Share News

ఇది పూజ కథ

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:58 AM

పల్లెటూరి వాతావరణం.. కాటన్‌ చీరకట్టు.. అనర్గళమైన ఇంగ్లిష్‌.. వెరసి ‘లైఫ్‌ ఆఫ్‌ పూజ’. అయితే, ఇప్పుడీమె సృష్టించిన ‘అథెంటిసిటీ’ (నిజాయతీ) దుమారం ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ పూజ అసలు కథేంటి?

ఇది పూజ కథ

పల్లెటూరి వాతావరణం.. కాటన్‌ చీరకట్టు.. అనర్గళమైన ఇంగ్లిష్‌.. వెరసి ‘లైఫ్‌ ఆఫ్‌ పూజ’. అయితే, ఇప్పుడీమె సృష్టించిన ‘అథెంటిసిటీ’ (నిజాయతీ) దుమారం ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ పూజ అసలు కథేంటి?

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రపంచంలో రాత్రికిరాత్రి వైరల్‌ కావడం వింతేమీ కాదు. కానీ, పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి అతితక్కువ కాలంలో ఆరున్నర లక్షల మందికిపైగా ఫాలోవర్లను సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆమె పేరు పుజారిణి ప్రధాన్‌. డిజిటల్‌ ప్రపంచంలో ఆమె ‘లైఫ్‌ ఆఫ్‌ పూజ’. ఆమె పోస్టు చేసే ప్రతి రీల్‌ ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తోంది.

మేధావిలా విశ్లేషణలు

సాధారణంగా గ్రామీణ ప్రాంత ఇన్‌ఫ్లుయెన్సర్లు అంటే మన కళ్లముందు మెదిలే దృశ్యం.. వంటలు చేయడమో, పొలం పనులు చూపించడమో లేదా అమాయకపు చేష్టలతో నవ్వించడమో! కానీ, పూజ శైలి దీనికి భిన్నం. ఆమె వెనుక పచ్చని పొలాలు, పెంకుటిళ్లు, పాతకాలపు గోడలు ఉన్నా ఆమె మాట్లాడేది మాత్రం ఫెమినిజం, పెట్టుబడిదారీ విధానం, గ్లోబల్‌ సినిమా విశ్లేషణలు, సంక్లిష్టమైన సామాజిక అంశాల గురించి. ఆకర్షణీయమైన కాటన్‌ చీరలు కట్టుకుని ఒక మేధావిలా ఆమె చేసే విశ్లేషణలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఈ వైరుధ్యమే ఆమెను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది.

పూజ నిజాయతీపై ప్రశ్నలు

అయితే నిహారిక జైన్‌ అనే థెరపిస్ట్‌, ఇన్‌ఫ్లుయెన్సర్‌ నేరుగా పూజ నిజాయతీని ప్రశ్నించారు. ‘‘ఆమె రోజూ వీడియోలు పోస్ట్‌ చేస్తోంది. దీనికోసం సోషల్‌ మీడియాలో చాలా సమయం గడపాలి. పల్లెటూరి వాతావరణంలో ఉంటూ ఇంత పక్కాగా ఇంగ్లిష్‌ మాట్లాడటం, మేధోపరమైన చర్చలు చేయడం అంతా ఒక ప్లాన్‌ ప్రకారం జరుగుతున్న ‘క్యూరేటెడ్‌ ఇమేజ్‌’లా ఉంది’’ అన్నారు. షారూఖ్‌ఖాన్‌ లాంటి స్టార్ల పబ్లిక్‌ ఇమేజ్‌ వెనుక పెద్ద టీం ఎలా ఉంటుందో, పూజ వెనుక కూడా అలాగే ఉండి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తంచేశారు.


ఇండస్ట్రీ ప్లాంట్‌

కొందరు నెటిజన్లు అయితే ఆమెను ‘ఇండస్ట్రీ ప్లాంట్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే లోపల ఏదో పెద్ద ఏజెన్సీ ఉండి, ఆమెను ఒక బ్రాండ్‌లా ప్రమోట్‌ చేస్తోందని వారి ఆరోపణ. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌, ఆడిబుల్‌ వంటి గ్లోబల్‌ బ్రాండ్లతో ఆమెకు ఒప్పందాలు కుదరడం, ఆ వీడియోలు అత్యంత ప్రొఫెషనల్‌గా ఉండటం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. ఒక గ్రామీణ యువతి ఇంత త్వరగా అంతర్జాతీయ బ్రాండ్లను ఎలా ఆకర్షించగలిగిందన్నదే విమర్శకుల ప్రధాన ప్రశ్న.

