Share News

Makara Sankranti: సంక్రాంతి శుభక్రాంతి

ABN , Publish Date - Jan 09 , 2026 | 03:49 AM

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని ‘సంక్రమణం’ అంటారు. అలా మకర రాశిలో ప్రవేశించే శుభ సందర్భం... మకర సంక్రమణం....

Makara Sankranti: సంక్రాంతి శుభక్రాంతి

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని ‘సంక్రమణం’ అంటారు. అలా మకర రాశిలో ప్రవేశించే శుభ సందర్భం... మకర సంక్రమణం. ఆ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంఅవుతుంది. సంక్రాంతి అనే పదంలో ‘సం’ అంటే శుభం, ‘క్రాంతి’ అంటే పరివర్తన లేదా విప్లవం. ‘సంక్రాంతి’ అంటే శుభ పరివర్తన కలిగే రోజు.

సకల జీవరాశికి ప్రాణాధారం సూర్యుడు. ఆయన అనుగ్రహం లేకపోతే ప్రాణికోటికి మనుగడ లేదు. కాబట్టి ఆయనకు నిరంతరం మనం కృతజ్ఞతలు తెలుపుకొంటూ ఉండాలి. మకర సంక్రాంతి రోజున... అప్పటివరకూ దక్షిణంవైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తరంవైపు సంచారం ఆరంభిస్తాడు. సూర్యుడి గమనం మారడం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు నిరంతరం జ్వలిస్తూ సమస్త విశ్వానికి మేలు చేకూరుస్తాడు. అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదంతా చేసేది తానే అనుకోకుండానే... దీన్నంతటినీ ఆయన నిర్వహిస్తాడు. ఈ గుణాలను మనలో పెంపొందించుకుంటే అహంకారానికి తావు ఉండదు.

సమతుల్యత కావాలి...

మకర సంక్రాంతి విశిష్టమైన పండుగ. పండిన పంటలు ఇంటికి చేరే సమయంలో... నిర్వహించుకొనే వేడుక. మనకు ఆహారాన్ని ప్రసాదించే నేల తల్లికి కృతజ్ఞతలు తెలుపుకొనే సందర్భం. మిగిలిన పండుగలన్నిటినీ మనం చంద్రుడి గమనం ఆధారంగా... చాంద్రమాన పద్ధతిలో జరుపుకొంటాం. కానీ సంక్రాంతి సూర్య గమనం ఆధారంగా, సౌరమానం ప్రకారం జరుపుకొనే పండుగ. సూర్య చంద్రుల గమన ప్రభావం మనమీద బాహ్యపరంగానే కాదు... మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థ మీద కూడా ఉంటుంది. మనలో ఎడమవైపు ఇడానాడి అంటే చంద్రనాడి, కుడివైపు పింగళనాడి అంటే సూర్యనాడి ఉంటాయి. సూర్యనాడి క్రియా శక్తిని, చంద్రనాడి ఇచ్ఛాశక్తిని సూచిస్తాయి. మనం మన శక్తికి మించిన పని చేసినప్పుడు లేదా అతిగా ఆలోచిస్తున్నప్పుడు... కుడిపార్శ్వం మీద... అంటే సూర్యనాడి మీద భారం పడుతుంది. అలాగని ఏ పనీ చేయాలనే కోరిక లేకుండా, ఎప్పుడూ సోమరితనంతో ఉండేవారిలో ఎడమ పార్శ్వానికి అంటే చంద్రనాడికి సమస్యలు వస్తాయి. ధ్యానం ద్వారా సూర్యనాడిని, చంద్రనాడిని సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి. ఇది సహజయోగ ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది.


ఆప్యాయతను పంచే సంకేతం

మన దేశంలోని పలు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి పల్లె ప్రాంతాల్లో సంక్రాంతిని ప్రధానమైన పండుగగా ఘనంగా నిర్వహిస్తారు. మొదటిరోజున భోగి, రెండోరోజున మకర సంక్రాంతి, మూడో రోజున కనుమ పండుగలను జరుపుకొంటారు. ఏడాదంతా కష్టపడి పండించిన ధాన్యం సంక్రాంతి సమయానికి పొలాల నుంచి ఇళ్ళకు చేరుకుంటుంది. ధాన్య లక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో, పూల దండలతో అలంకరిస్తారు. వాకిళ్ళలో అందమైన రంగవల్లులు దిద్దుతారు. ఆ ముగ్గులలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. కొత్త బియ్యంతో పొంగలి చేసి, నైవేద్యాలు పెడతారు. అందుకే ఈ పండుగను ‘పొంగల్‌’ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి పండుగ రోజున చాలా రాష్ట్రాల్లో నువ్వులు, బెల్లంతో పిండి వంటలు చేస్తారు. ఇది ఎంతో శాస్త్రీయమైన సంప్రదాయం. సూర్యరశ్మిలోని అతి ఉష్ణం కోపాన్ని పెంచుతుంది, దానివల్ల మాటల్లో కరుకుదనం ఏర్పడుతుంది. కాబట్టి తియ్యని బెల్లాన్ని నువ్వులతో కలిపి ఇతరులకు పంచడం వల్ల ఆత్మీయత పెరిగి, మాటల్లో మాధుర్యం వెల్లివిరుస్తుందని పెద్దలు చెప్పారు. అంటే ఇతరులకు ఆప్యాయతను పంచే ఒక సంకేతం ఇది. జానపద కళా సంప్రదాయాలైన గంగిరెద్దుల ఆట, హరిదాసుల కీర్తనలు లాంటివి ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. కనుమ రైతులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువులకు కృతజ్ఞతతో పూజలు చేయడం ఆనవాయితీ. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైనది కాబట్టి... సహజయోగ సాధన ద్వారా మనం సమతుల్య స్థితిలో ఉంటూ, ప్రకృతితో మమేకం కావాలి. ప్రకృతి ధర్మాలను అనుసరించాలి. మనలో ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకోవాలి.

Updated Date - Jan 09 , 2026 | 07:16 AM