Share News

ప్రజల కష్టాలే వీడియో కథనాలుగా

ABN , Publish Date - Mar 28 , 2026 | 03:38 AM

సామాజిక సమస్యలను ప్రభుత్వానికి చాటి చెప్పే వ్లాగర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాళ్లలో ఒకరు... కావ్య కర్నాటక్‌. రాజస్థాన్‌లో నీటి సంక్షోభం మొదలు, వందేళ్లుగా మండుతున్న జార్ఖండ్‌, ధన్‌బాద్‌లోని బొగ్గు ఉత్పత్తి జిల్లా వరకూ, 466 వీడియోలతో ప్రజలెదుర్కొనే సమస్యల పట్ల చైతన్యాన్ని పెంచుతూ, లక్షలకొద్దీ సబ్‌స్కైబర్లను.....

ప్రజల కష్టాలే వీడియో కథనాలుగా

సామాజిక సమస్యలను ప్రభుత్వానికి చాటి చెప్పే వ్లాగర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాళ్లలో ఒకరు... కావ్య కర్నాటక్‌. రాజస్థాన్‌లో నీటి సంక్షోభం మొదలు, వందేళ్లుగా మండుతున్న జార్ఖండ్‌, ధన్‌బాద్‌లోని బొగ్గు ఉత్పత్తి జిల్లా వరకూ, 466 వీడియోలతో ప్రజలెదుర్కొనే సమస్యల పట్ల చైతన్యాన్ని పెంచుతూ, లక్షలకొద్దీ సబ్‌స్కైబర్లను సంపాదించుకుంది కావ్య. దేశంలోని 800 జిల్లాలనూ సందర్శించి, ప్రజల కథలను తన వీడియోల ద్వారా ప్రపంచంతో పంచుకోవడమే తన లక్ష్యమంటున్న కావ్య కథ గురించి తెలుసుకుందాం!

థ చెప్పే విధానం పట్ల కావ్య కర్నాటక్‌కు ఉన్న మక్కువ అప్పుడప్పుడూ కష్టాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఢిల్లీ, ఘజియాపూర్‌లోని అత్యంత ఎత్తైన చెత్త కుప్ప వెనకున్న కథను చిత్రీకరించే సమయంలో, గుండాలు ఆమె మీదా, ఆమె బృందం మీద దాడికి పాల్పడ్డారు. అయినా పట్టు వదలని 27 ఏళ్ల కావ్య, ఆరోగ్యం, నీరు, పరిశుభ్రత సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రజల రోజువారీ కష్టాలను వెలుగులోకి తీసుకురావాలనే తన లక్ష్యాన్ని కొనసాగించింది. ఫలితంగా ఆ వీడియో యూట్యూబ్‌లో 30 లక్షల వ్యూలను సంపాదించింది. కథ చెప్పే విధానంలో మూస పద్ధతికీ, సంప్రదాయ కంటెంట్‌ క్రియేషన్‌కు భిన్నంగా, తన ప్రేక్షకులను ప్రత్యక్ష అనుభవంలోకి నడిపించే కావ్య స్టోరీటెల్లింగ్‌ ప్రయాణం, నాటకీయతకు తావు లేకుండా ఎంతో వాస్తవికంగా సాగుతుంది. ఆమె వీడియోలు ప్రజల జీవితాల్లోకి తొంగి చూడగలిగే గవాక్షంగా, నిర్భాగ్యులకు స్వరంగా మారుతున్నాయి.

