ఈ అక్కాచెల్లెళ్లుసంగీత రథసారథులు
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:55 AM
పేదింటి పిల్లల్లో సంగీతాభిరుచిని రేకెత్తించి... దాన్ని ఒక పాఠంగా చెబుతున్నారు అక్కాచెల్లెళ్లు... కామాక్షి, విశాలా ఖురానా. చదువుతోపాటు నచ్చిన వాయిద్యం నేర్పించి...
పేదింటి పిల్లల్లో సంగీతాభిరుచిని రేకెత్తించి... దాన్ని ఒక పాఠంగా చెబుతున్నారు అక్కాచెల్లెళ్లు... కామాక్షి, విశాలా ఖురానా. చదువుతోపాటు నచ్చిన వాయిద్యం నేర్పించి... వారిలో పఠనాసక్తితో పాటు కళా నైపుణ్యాన్ని కూడా పెంచుతున్నారు. అందుకోసం ఈ అక్కాచెల్లెళ్లు ఎంచుకున్న మార్గం... మ్యూజిక్ ఆన్ వీల్స్. బస్సును అభ్యాస కేంద్రంగా మార్చి... బస్తీలకు వెళ్లి బోధించి వస్తున్న ఖురానా సిస్టర్స్ జర్నీ... కామాక్షి మాటల్లో...
‘‘ది సౌండ్ స్పేస్’... ఇది మేం నిర్వహించే సంగీత పాఠశాల పేరు. పదహారేళ్ల కిందట ముంబయిలో ప్రారంభించాం. నాటి ప్రధాన ఉద్దేశం... అణగారిన వర్గాల పిల్లలకు సంగీతాన్ని అందించాలని. తొలుత స్కూల్స్‌కు వెళ్లి సంగీత పాఠాలు నేర్పించేవాళ్లం. దానికోసం ప్రత్యేకంగా టీచర్లను నియమించాం. విశేషం ఏంటంటే... ఈ తరగతులు మొదలయ్యాక పిల్లలు క్రమం తప్పకుండా బడికి రావడం. అది మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లలు ఎన్నో రకాల భావోద్వేగాలకు లోనవుతుంటారు. కానీ వాటన్నిటినీ వారు వ్యక్తపరచలేరు. అలాంటి భావాలు, భావోద్వేగాలను అనుభూతి చెందడానికి, వాటితో మమేకం కావడానికి సంగీతం ఒక సాధనంగా మారుతుంది. జీవితంలోని వివిధ అంశాల గురించి అవగాహన కల్పించడంలో, తమను తాము అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మా కార్యక్రమాలను రూపొందించాం. మా సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నాం.
నాన్న వారసత్వం...
ముంబయిలో పుట్టిపెరిగిన మా జీవితంలో సంగీతం ఒక భాగమైపోయింది. మా నాన్న హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. మూడేళ్ల వయసు నుంచే నేను శాస్త్రీయ సంగీత సాధన మొదలుపెట్టాను. తరువాత మా చెల్లి నన్ను అనుసరించింది. అలా సంగీతం మా దినచర్యలో భాగమైపోయింది. ఇంట్లో మా భోజనాలు కూడా లయబద్దంగా సాగిపోయేవి. కుటుంబమంతా కూర్చొని గంటలతరబడి పాటలు పాడుకొనేవాళ్లం. సంగీతంతో కలిపి చదువుకున్నప్పుడు మా చదువులు కూడా చాలా ప్రభావవంతంగా ఉండేవి. ఎప్పుడూ ఒక స్నేహితుడు పక్కన ఉన్న అనుభూతి కలిగేది మాకు. అదే అనుభూతిని అందరూ అనుభవించాలని, ముఖ్యంగా మురికివాడల్లోని పిల్లలకు దాన్ని చేరవేయాలని కాలేజీలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాం. వెంటనే అమల్లో పెట్టి... ‘ది సౌండ్ స్పేస్’ను నెలకొల్పాం.
బస్సులో స్వర ఝరి
కేవలం టీచర్‌ను మాత్రమే కాకుండా సంగీత పాఠశాలనే పిల్లల వద్దకు తీసుకువెళ్లాలనే ఆలోచన మాది. అందుకే ఒక బస్సు కొని, దాన్ని సంగీత పాఠశాలగా మార్చాం. అందులో టీచర్‌తో పాటు తబల, గిటారు తదితర వాయిద్యాలు కూడా ఉంటాయి. రోజూ ముంబయి బస్తీలకు వెళుతుంది. ఒకేచోట కాకుండా... వివిధ ప్రాంతాలు తిరుగుతుంది. ఒక్కోచోట నలభై నిమిషాలపాటు సంగీత పాఠాలు చెబుతాం. అది అవ్వగానే మరో ప్రాంతానికి వెళుతుంది బస్సు. తరగతికి పాతికమంది ఉంటారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. తరగతులు పూర్తవగానే బస్సును శుభ్రం చేసి తరువాతి రోజుకు సిద్ధం చేస్తాం. ప్రస్తుతం ఐదు నుంచి పన్నెండేళ్ల మధ్య వయసుగల 500 మంది పిల్లలు మా వద్ద శిక్షణ పొందుతున్నారు. మేము స్పృశించే ప్రతి చిన్నారీ... ఈ ప్రపంచంలో తమ గొంతుకు విలువ ఉంటుందని గ్రహించాలనేదే మా ఈ ప్రయత్నం.’’
వారికి కూడా...
వినికిడి లోపం ఉన్న పిల్లలకు కూడా సంగీతం నేర్పిస్తున్నాం. దీని ద్వారా వారిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనేది మా ఉద్దేశం. ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం మ్యూజిక్ థెరపీ సెషన్లు కూడా నిర్వహిస్తున్నాం. ఇది వారు తమ శరీరం, మనస్సుతో అనుసంధానం కావడానికి సహాయపడతాయి.
అదే మా ప్రయత్నం
మేం అందరినీ గాయకులుగా మార్చాలనుకోవడం లేదు. వీలైనంత ఎక్కువమందికి సంగీతంలోని ఆనందాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి సంగీతం నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే కొన్నేళ్లు గడిచాక మాకు అర్థమైంది ఏంటంటే... ఏదో ఒకటి రెండు స్కూళ్లకే పరిమితం కాకుండా, బస్తీల్లోని పిల్లలందరికీ ప్రత్యేకంగా బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని. దాంతో మూడేళ్ల కిందట ‘ది సౌండ్ స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక బస్సును తీసుకువచ్చాం.