Share News

మహౌషధి మారేడు

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:02 AM

మారేడు చెట్టు శివ భక్తులకు చాలా పవిత్రమైంది. మనకన్నా ఉత్తరాదిలో ఈ మొక్కలు విస్తృతంగా పెరుగుతాయి. దాన్ని శివాలయాలలోనే పెంచుతారనే భావనతో మనవాళ్లు తోటల్లో దీన్ని పెంచటానికి శ్రద్ధ చూపలేదు.

మహౌషధి మారేడు

మారేడు చెట్టు శివ భక్తులకు చాలా పవిత్రమైంది. మనకన్నా ఉత్తరాదిలో ఈ మొక్కలు విస్తృతంగా పెరుగుతాయి. దాన్ని శివాలయాలలోనే పెంచుతారనే భావనతో మనవాళ్లు తోటల్లో దీన్ని పెంచటానికి శ్రద్ధ చూపలేదు. మారేడుని బిల్వం లేదా శ్రీఫలం అంటారు. ఇది నిమ్మ (రూటేసీ) కుటుంబానికి చెందిన చెట్టు. దీని కాయని, పండుని కూడా ఆహార పదార్థాల తయారీకి వాడుకోవచ్చని ‘భోజన కుతూహలం’ గ్రంథం సూచిస్తోంది. మారేడు లేత కాయకూ, పండుకూ గుణాలు వేర్వేరుగా ఉంటాయి.

మారేడు కాయ...

ఇది తేలికగా అరుగుతుంది. గ్రాహి... అంటే శరీరంలో అదనంగా ఉండే నీటిని పీల్చే స్వభావం దీనిది. అందువల్ల నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు శరీరంలో నుంచి జలధాతువు బయటకు పోకుండా ఆపి, శోష రాకుండా కాపాడుతుంది. శరీరానికి మృదుత్వాన్ని ఇస్తుంది. చేదుగా, వగరుగా ఉంటుంది కాబట్టి దీన్ని కేవలం ఆయుర్వేద ఔషధాల తయారీలోనే ఎక్కువగా వాడతారు. షుగరు రోగులకు, స్థూలకాయులకూ ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. వాత వ్యాధుల్లో బాగా పని చేస్తుంది. కఫాన్ని అణచివేస్తుంది. న్యుమోనియా లాంటి జ్వరాల్లో బాగా పని చేస్తుంది. చేదుగా ఉంటుంది కానీ, దీన్ని తీసుకున్న తరువాత వాంతి, వికారాల్ని తగ్గించే ఔషధంగా మారిపోతుంది. ఆగకుండా వచ్చే ఎక్కిళ్లు ఆగుతాయి. అతిసార, అమీబియాసిస్‌లకు ఇది అద్భుత ఔషధం. పేగుల్లో వచ్చే వ్యాధులన్నింటిపైనా మారేడు కాయ మంచి ప్రభావం చూపుతుంది.


మారేడు పండు...

పండిన మారేడు ఆహారంగా ఉపయోగించే పండు. అయితే ఈ పండు ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కానీ తీక్షణంగా పని చేస్తుంది. వేడిని తగ్గించి శరీరానికి చలవనిస్తుంది. ఎంత పండితే అంత రుచికరంగా ఉంటుంది. పండినకొద్దీ ఇది జెల్లీలాగా అవుతుంది. ఎన్నటికీ అదుపులోకి రాని దోషాలను దారికి తెస్తుందంటారు. బహుశా శరీరంలోని ధాతువులన్నింటిలోకి వేగంగా చొచ్చుకుపోయే గుణం ఇందుకు కారణం కావచ్చు. మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జు తీసి, నీటిలో వేసి, తేనె కలుపుకొని తాగుతారు. దీంతో పానకం, శర్బత్‌, తీపి పదార్థాలు, జామ్‌ వంటి వాటిని కూడా తయారు చేస్తారు.

భాగాన్ని బట్టి ప్రభావం...

ఆయుర్వేదంలో మారేడు పండుతో పాటు చెట్టు వేరు, బెరడు, ఆకులు, కాయలను వేర్వేరు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. చరక సంప్రదాయంలో బిల్వాన్ని కొన్ని ఔషధ సమూహాల్లో చేర్చారు. సుశ్రుత సంప్రదాయంలో కూడా బిల్వం పలు గణాల్లో ప్రస్తావించబడింది. ఆయుర్వేద ద్రవ్యగుణ వర్ణనలో ముఖ్యంగా వాత, కఫ సంబంధమైన దోషాలను సమతుల్యం చేసే ద్రవ్యంగా దీన్ని పేర్కొన్నారు. అయితే... మారేడులో ఏ భాగాన్ని వాడుతున్నాం, ఎంత మోతాదులో వాడుతున్నాం, పండా? పచ్చి కాయా? అన్నదాన్నిబట్టి దాని ప్రభావం మారుతుంది. అందువల్ల మారేడు అన్నిటికీ మందు అనే సాధారణీకరణ ఆయుర్వేద గ్రంథాల అసలు విధానాన్ని ప్రతిబింబించదు.

మూడు ఆకుల రెమ్మగా పెరుగుతుంది మారేడు. ఈ మూడు ఆకుల్ని శివుడి త్రిశూలంతోనూ, శివుడి మూడు కళ్లుగానూ, ఇంకొందరు త్రిమూర్తులకు గుర్తుగానూ భావిస్తారు. అది మన జీవన విధానంలో ఆహారం, వైద్యం, ఆచారం అనే మూడు అవసరాలను కలిపిన వృక్షం.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Oct 03 , 2026 | 01:02 AM