అద్భుత శక్తులు అవసరం లేదు

తనపై వస్తున్న ఆరోపణలకు, తన పనితనాన్ని తక్కువగా అంచనా వేస్తున్నవారికి ఒక పవర్‌ఫుల్‌ రీల్‌ ద్వారా పూజ సమాథానం ఇచ్చారు. ‘‘నేను ఒక వీడియోను షూట్‌ చేసి ఎడిట్‌ చేయడానికి నాకు 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది నేర్చుకుంటే ఎవరైనా చేయగలిగే పనే. దీనికి అద్భుత శక్తులు అవసరం లేదు’’ అని చెప్పారు. బ్రాండ్‌ ఒప్పందాల కోసం మాత్రమే ఒక ఏజెన్సీతో పనిచేస్తున్నానని, అది కూడా కెరీర్‌ మొదట్లో తాను ఎదుర్కొన్న దోపిడీ వల్లే ఆ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పారు. ‘‘స్ర్కిప్ట్‌ రాయడం దగ్గరి నుంచి షూటింగ్‌, ఎడిటింగ్‌ వరకు అంతా నేనే చూసుకుంటాను. నా వెనుక ఏ టీమూ లేదు. నేను అభిప్రాయాలు చెప్పనంత కాలం వారికి ఏ సమస్యా లేదు. కానీ, ఎప్పుడైతే నేను చదువుకుని, నాకంటూ సొంతంగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టానో, అప్పుడు నేను వారికి ప్రమాదంగా కనిపిస్తున్నాను’’ అని ఆమె ఘాటుగా స్పందించారు. ‘ఇండస్ట్రీ ప్లాంట్‌’ అంటే ఏంటో కూడా తనపై విమర్శలు వచ్చాకే రీసెర్చ్‌ చేసి తెలుసుకున్నానని చెప్పారు.


ద్వంద్వ ప్రమాణాలు

ఈ వివాదంలో పూజకు మద్దతుగా నిలిచినవారు ఒక బలమైన వాదనను వినిపిస్తున్నారు. ఈ వివాదం ఆమె కంటెంట్‌ కంటే కూడా సమాజంలోని అసూయను ఎక్కువగా బయటపెట్టిందని వారు అంటున్నారు. నగరాల్లో ఉండి అన్ని వసతులు ఉన్నవారు ఇంగ్లిష్‌ మాట్లాడితే గొప్పగా చూసే సమాజం.. ఒక పల్లెటూరి అమ్మాయి సంప్రదాయంగా ఉంటూనే గ్లోబల్‌ ఇష్యూస్‌ మాట్లాడితే ఎందుకు జీర్ణించుకోలేకపోతోంది? ఒక నెటిజన్‌ అన్నట్టుగా ‘‘లైఫ్‌ ఆఫ్‌ పూజ సమాజానికి ఒక అద్దంలాంటిది. ఇక్కడ అసూయ పరాకాష్టకు చేరింది’’.

నిహారిక క్షమాపణలు

బాలీవుడ్‌ సీనియర్‌ నటి అర్చన పురాణ్‌సింగ్‌, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కుశా కపిల వంటివారు కూడా పూజకు అండగా నిలిచారు. ‘‘నీ నిజాయతీని ప్రశ్నించేవారికి అసలు నిజాయతీ అంటే ఏంటో కూడా తెలియదు. నీ పని నువ్వు చేసుకుంటూ పో’’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. విమర్శలు చేసిన నిహారిక జైన్‌ కూడా చివరికి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, వ్యవస్థను ప్రశ్నించడమేనని అన్నారు.

మోర్‌ పవర్‌ టు పూజ

పూజ ప్రయాణం చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమవుతోంది. పాతకాలపు స్టీరియోటైప్స్‌ (మూసధోరణులు) పటాపంచలు అవుతున్నాయి. ఒక పల్లెటూరి యువతి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ఆమె ప్రపంచాన్ని శాసించగలదని పూజ నిరూపించారు. ఆమె వేగాన్ని అందుకోలేక కొందరు విమర్శలు చేస్తున్నా.. పుజారిణి వంటివారు తమ ప్రతిభతో కోట్లాదిమంది మనసులు గెలుచుకుంటూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న నినాదం ఒక్కటే... ‘మోర్‌ పవర్‌ టు పూజ’.

దూసుకొచ్చిన వివాదం

పూజ ఎదుగుదల ఎంత వేగంగా ఉందో.. ఆమెపై వస్తున్న విమర్శలు కూడా అంతే వేగంగా పెరిగాయి. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి చివరి వారంలో ఆమె కంటెంట్‌ మేకింగ్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఆమె చేసే వీడియోలు, సినిమాటిక్‌ ఫ్రేమింగ్‌, ఎడిటింగ్‌ నాణ్యత చూస్తుంటే.. మారుమూల గ్రామంలో పరిమిత వనరుల మధ్య ఉండే అమ్మాయికి ఇవన్నీ ఎలా సాధ్యం? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

Updated Date - Apr 04 , 2026 | 03:58 AM