సుడిగాలి రాక్షసుడు
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:01 AM
నందవ్రజంలో ఉన్నట్టుండి పెద్ద సుడిగాలి. చేటలతో ఎత్తి పోస్తున్నట్టు ఒకటే దుమ్ము. ఆ గాలి వేగానికి మద్ది చెట్లు, పొన్న చెట్లు, విరగబూసిన సంపెంగ చెట్లు, మామిడి చెట్లు... అన్నీ నేల కూలాయి.
నందవ్రజంలో ఉన్నట్టుండి పెద్ద సుడిగాలి. చేటలతో ఎత్తి పోస్తున్నట్టు ఒకటే దుమ్ము. ఆ గాలి వేగానికి మద్ది చెట్లు, పొన్న చెట్లు, విరగబూసిన సంపెంగ చెట్లు, మామిడి చెట్లు... అన్నీ నేల కూలాయి. ఎటుచూసినా చిమ్మ చీకటి. సందెవేళ ఒడిలో పిల్లలను కూర్చోబెట్టుకొని ఆడిస్తున్న తల్లులందరూ భయంతో వణికిపోయారు. పిల్లల్ని తీసుకొని ఇళ్ళలోకి పరుగులు తీశారు. ఆ చీకటిలో ‘‘కన్నా! కన్నా!’’ అంటూ యశోద అరుపులు వినిపించాయి. ఇంతలో చీకటి విచ్చిపోయింది. గాలి నిలిచిపోయింది. చేతులు రెండూ ముందుకు చాచి, గుండె నీరైపోయేలా ఏడుస్తూ, తూలుతూ, పడుతూ లేస్తూ బిడ్డను యశోద వెతుక్కుంటోంది. గోపికలందరూ ఆమె చుట్టూ చేరారు. ‘‘తల్లులారా! మీలో ఎవరైనా నా చిన్ని తండ్రిని చూశారా? ఇప్పటివరకూ నా ఒడిలోనే ఉన్నాడు. మాయదారి చీకటిలో కనిపించకుండా పోయాడు. నా ఇంటి దీపం, నా కన్నుల వెన్నెల, నా ప్రపంచం అన్నీ వాడే! చెప్పండి తల్లీ! మీకు కనిపించాడా? మీకు కనిపించాడా?’’ అని పిచ్చిదానిలా ఏడుస్తూ అడుగుతోంది. ‘‘ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తుండగా సుడిగాలి వీచిందమ్మా! పిల్లవాడి కళ్ళలో ధూళి పడుతుందేమోనని ఒక్క క్షణం కూర్చోబెట్టి చీర చెరగు కప్పబోయాను. నా కన్న తండ్రి కనిపించలేదు. ఇల్లంతా వెతికాను. బయట కూడా వెతికాను. ఎక్కడా కనిపించలేదు’’ అంటూ కూలబడింది.
చీకటిలా కమ్ముకొని...
ఇంతకీ జరిగింది ఏమిటంటే... వ్రేపల్లెలో ఒక పసివాడు మహా అద్భుత చర్యలు చేస్తున్నాడని కంసుడు విన్నాడు. కంగారు మొదలయింది. తన అనుచరులు పూతన, శకటాసురుడు ఇంతవరకూ తిరిగి రాలేదంటే... వాళ్ళను కూడా అతనే సంహరించి ఉంటాడని అనుమానించాడు. భయంతో గజగజలాడాడు. అతని అనుచరుడైన తృణావర్తుడు ఇది గమనించాడు. కంసుడి అనుమానం తొలగించడానికి స్వయంగా బయలుదేరాడు. వ్రేపల్లెలో వాలాడు. వెళ్తూనే ఒక పెద్ద సుడిగాలిలా మారాడు. దుమ్ము లేపాడు. ఊరంతా చిమ్మచీకట్లు కమ్మేలా చేశాడు. ఆ చీకటిలోనే... ఇంటి ముందున్న కృష్ణుణ్ణి ఎగరేసుకుపోయాడు. ఆ పసివాడు క్రమక్రమంగా భరించలేనంత బరువయ్యాడు. దాంతో ఆ పిల్లవాడిని కింద పడేసి... తన దారిన తాను పోదామనుకున్నాడు. కానీ అప్పటికే తృణావర్తుడి మెడను కృష్ణుడు బలంగా చుట్టేసుకున్నాడు. ఆ పట్టును రాక్షసుడు విడిపించుకోలేకపోయాడు. గుడ్లు తేలేశాడు. అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడు. పెద్దగా అరుస్తూ కింద పడ్డాడు. వాడి శరీరం ముక్కలయింది. వాడితో పాటు కృష్ణుడు కూడా కింద పడ్డాడు. కానీ నవ్వుతూ ఉన్నాడు. అది చూసి గోకులం ఆశ్చర్యపోయింది. నంద యశోదలు ఆనందంతో పొంగిపోయారు.
దుర్వాసుడి శాపం
ఇంతకీ ఎవరీ తృణావర్తుడు? అతను పూర్వ జన్మలో పాండు దేశాధిపతి. మంచి పాలకుడు, సేవాతత్పరుడు. కానీ స్త్రీలోలుడు. ఒకసారి నదీ తీరంలో అంతఃపుర స్త్రీలతో ఆ రాజు క్రీడిస్తూ ఉండగా... దుర్వాస మహర్షి అక్కడికి వెళ్ళాడు. దుర్వాసుణ్ణి చూసి కూడా అతను కదిలి రాలేదు, ఎలాంటి గౌరవాన్ని చూపించలేదు. దీంతో ఆగ్రహించిన దుర్వాసుడు ‘‘మరుసటి జన్మలో నీవు రాక్షసుడివై పుడతావు’’ అని శపించాడు. ఆ శాపాన్ని అనుసరించి... ఆ రాజు తృణావర్తుడిగా జన్మించాడు.
దోపిడీలకు, రహస్యాలకు, దొంగతనాలకు, అత్యాచారాలకు, పసిపిల్లల అపహరణలకు చీకటిని దుష్టులు ముసుగుగా ఉపయోగించుకోవడం ఆనాటి నుంచీ ఉంది. ఈ కథ పిల్లల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను మనకు గుర్తు చేస్తుంది. పిల్లల్ని ఒంటరిగా వదిలెయ్య కూడదు. దుమ్ముకు, ధూళికీ దూరంగా ఉంచాలి. అపరిచితుల చేతికి పిల్లలను ఇవ్వకూడదు. వారు ఇచ్చే మిఠాయిలు బొమ్మలు తీసుకోవద్దని పిల్లలకు చెప్పాలి.
ప్రయాగ రామకృష్ణ