Share News

ఆ ఆసక్తి లోపిస్తే...

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:31 AM

పురుషుల్లో లైంగికాసక్తి తగ్గడానికి పలు కారణాలుంటాయి. కాబట్టి మానసిక, భౌతిక, వ్యక్తిగత కారణాల్లో అసలు కారణాన్ని కనిపెట్టి పరిష్కరించుకోవడం అవసరం.

ఆ ఆసక్తి లోపిస్తే...

పురుషుల్లో లైంగికాసక్తి తగ్గడానికి పలు కారణాలుంటాయి. కాబట్టి మానసిక, భౌతిక, వ్యక్తిగత కారణాల్లో అసలు కారణాన్ని కనిపెట్టి పరిష్కరించుకోవడం అవసరం. బదులుగా అర్థం లేని అపోహలు, అవాస్తవాలను నమ్మి, లేని సమస్యను ఉన్నట్టు ఊహించుకుని బెంబేలు పడకూడదని అంటున్నారు వైద్యులు.

లైంగికాసక్తి తగ్గడానికి భౌతిక, ఆరోగ్యపరమైన కారణాల కంటే మానసిక, వ్యక్తిగత కారణాలే ఎక్కువ. కొందర్లో అస్తవ్యస్థ జీవనశైలి కూడా లైంగికాసక్తి తగ్గడానికి ప్రధాన కారణమవుతూ ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి, మానసిక ఆందోళన, కుంగుబాటు.. ఇవన్నీ లైంగికాసక్తిని తగ్గిస్తాయి.

భౌతిక కారణాలు: ప్రమాదంలో వృషణాలు దెబ్బతిన్నప్పుడు, పైబడే వయసులో భాగంగా వృషణాలు కుంచించుకుపోయినప్పుడు లైంగికాసక్తి తగ్గుతుంది.

వైద్యపరమైన కారణాలు: రసాయనాలు, రేడియేషన్‌కు బహిర్గతమవడం మూలంగా, కీమోథెరపీ ఫలితంగా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ తగ్గినప్పుడు కూడా లైంగికాసక్తి తగ్గుతుంది.

మానసిక కారణాలు: ఇతరులతో పోల్చుకోవడం, అశ్లీల వీడియోలు, పోర్నోగ్రఫీలో చూసి, వాటిని తమకు అన్వయించుకుని కుంగిపోవడం యువతలో సహజం. నిజానికి వాళ్లకు ఎలాంటి సమస్యా ఉండకపోవచ్చు. అయినా సమస్య ఉందనే అనుమానంతో మానసికంగా కుంగిపోతూ ఉంటారు. దాంతో లైంగికాసక్తి తగ్గిపోతుంది.

వ్యక్తిగత కారణాలు: భాగస్వామి పట్ల ఆకర్షణ లోపించడం, ఏకరీతి లైంగిక ప్రక్రియతో విసిగిపోవడం లాంటి కారణాల వల్ల కూడా లైంగికాసక్తి తగ్గుతుంది.


కుంగుబాటు: సన్నిహితుల మరణాలు, కుటుంబ గొడవలు కూడా లైంగికాసక్తి సన్నగిల్లడానికి దోహదపడుతూ ఉంటాయి. వ్యక్తిగత జీవితంలోని పలు రకాల ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల కూడా లైంగిక క్రీడ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది.

యువతలో అపోహలు

ఏది సహజం, ఏది అసహజం అనే విషయంలో యువతకు అవగాహన ఉండకపోవచ్చు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల ద్వారా అందే తప్పుడు సమాచారం ఆధారంగా, లైంగిక క్రీడకు సంబంధించిన పలు రకాల అపోహలను అల్లుకుంటారు. వాస్తవ జీవితంలో పూర్తి భిన్నమైన అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు తమలో ఏదో సమస్య ఉందని నిర్థారించుకుని కుంగిపోతూ ఉంటారు. అలాగే లైంగికాసక్తి, సామర్థ్యం వ్యక్తుల్లో భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒకర్నొకరు పోల్చుకోవడం సరి కాదు. స్తంభనాలు సజావుగా ఉండి, లైంగిక క్రీడలో పాల్గొనే సామర్థ్యం ఉన్నప్పుడు తమలో ఎలాంటి సమస్య లేదని అర్థం చేసుకోవాలి.

‘హైపొగొనాడిజం’ సమస్యలో...

శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గే సమస్య ఇది. వయసు పైబడేకొద్దీ వృషణాల సామర్థ్యం సన్నగిల్లి, హార్మోన్ల స్రావాలు కూడా తగ్గుతాయి. లైంగికాసక్తి సన్నగిల్లుతుంది. టెస్టోస్టిరాన్‌ తగ్గడం వల్ల ఇలాంటి లక్షణాలు తలెత్తుతాయి. నిజానికి మానసిక కుంగుబాటుకు లోనైన యువతలో, మధ్య వయస్కుల్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి నిజంగానే శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గిందా, లేదా అన్నది పరీక్షలతో సరి చూసుకోవాలి.

శరీరంలో కండర ద్రవ్యరాశి తక్కువగా, కొవ్వు ఎక్కువగా ఉండడం, ఎక్కువ సమయాల పాటు విశ్రాంతిలో గడపడం, వ్యాయామం లోపించడం వల్ల మధ్య వయస్కుల్లో కూడా టెస్టోస్టిరాన్‌ మోతాదు తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో క్రమం తప్పక వ్యాయామం చేయడం, జంక్‌ ఫుడ్‌ తగ్గించి, సమతులాహారం తీసుకోవడం, క్రమం తప్పని నిద్రవేళలు పాటించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్‌ స్రావాన్ని పెంచుకోవచ్చు. ఈ జీవనశైలి మార్పులతో ఫలితం లేనప్పుడు, హార్మోన్‌ ఇంజెక్షన్లను తీసుకోవలసి వస్తుంది. ఈ అంశాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా హార్మోన్‌ ఇంజెక్షన్స్‌ తీసుకోవడం సరి కాదు. మరీ ముఖ్యంగా పిల్లల కోసం ప్రయత్నించే పురుషులకు ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం సరికాదు.


ఆకర్షణ లోపిస్తే...

భాగస్వామి పట్ల ఆసక్తి లోపించినప్పుడు, లైంగిక జీవితం ఏకరీతిగా మారి లైంగికాసక్తి కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి దంపతులిద్దరూ కృషి చేయాలి. ఒకరి ఇష్టానిష్టాలను మరొకరు తెలుసుకుని, సమన్వయంతో నడుచుకోవాలి. విహార యాత్రలు, సినిమాలు, షికార్లు, ఏకాంత సమయాలకు సమయం కేటాయించాలి. కీచులాటలు, అపార్థాలకు స్వస్థి చెప్పి సాన్నిహిత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. లైంగికాసక్తి ఎవర్లో లోపించినా, దాన్నొక లోపంగా ఎత్తి చూపుతూ ఒకర్నొకరు అవమానించుకోవడం, కించపరుచుకోవడం మానేయాలి. బదులుగా మూల కారణాన్ని వెతికి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.

మరీ ముఖ్యంగా భాగస్వామికి ఆకర్షణీయంగా కనిపించాలనే తపన మధ్య వయస్కుల్లో సన్నగిల్లుతుంది. మధ్య వయసుకు చేరుకునే సమయానికి, యవ్వనంలో కనబరిచిన స్వీయ శ్రద్ధ లోపిస్తుంది. కానీ వస్త్రధారణతో, సరదా మాటలతో, పనులతో ఒకర్నొకరు ఆకట్టుకునే ప్రయత్నాలను ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడే లైంగికాసక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. అవసరమనుకుంటే దంపతులు కపుల్‌ కౌన్సెలింగ్‌ను ఆశ్రయించడానికి కూడా వెనకాడకూడదు.

నకిలీ మందులతో మోసపోకూడదు

సాధారణంగా అంగ పరిమాణం, లైంగిక క్రీడలో పాల్గొనే సమయం, సంఖ్య, స్కలనం పట్ల పలువురిలో పలు అపోహలుంటాయి. దాంతో లైంగికాసక్తినీ, అంగ పరిమాణాన్నీ, సమయాన్నీ పెంచే నకిలీ మందులు, వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఒరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. కొందరికి అంగ పరిమాణం పుట్టుకతోనే చిన్నగా ఉండొచ్చు. తన అంగం చిన్నదిగా ఉందని ఊహించుకునే పురుషులు కాకుండా నిజంగానే ఇలాంటి సమస్య ఉన్నవారు సమస్యను సరిదిద్దే చికిత్సల కోసం అనుభవజ్ఞులైన వైద్యులనే ఆశ్రయించాలి. అలాగే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సర్జరీ చేయించుకున్న వారికి కూడా అంగ పరిమాణాన్నీ, పటుత్వాన్నీ పెంచే వ్యాక్యూమ్‌ డివైజెస్‌ అవసరమవుతాయి. టెస్టోస్టిరాన్‌ జెల్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ఇవి పెద్దలకు పని చేయకపోవచ్చు.

డాక్టర్‌ సూరజ్‌ పిన్ని

కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌ అండ్‌ ఆండ్రాలజిస్ట్‌,

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - Nov 24 , 2026 | 12:37 AM