Share News

ప్రేమ లేఖలతో బంధం పదిలం

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:00 AM

కరీనా, సైఫ్‌ అలీ ఖాన్‌ దంపతులు, ఇప్పటికీ ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకుంటూ ఉంటామని చెప్పి అకస్మాత్తుగా మీడియాను ఆశ్చర్యపరిచారు. నిజంగానే ప్రేమలేఖలు బంధాన్ని బలపరిచే సాధనాలుగా ఉపయోగపడతాయా..........

ప్రేమ లేఖలతో బంధం పదిలం

కరీనా, సైఫ్‌ అలీ ఖాన్‌ దంపతులు, ఇప్పటికీ ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకుంటూ ఉంటామని చెప్పి అకస్మాత్తుగా మీడియాను ఆశ్చర్యపరిచారు. నిజంగానే ప్రేమలేఖలు బంధాన్ని బలపరిచే సాధనాలుగా ఉపయోగపడతాయా?

కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ఎప్పుడూ కపుల్‌ గోల్స్‌ను నిర్దేశించుకుంటూనే ఉంటారు. వాళ్ల ప్రేమ జీవితం గురించి వివరిస్తూ, తామిద్దరం ఇప్పటికీ పుట్టినరోజునాడు ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకుంటూ ఉంటామని తాజాగా వెల్లడించారు. ఆధునిక ప్రేమల్లో మాటలకే ప్రాధాన్యం ఎక్కువ. నేటి దంపతులు సందేశాలు, ఫోన్‌ కాల్స్‌, వాయిస్‌ నోట్స్‌ ద్వారా పరస్పరం సంభాషించుకుంటూ ఉంటారు. ఈ సంభాషణల ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారే తప్ప భావోద్వేగాలను పంచుకోరు, బహిర్గతం చేసుకోరు. ప్రేమను మాటల్లో, చేతల్లో కనబరచడం కచ్చితంగా అవసరమే! కానీ మన మాటలు పదే పదే మనసును తాకేలా ఉండాలంటే, వాటికి అక్షర రూపాన్నివ్వాలంటున్నారు ప్రముఖ లైఫ్‌ కోచ్‌, సైకోథెరపిస్ట్‌... ‘డెల్నా రాజేష్‌’. ఆమె ఏమంటున్నారంటే...

అర్థం చేసుకునే వ్యవధి చిక్కుతుంది

‘‘కీప్యాడ్‌ మీద వేగంగా వేళ్లు కదిలించి సందేశాన్ని సృష్టించడం, టైప్‌ చేసిన సందేశాన్ని చెరిపేయడం.. రెండూ సులభమే! అలాగే అందుకున్న సందేశానికి వెనువెంటనే సమాధానం ఇచ్చేయడమూ సాధ్యమే! ఇక్కడ ఆలోచనకు తగిన సమయం ఉండకపోవచ్చు. ప్రతిస్పందన రెప్పపాటులో జరిగిపోవచ్చు. ఈ దుందుడుకుతనం అపార్థాలకు దారితీసి, తిప్పలను తెచ్చిపెట్టొచ్చు. పైగా ఫోన్‌ సందేశాల్లో అసలైన భావం వ్యక్తం అవకపోవచ్చు. కానీ ఉత్తరం వీటికి పూర్తి భిన్నం. ఉత్తరం రాయాలంటే కుదురుగా కూర్చోవాలి. మనసులోని ఆలోచనలను ఒక కొలిక్కి తీసుకొచ్చి, వాటికి అక్షర రూపమివ్వడానికి సమయం పడుతుంది. ఆలోగా అవతలి వ్యక్తికి చెప్పాలనుకున్న విషయం గురించి మనలో స్పష్టత ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరం చదవడం ద్వారా వెంటనే ప్రతిస్పందించకుండా మన హృదయాన్ని అర్థం చేసుకునే తీరుబడి అవతలి వ్యక్తికి దక్కుతుంది. ఈ వ్యవధితో భావోద్వేగ భద్రత సాధ్యపడుతుంది.

ఉత్తరాలు వ్యక్తిగత రికార్డులు

ప్రేమలేఖలు రాసుకోవడం ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు. ప్రేమాప్యాయతలు, మరమ్మతులు, నిరీక్షణలు, క్షమాపణలు, కృతజ్ఞతలు, జ్ఞాపకాల వ్యక్తిగత రికార్డులు కూడా! దీర్ఘకాల అనుబంధాలు తరచూ ఒక నిశ్శబ్ద శత్రువుతో పోరాడుతూ ఉంటాయి. అదే... ‘భావోద్వేగా మతిమరుపు’. దంపతులు తొలిప్రేమ మృదుత్వాన్నీ, మాధుర్యాన్నీ మర్చిపోతారు. అంతకాలం కలిసి ఉన్న కారణాన్ని మర్చిపోతారు. ఉత్తరాలు ఈ మతిమరుపు నుంచి రక్షణ కల్పిస్తాయి. జీవితం బరువెక్కినప్పుడు, ముడిపడిన బంధం వెనకున్న భావోద్వేగాల మూలాల్లోకి ప్రయాణించడానికి ఉత్తరాలు సహాయపడతాయి. తండ్రి/తల్లి, ప్రొవైడర్‌, కేర్‌గివర్‌, పర్ఫార్మర్‌... మొదలైన పాత్రలను అందుకోక ముందు, ఒకర్నొకరు ఎంచుకున్న ఇద్దరు వ్యక్తులమనే విషయాన్ని దంపతులు గుర్తుచేసుకోడానికి ఉత్తరాలు దోహదపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరాలు రాసుకోవడం వల్ల వాటిని పదే పదే తిరిగి చదువుకోడానికీ, అక్షరాలను స్పృశించడానికీ వీలు పడుతుంది. కాబట్టి దంపతులు ఈ పాత అలవాటును పునఃప్రారంభించడం ఎంతో అవసరం. ఒక చిన్న నోట్‌తో మొదలుపెట్టి, మనసులోని భావాలను పదాల్లో వ్యక్తపరుస్తూ ఉత్తరాలు రాయడం సాధన చేయాలి.’’

Updated Date - Feb 21 , 2026 | 12:00 AM