800 జిల్లాలే లక్ష్యం

కావ్య వీడియోలు పొందుతున్న ప్రశంసలు, అందుకుంటున్న ఆదరణలను బట్టి ఆమె యూట్యూబ్‌ ప్రస్థానం ఎన్నో ఏళ్ల క్రితమే మొదలైందనుకుంటే పొరపాటు. కావ్య, కేవలం మూడేళ్ల క్రితమే యూట్యూబర్‌గా మారింది. కెకె క్రియేట్‌ పేరుతో మూడేళ్లుగా అప్‌లోడ్‌ చేసిన 794 యూట్యూబ్‌ వీడియోలు ఇప్పటివరకూ దాదాపు పది కోట్ల వ్యూస్‌ను సంపాదించాయి. ఆమె పరిశోధనాత్మక కంటెంట్‌లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని ప్రజలెదుర్కొనే ప్రధాన సమస్యలన్నీ బట్టబయలవుతూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన కావ్య, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సె్‌సలో, మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీ్‌సలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ సమయంలో ముంబైకి చెందిన ఆరే అడవి, ఆదివాసీ సమాజం గురించి డాక్యుమెంటరీని రూపొందించింది. ఆ విధంగా సాంస్కృతిక కంటెంట్‌ క్రియేషన్‌ పట్ల ఆమెలో ఆసక్తి ఏర్పడింది. ‘కేకె క్రియేట్‌ ఛానల్‌ ద్వారా దేశంలోని 800 రాష్ట్రాలనూ సందర్శించి, అక్కడి ప్రజల కథలను అనుభవపూర్వకంగా తెలుసుకోవడంతో పాటు, వీడియోల ద్వారా వాటిని అందరికీ ప్రదర్శించి చూపించడమే నా ధ్యేయం’ అంటూ ఒక సందర్భంలో వివరించింది కావ్య.


నెలకు 15 లక్షల ఆదాయం

వీడియో ఛానల్‌ ప్రారంభానికి ముందు, పాకెట్‌ ఏసెస్‌ అనే డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో వీడియో ప్రొడ్యూసర్‌గా కొంత కాలం పని చేసిన కావ్య, 2022లో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పింది. ఆ తర్వాత సమాచార ఆధారిత, పరిశోధనాత్మక వీడియోల పట్ల తనకున్న ఆసక్తిని గ్రహించి, సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్‌ను పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది. వాటికి అపూర్వమైన స్పందన వచ్చింది. అలా రెండు నెలల వ్యవధిలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా రెండు లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకోగలిగింది. పరిశోధన, స్ర్కిప్టింగ్‌, షూటింగ్‌, ఎడిటింగ్‌.. ఇలా వీడియోలకు సంబంధించిన ప్రతి పనికీ తానే స్వయంగా పూనుకుంటుంది. ప్రారంభంలో బ్రాండ్‌ డీల్స్‌ను పొందడంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, క్రమేపీ పట్టు పెంచుకుని నెలకు 15 లక్షల ఆదాయాన్ని పొందే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆమె బృందం పది మందికి పెరిగింది. నెట్‌ఫ్లిక్స్‌, ఐటిసి, గూగుల్‌, హాట్‌స్టార్‌ మొదలైన ప్రముఖ బ్రాండ్స్‌తో కలిసి పని చేస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించడం కోసం, బ్రాండ్‌ డీల్స్‌తో కలిసి పని చేస్తున్నట్టూ, మున్ముందు, బ్రాండ్‌లపై ఆధారపడడం తగ్గించి, సొంతగా నిలదొక్కుకునే కంటెంట్‌ను సృష్టించడమే తన లక్ష్యమనీ పేర్కొంటోంది కావ్య.

ప్రముఖుల ప్రశంసలు

ఈమె బృహత్తర ప్రయత్నాలు పలువురు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటున్నాయి. భారతదేశంలోని ప్రతి జిల్లా సంస్కృతినీ, అక్కడి ప్రజల కథలనూ, కష్టాలనూ వెలుగులోకి తెచ్చే కావ్య ప్రయత్నాలు ప్రశంసనీయమని, పర్యావరణవేత్త, పీపల్‌ బాబా పేర్కొనడం చెప్పుకోదగిన విశేషం. ‘వైవిద్యభరితమైన మన దేశాన్ని కలిపి ఉంచే అదృశ్య బంధాలను ఆమె వీడియోలు గుర్తు చేస్తాయి. పట్టించుకోకుండా వదిలేసిన ఒక నిశ్శబ్ద వీధి, ఒక పురాతన స్మారక చిహ్నం, ఒక సరళమైన సంప్రదాయాన్ని ప్రజలకు అసాధారణమైన రీతిలో చూపించగలిగే గొప్ప వరం ఆమెకుంది. ఆమె వీడియో ప్రయాణం, ఎంతో మందికి ప్రేరణగా మారాలనీ, మన దేశ సంపదలను అన్వేషించి, గౌరవించేలా ప్రోత్సహించాలనీ కోరుకుంటున్నాను’ అన్నారు పీపల్‌ బాబా.

Updated Date - Mar 28 , 2026 | 03:38 AM