వెరైటీ స్పైసీ రుచులు..!
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:01 AM
మహారాష్ట్ర.. స్పైసీ వంటకాలకు ప్రసిద్ధి. వాటిలో కొన్ని రుచులు అక్కడి నగరాల పేరుతో ప్రాచుర్యం పొందాయి కూడా. అలాంటి కొన్ని వెరైటీ స్పైసీ వంటకాలు మీకోసం...
బటాటా వడ
కావాల్సిన పదార్థాలు
ఆలుగడ్డలు- నాలుగు, శనగపిండి- కప్పు, బియ్యప్పిండి- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, పసుపు- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, నిమ్మరసం- చెంచా, వంటసోడా- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం
ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసి కొద్దిగా మెదిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి రెండు చెంచాల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి మిర్చి ముక్కలు, పసుపు వేసి దోరగా వేయించాలి. తరువాత ఆలుగడ్డ ముద్ద, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించి చల్లార్చి చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, వంటసోడా వేసి కొద్దికొద్దిగా నీటిని చిలకరించుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడిచేయాలి. ఆలుగడ్డ ఉండలను శనగపిండి మిశ్రమంలో ముంచి మెల్లగా వేడి నూనెలో జారవిడచాలి. అన్ని వైపులా ఎర్రగా వేగిన తరువాత వాటిని పళ్లెంలోకి తీయాలి. ఈ బటాటా వడలను వేడివేడిగా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయవచ్చు.
కొల్హాపురి స్పైసీ చికెన్
కావాల్సిన పదార్థాలు
బోన్లెస్ చికెన్ ముక్కలు- అరకేజీ, ఎండు మిర్చి- పది, అనాసపువ్వు- ఒకటి, జాజికాయ ముక్క- చిన్నది, యాలకులు- రెండు, బిరియానీ ఆకు- ఒకటి, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు- రెండు, మిరియాలు- చెంచా, జాపత్రి- రెండు ముక్కలు, ధనియాలు- రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, ఎండు కొబ్బరి పొడి- అర కప్పు, నువ్వులు- రెండు చెంచాలు, గసగసాలు- చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, నూనె- నాలుగు చెంచాలు, ఉల్లిపాయ తరుగు- అర కప్పు, ఉప్పు- తగినంత, పసుపు- పావు చెంచా, టమాటా ప్యూరీ- అర కప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ముందుగా చికెన్ ముక్కల్లో ఉప్పు నీళ్లు పోసి అరగంటసేపు నాననివ్వాలి. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి ఎనిమిది ఎండుమిర్చి, మసాలా దినుసులు వేసి చిన్నమంట మీద దోరగా వేయించాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీలోకి తీసుకుని కొన్ని నీళ్లు పోసి బరకగా గ్రైండ్ చేయాలి. వెడల్పాటి గిన్నెలో చికెన్ ముక్కలు, మసాల పేస్టు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె, రెండు ఎండు మిర్చి, ఉల్లిపాయ తరుగు, చికెన్ మసాల మిశ్రమం, తగినంత ఉప్పు, పసుపు, టమాటా ప్యూరీ వేసి కలుపుతూ పెద్ద మంట మీద అయిదు నిముషాలు వేయించాలి. ఆపైన ఒకటిన్నర కప్పుల వేడి నీటిని పోసి మిశ్రమం దగ్గరకు వచ్చేదాక ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించాలి.
భర్లీ వాంగీ
కావాల్సిన పదార్థాలు
గుండ్రని చిన్న వంకాయలు- ఆరు, ఎండు కొబ్బరి తురుం- అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, అల్లం- రెండు చిన్న ముక్కలు, నువ్వులు- చెంచా, ధనియాలు- చెంచా, జీలకర్ర- అర చెంచా, గరం మసాల పొడి- చెంచా, పసుపు- అర చెంచా, కారం- చెంచా, చింతపండు- కొద్దిగా, బెల్లం తురుం- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- అర కప్పు, పల్లీల పొడి- అర కప్పు, ఉప్పు- తగినంత, నూనె- పావు కప్పు, ఇంగువ- చిటికెడు, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు
తయారీ విధానం
వంకాయలను మధ్యవరకు నాలుగు భాగాలుగా కోసి ఉప్పునీళ్లలో వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఎండు కొబ్బరి తురుం, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేయించి చల్లార్చి మిక్సీలోకి తీసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, గరం మసాల పొడి, పసుపు, కారం, చింతపండు, బెల్లం తురుం, కొత్తిమీర తరుగు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి వెడల్పాటి పళ్లెంలోకి తీయాలి. అందులో పల్లీల పొడి, తగినంత ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని వంకాయల్లో కూరాలి. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యాక ఇంగువ, ఆవాలు, కరివేపాకు ఆపైన మసాల కూరిన వంకాయలు, మిగిలిన మసాల పొడి వేసి నెమ్మదిగా కలిపి మూతపెట్టి అయిదు నిముషాలు మగ్గనివ్వాలి. తరువాత రెండు కప్పుల నీటిని పోసి చిన్న మంటమీద పది నిముషాలు ఉడికించాలి. తరువాత ఉప్పు సరిచూసి కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి.