కాలేయం కులాసాగా...
ABN , Publish Date - Apr 16 , 2026 | 02:47 AM
డాక్టర్! దైనందిన అలవాట్లు, జీవనశైలుల మీదే కాలేయ ఆరోగ్యం ఆధారపడి ఉందంటారు. ఇది ఎంతవరకూ నిజం? కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎలాంటి నియమాలు పాటించాలి....
డాక్టర్! దైనందిన అలవాట్లు, జీవనశైలుల మీదే కాలేయ ఆరోగ్యం ఆధారపడి ఉందంటారు. ఇది ఎంతవరకూ నిజం? కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎలాంటి నియమాలు పాటించాలి?
- ఓ సోదరి, హైదరాబాద్
కాలక్రమేణా కాలేయ వ్యాధులు పెరిగిపోతున్నాయి. కాలేయం పట్ల, కాలేయ వ్యాధుల పట్ల, ఈ వ్యాధులను తెచ్చిపెట్టే అలవాట్ల పట్ల అవగాహన లోపించమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా నగరాల్లో సగం జనాభా కాలేయ కొవ్వుతో బాధపడుతోంది. దీనికి ప్రధాన కారణం, అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లే! రిపైన్డ్ చక్కెరలు, అదనపు చక్కెరలు, నూనెలో వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్లే కాలేయ కొవ్వు సమస్య పెరుగుతుంది. అలాగే ఎక్కువ సమయాల పాటు కూర్చుని చేసే ఉద్యోగాలు, వ్యాయామం లోపించడం, వారాంతపు వేడుకల్లో భాగంగా అధిక మొత్తాల్లో మద్యం సేవించడం... ఇవన్నీ కాలేయాన్ని దెబ్బతీసేవే! దీనికి తోడు హెపటైటిస్ బి వ్యాక్సీన్ 1999 నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ, దీని గురించి అవగాహన లోపిస్తోంది. మూడు డోసుల హెపటైటిస్ బి వ్యాక్సిన్‌తో కాలేయానికి జీవితాంతం రక్షణ దక్కుతుంది.
వీళ్లు అప్రమత్తం
ఎక్కువ మందికి మధుమేహం, గుండె జబ్బుల పట్ల ఆసక్తి, అవగాహన ఎక్కువ. కానీ కాలేయ వ్యాధుల గురించిన అవగాహన తక్కువనే చెప్పాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకునే సందర్భాల్లో తప్పనిసరిగా కాలేయ పరీక్షలు కూడా చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్‌తో పాటు అలా్ట్రసౌండ్, హెపటైటిస్ బి, సి పరీక్షలను కూడా చేయించుకోగలిగితే, కాలేయాన్ని కాపాడుకున్న వాళ్లమవుతాం! కాలేయానికి తిరిగి తనను తాను పునరుద్ధరించుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి కొంతమేరకు జబ్బుపడినా లక్షణాలు బయల్పడకపోవచ్చు. కాలేయం తన శక్తికి మించి శ్రమపడి, పూర్తిగా చేతులెత్తేసిన తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడడం మొదలుపెడతాయి. కానీ అప్పటికే అంతా ఆలస్యమైపోవచ్చు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తపడడం అవసరం. మద్యపాన ప్రియులు, ఊబకాయులు, ఐదేళ్లకు పైగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు కాలేయ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. గతంలో సర్జరీలు, రక్తమార్పిడిలు, టాటూలు వేయించుకున్న వాళ్లందరికీ క్రానిక్ హెపటైటిస్ బి,సి ముప్పు ఉంటుంది. అలాగే కుటుంబ చరిత్రలో కాలేయ వ్యాధులున్నవాళ్లకు కూడా కాలేయ జబ్బు ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి ఈ కోవలకు చెందినవాళ్లందరూ అప్రమత్తంగా ఉంటూ, 35 ఏళ్ల వయసు నుంచి ఏడాదికోసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్సాసౌండ్, హెపటైటిస్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తూ...
తరచూ కామెర్లతో బాధపడుతున్నా, త్వరగా అలసటకు లోనవుతున్నా, అజీర్తి సమస్యలు వేధిస్తున్నా కాలేయం దెబ్బతింటున్నట్టు అనుమానించి, హెపటాలజి్‌స్టను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. తాజాగా అందుబాటులో ఉన్న ‘ఫైబ్రో స్కాన్’ పరీక్షతో కాలేయ జబ్బును తొలినాళ్లలోనే పసిగట్టే వీలుంది. కాబట్టి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. కాలేయం ఆరోగ్యం నిక్షేపంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారశైలిని పాటించాలి. అలాగే...
నడకతో పాటు వారానికి కనీసం మూడు రోజులు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి
మద్యం మానేయాలి
నూనెలో వేయించిన పదర్థాలు, శుద్ధి చేసిన పదార్థాలు మానేయాలి
చక్కెర తగ్గించాలి
తాజా కూరగాయలు, ఆకుకూరలు తినాలి
తాజాగా వండిన ఆహారం తినాలి
డాక్టర్ కె. సోమశేఖర రావు,
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్