, ఆధ్యాత్మిక మార్గం వైపు నడవాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచాయి.
వారి త్యాగం గొప్పది...
అయితే నా నిర్ణయం... నాకే కాదు, నా తల్లిదండ్రులకు కూడా పెద్ద పరీక్షగా మారింది. మా అమ్మ పేరు మమత. మా నాన్న కన్వర్‌లాల్, నా అన్నయ్య శుభమ్ ఆటో మొబైల్ వ్యాపారంలో ఉన్నారు. నేను మంచి చదువులు చదివి, ఉద్యోగం చేసి, ఆ తరువాత వ్యాపారంలో ఎదగడం చూసి నా కుటుంబం ఎంతో ఆనందించింది. నేను సాధ్విగా మారాలని అనుకున్నాక... వారు అంగీకరించేదాకా స్వీట్లు, పండ్లు లాంటివన్నీ తినడం మానేశాను.
నా సంకల్పం ఎంత బలంగా ఉందో వారికి చూపించడమే దాని ఉద్దేశం. ఏది ఏమైనా కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచి, చదివించి, జీవితంలో స్థిరపడితే చూడాలని ఆశించిన తల్లిదండ్రులకు.. ఆమెను శాశ్వతంగా మరో జీవన మార్గంలోకి పంపడం అంత సులభం కాదు. కానీ వారు చివరకు నా ఆకాంక్షను అర్థం చేసుకొని అంగీకరించారు. వారి త్యాగం చాలా గొప్పది.
మహారాజ్ మార్గదర్శకత్వం
సాధ్వి జీవితానికి సిద్ధమవుతున్న క్రమంలో జైన ధార్మిక గ్రంథాలను, సూత్ర గ్రంథాలను, భక్తి స్తోత్రాలను, ఇతర అంశాలను అధ్యయనం చేశాను. ఆచార్య ప్రవర్ 1008 శ్రీ జ్ఞానచంద్రజీ మహారాజ్ సాహెబ్ మార్గదర్శకత్వం, మహాసాధ్వి శ్రీ లలితాశ్రీజీ మహారాజ్ సాహెబ్ ఆశీస్సులు, ప్రేరణ దీనికి ఎంతగానో దోహదం చేశాయి. మరింత సంపాదించాలని, ఎక్కువ సాధించాలని ఉన్నత స్థానాలకు ఎదగమని ఈ ప్రపంచం యువతకు చెబుతుంది.
కానీ నిజంగా సంతోషంగా ఉండడానికి మనిషికి ఏంకావాలి? నిరాడంబరత, సంయమనం, త్యాగం, ఆత్మసాధనతో కూడిన జీవితమే నాకు ఆనందాన్ని ఇస్తుందనేది నా విశ్వాసం. అందుకే రేపు (15న) జైన భగవతి దీక్ష స్వీకరించి... కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను.’’
సంజన జైన భగవతి దీక్షా మహోత్సవాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నాం. పూజ్య ఆచార్య 1008 శ్రీ జ్ఞానచంద్రజీ మహారాజ్ సాహెబ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. నేడు లలితా కళాతోరణం నుంచి భారీ ఊరేగింపు, రేపు (15న) ప్రధాన దీక్షా కార్యక్రమం ఉంటాయి. శ్రీ వర్ధమాన్ స్థానక్‌వాసీ జైన్ శ్రావక్ సంఘ్, గ్రేటర్ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవానికి పదివేల మందికి పైగా జైన భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నాం.
- మనోజ్ కోఠారి
దీక్షా మహోత్సవ ప్రణాళిక కన్వీనర్
‘‘జైన సాధ్వులుగా మారడానికి జైన కుటుంబాల్లోనే జన్మించాల్సిన అవసరం లేదు. వివిధ మతాలు, సామాజిక నేపథ్యాలకు చెందినవారు కూడా జైన సన్యాస జీవితాన్ని స్వీకరించారు. సుమారు 20 వేల మంది జైన సాధువులు, సాధ్వులలో వెయ్యి మందికి పైగా జైనేతర కుటుంబాల నుంచి వచ్చినవారే. చిన్న వయసులోనే కెరీర్, వ్యాపారం, కుటుంబ జీవితం, భౌతిక సౌకర్యాలను వదులుకోవడం అసాధారణమైన నిర్ణయం. దానికి ఎంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక నిబద్ధత అవసరం. సంజన సంకల్పానికి, ఆమెకు అండగా నిలిచిన తల్లిదండ్రులకు అభినందనలు.’’
- స్వరూప్‌చంద్ కోఠారి, దీక్షా మహోత్సవం చైర్మన్, ముఖ్య కన్వీనర్