యాభైల్లో ఇరవైలా...
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:34 AM
మలైకా అరోరా అనగానే, కళ్లు చెదిరే డాన్స్ సాంగ్స్, అంతకు మించిన ఆసక్తికరమైన ఫిట్‌నెస్ సెషన్స్ గుర్తొస్తాయి. 53 ఏళ్ల వయసులో టీనేజీ అమ్మాయిలా మెరిసిపోయే మలైకా అందం వెనక కఠోర క్రమశిక్షణ, ఆరోగ్యం పట్ల అంకిత భావాలు దాగి ఉన్నాయి. ఆమె పుట్టిన రోజు, అక్టోబరు 23 సందర్భంగా... ఆ హిందీ నటి, టెలివిజన్ పర్సనాలిటీ గురించిన ఆసక్తికరమైన విశేషాలు...
నాజూకుగా, యవ్వనంగా కనిపించడం కోసం దగ్గర దారులను వెతుక్కునే వారే ఎక్కువ. కానీ మలైకా ఇందుకు భిన్నంగా ఫిట్‌నెస్‌ను, ఆరోగ్యకరమైన ఆహార శైలినీ దైనందిన జీవితంలో భాగం చేసుకుంది. అలాగే వ్యాయామాలతో పాటు యోగాకూ ప్రాధాన్యం ఇచ్చింది. కాబట్టే ఐదు పదుల వయసులో యవ్వనం ఉట్టిపడే యువతిలా మెరిసిపోతోంది. ఫిట్‌నెస్‌ను తక్కువ కాల వ్యవధిలో అందుకునే లక్ష్యంగా కాకుండా, జీవనశైలిగా మలుచుకోవాలని కూడా మలైకా పలు ఇంటర్వ్యూలో చెప్పింది. ఎంతో మందికి ప్రేరణగా మారిన మలైకా ఫిట్‌నెస్ రొటీన్ ఇదిగో ఇలా ఉంటుంది.
యోగాతో ఫిట్‌నెస్ ప్రయాణం
సంతులనం, నమ్యత, నియంత్రిత శ్వాసలను సాధించడానికి మలైకా యోగాను ఎంచుకుంది. ఆమె ఫిట్‌నెస్ జర్నీలో యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. చాలా మంది తమకు సహజసిద్ధ నమ్యత లేదనుకుంటారు. కానీ అలాంటివాళ్లు కూడా నిర్భయంగా యోగా సాధన మొదలుపెట్టాలనీ, భిన్నమైన ఫిటెనెస్ లెవల్స్ కలిగినవాళ్లు కూడా యోగాతో ప్రయోజనం పొందవచ్చనీ అభిమానులను ప్రోత్సహిస్తూ ఉంటుంది మలైకా. అలాగే విపరీతమైన శ్రమకు లోను చేసే వ్యాయామాలను కొన్ని రోజుల పాటు కొనసాగించి విరమించుకోడానికి బదులుగా, స్థిరంగా, కుదురుగా తేలికపాటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం ఆరోగ్యకరమనే సూత్రాన్ని నమ్ముతుంది మలైకా! నడకతో మొదలుపెట్టి, చిన్నపాటి యోగా సెషన్‌తో కొనసాగుతూ, చమటలు పట్టే వ్యాయామాలు చేసే స్థాయికి ఎదిగేలా వ్యాయామ తీవ్రతను క్రమేపీ పెంచుకోవాలని కూడా సూచిస్తోంది.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరి
మలైకా ఫిట్‌నెస్‌లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒక ముఖ్యమైన భాగం. కండర అభివృద్ధికీ, పటుత్వానికీ బరువులతో వ్యాయామాలు చేయాలని అంటోందామె. కేవలం రూపం ఒక్కటే ప్రధానం కాదనీ, శక్తిని కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యమనీ సూచిస్తోంది మలైకా! ఫిట్‌నెస్ రొటీన్‌లో భిన్నమైన వ్యాయామాలకు చోటు కల్పిస్తూ ఉంటుందామె. ప్రతి రోజూ ఒకే తరహా వ్యాయామాలతో దీర్ఘకాలంలో ఫలితాలు రాబట్టడం అసాధ్యమనీ, భిన్నమైన వ్యాయామాలను ఎంచుకుంటూ స్ట్రెచెస్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఫంక్షన్ ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌తోనే పరిపూర్ణ ఫిట్‌నెస్ సాధ్యపడుతుందనీ అంటోందామె. ఎవరికి వారు వారి శరీర దారుఢ్యం, వయసు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా నప్పే వ్యాయామాలను ఎంచుకోవాలని పలు సందర్భాల్లో పేర్కొంది.
ఆహారం... ఆచి తూచి
మలైకా ఇంటి వంటకే ప్రాధాన్యం ఇస్తుంది. ఒక సందర్భంలో సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో, ఇంటి వంట గురించి, నెయ్యి పట్ల తనకున్న ఇష్టం గురించీ వివరించింది మలైకా. తన ఆహారంలో కూరగాయలకు, ప్రొటీన్‌కు ప్రాధాన్యం ఇస్తాననీ, తృణధాన్యాలు కీలకమైన ఖనిజ లవణాలను అందిస్తాయనీ, ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా ఆహారంలో ఉండేలా చూసుకుంటాననీ వివరించిందామె.
వ్యాయామంతో పాటు...
ఫిట్‌నెస్ అంటే వ్యాయామం ఒక్కటే కాదు... సరిపడా నిద్ర, హైడ్రేషన్, రికవరీ కూడా ముఖ్యమేనని అంటోంది మలైకా. ఇలాంటి అలవాట్లు జిమ్ సెషన్ కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపించకపోయినా, సుస్థిరమైన వెల్‌నె్‌సలో ఇవన్నీ ముఖ్య పాత్ర పోషిస్తాయని అంటోంది. బిజీ షెడ్యూళ్లలో గడిపేటప్పుడు జిమ్ వ్యాయామాలు సాధ్యపడవు. అలాంటి సందర్భాల్లో నడకను ఎంచుకుంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మలైకా.