Share News

నాన్న కలను, దేశాన్ని గెలిపించింది

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:46 AM

తండ్రి మరణం, పోటీల్లో వరుస వైఫల్యాలు... వేటికీ మనీషా భన్వాలా కుంగిపోలేదు.ప్రతి అవరోధాన్ని నిబద్ధతతో, పోరాటపటిమతో ఎదుర్కొని.... దేశానికి గర్వకారణంగా నిలిచింది. సీనియర్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళగా చరిత్రకెక్కింది.

నాన్న కలను, దేశాన్ని గెలిపించింది

కిందటి వారం చివర్లో... కజకిస్తాన్‌లోని అస్తానాలో మనీషా భన్వాలా గెలిచిన స్వర్ణపతకం ఆమెకు ఎన్నో విధాలుగా ప్రత్యేకం. సీనియర్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి ఒక మహిళ సాధించిన మొదటి బంగారు పతకం. అంతర్జాతీయ వేదికల మీద వరుస వైఫల్యాలు ఎదురైనా... పడిలేచిన కెరటంలా విజృంభించిన మనీషా కృషికి ప్రతిఫలం. అన్నిటికీ మించి... తన విజయాల కోసం పరితపించిన తండ్రికి ఆమె అందించిన ఘన నివాళి. ‘‘2022కు ముందు... నేను నాకోసం రెజ్లింగ్‌ చేసేదాన్ని. ఆ ఏడాది నా తండ్రి మరణించారు.

దాంతో ప్రతిదీ మారిపోయింది. ఆయనకు గర్వపడేలా ఉండాలని అనుక్షణం తపిస్తున్నాను’’ అని చెప్పిన మనీషా... వరల్డ్‌ ఛాంపియన్‌గా పతకాన్ని అందుకున్నాక... తన తండ్రి ఫొటో ఉన్న టీ షర్ట్‌ను ప్రదర్శించింది. తన విజయాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించింది. ‘‘ఈ అద్భుతమైన క్షణాలను చూసేందుకు నాన్న భౌతికంగా లేకపోవచ్చు. కానీ నాకోసం ఆయన చేసిన త్యాగాలు, కన్న కలలు, అందించిన ఆశీస్సులు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి’’ అని ఆమె చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను తాకాయి.


‘రెజ్లింగ్‌’ ఆపేద్దామనుకున్నా...

హర్యానాలోని జింద్‌ జిల్లా సివాహా గ్రామంలో పుట్టిన మనీషా టీనేజీలో అధిక బరువుతో, స్థూలకాయంతో ఉండేది. వాటిని తగ్గించుకొని, ఫిట్‌గా మారాలనుకున్నప్పుడు... మనీషాను ఆమె తండ్రి సురేశ్‌ వారి గ్రామానికి దగ్గరగా ఉన్న ఒక స్పోర్ట్స్‌ స్కూల్లో కబడ్డీ శిక్షణకు చేర్పించారు. ‘‘కొన్నాళ్ళ తరువాత రెజ్లింగ్‌కు మారాను. దానికి కారణం రెజ్లింగ్‌ కోచ్‌ అయిన మా అంకుల్‌ వినోద్‌’’ అని గుర్తుచేసుకుంటుంది మనీషా. ఆమె ప్రతిభను గుర్తించిన వినోద్‌, తండ్రి సురేశ్‌... రోహ్‌తక్‌లోని ఒక అకాడమీలో చేర్చారు. అక్కడ మనీషా తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంది. వివిధ స్థాయిల్లో పతకాలు గెలిచింది. 2022 ఏప్రిల్‌లో... తొలిసారిగా సీనియర్‌ ఆసియన్‌ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనడానికి సన్నద్ధమయింది. కానీ గుండెపోటుతో ఆమె తండ్రి హఠాత్తుగా మరణించారు. అదే రోజు రాత్రి విమానంలో మంగోలియాకు ఆమె వెళ్ళాలి. తండ్రి మరణవార్త విన్న వెంటనే స్వగ్రామానికి బయలుదేరడానికి మనీషా సిద్ధమయింది.

‘‘నాన్న ఇక లేరనే సంగతి నేను తట్టుకోలేకపోయాను. కన్నీరు ఆగడం లేదు. నేను దేశం గర్వపడే రెజ్లర్‌ కావాలని ఆయన కోరుకున్నారు. ఆయనే లేకపోయిన తరువాత ఇక రెజ్లింగ్‌తో పనేముంది? అని కూడా ఆలోచించాను. అదే మాట నా కుటుంబ సభ్యులకు చెప్పాను. మా అమ్మ, అన్నయ్య ఒప్పుకోలేదు. ‘‘నీకోసం నాన్న ఎన్నో కలలు కన్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఇంకేదీ ఆలోచించకు. మంగోలియా వెళ్ళు. పతకంతో తిరిగిరా’’ అని నాలో ధైర్యం నింపారు’’ అని చెప్పింది మనీషా. వేదనను దిగమింగుకొని, ఆ పోటీలో పాల్గొంది. తన తొలి సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. మూడేళ్ళపాటు ఏషియన్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షి్‌పలో రెండు కాంస్యాలు, ఒక స్వర్ణం సాధించి తన సత్తాచాటింది.


అన్నిటికీ... ఒకేలా సిద్ధమవుతా!

మనీషా కెరీర్‌ ఒడుదొడుకులమయం. రెజ్లింగ్‌ కెరీర్‌ను ఆలస్యంగా మొదలుపెట్టిన ఆమె జయాపజయాలు రెండిటినీ చవిచూసింది. 2024లో అల్బేనియాలో కాంస్యం అందుకున్నాక... మూడు సీనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లలో ఉత్త చేతులతోనే వెనుతిరగాల్సి వచ్చింది. ఒక పోటీలో అయిదో స్థానానికి పరిమితమయింది. ‘‘అది చాలా బాధాకరమైన అనుభవం. దాన్ని తట్టుకోలేకపోయాను. విజయాల బాట పట్టడం కోసం ముమ్మరంగా సాధన చేశాను. 62, 65 కేటగిరీల్లో పోటీ పడ్డాను. ఆ తరువాత 57, 59 కేటగిరీలకు మారాను. అది అంత సులువు కాదు.. ఆహారం, బరువు, దారుఢ్యం లాంటి అంశాల్లో ఎన్నో జాగ్రత్తలు కావాలి. ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని ఆనందంగా స్వీకరించాను. ఇష్టమైన స్వీట్లు తినడం పూర్తిగా మానేశాను’’ అంటున్న మనీషా వయసు ఇప్పుడు 29 ఏళ్ళు.

తన కేటగిరీలో ఎప్పటికప్పుడు కొత్తవాళ్ళు వస్తూ ఉంటారు. వారితో పోటీ పడి, తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే... ఫిట్‌నెస్‌, వెయిట్‌ మేనేజిమెంట్‌ ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. దేన్నీ తేలికగా తీసుకోదు. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా ఛాంపియన్‌షిప్, వరల్డ్‌ ర్యాంకింగ్‌ ఈవెంట్‌... నా దృష్టిలో ఏదైనా ఒకటే. అన్నిటికీ ఒకేలా సిద్ధమవుతాను. ఒత్తిడిని దగ్గరకు రానివ్వను’’ అంటుందామె.


పడిలేచిన కెరటంలా...

తాజాగా అస్తానాలో జరిగిన వరల్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో మనీషా పోరాడిన తీరు ఆమె పట్టుదలకు నిదర్శనం. ఒక దశలో... 0-6తో వెనుకబడి ఉన్న ఆమె... ఆ తరువాత పడిలేచిన కెరటంలా విజృంభించి, తన అమెరికన్‌ ప్రత్యర్థి అబిగెల్‌ నెట్‌ను 8-6తో ఓడించింది. పురుషుల విభాగంలో 2010లో దిగ్గజ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించగా, ఆ తర్వాత భారత్‌కు 16 ఏళ్ళ తర్వాత ఆ పోటీల్లో స్వర్ణం అందించిన రెండో భారత రెజ్లర్‌గా, తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ‘‘నా కల, నాన్న కల ఇంకా పూర్తి కాలేదు. నా తదుపరి లక్ష్యం 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడం. ఇప్పుడు నా దృష్టంతా దానిపైనే’’ అని చెబుతోంది తన విజయంతో ఎందరికో స్ఫూర్తినిస్తున్న మనీషా.

Updated Date - Nov 04 , 2026 | 01:18 AM