Share News

ధర్మ సంస్థాపనార్థాయ...

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:44 AM

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిది గడిచిపోగా... ఈ కలియుగాంతంలో కల్కి అవతరిస్తాడు. పురాణ గాథలను అనుసరించి... యమ, నియమాలు, వైదిక ఆచారాలు పూర్తిగా అంతరించి...

ధర్మ సంస్థాపనార్థాయ...

తెలుసుకుందాం

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిది గడిచిపోగా... ఈ కలియుగాంతంలో కల్కి అవతరిస్తాడు. పురాణ గాథలను అనుసరించి... యమ, నియమాలు, వైదిక ఆచారాలు పూర్తిగా అంతరించి, జనం నరకం వైపు పోతూండగా... శంభల అనే గ్రామంలో విష్ణుయశుడనే రబ్రాహ్మణునికి కుమారుడిగా విష్ణువు జన్మిస్తాడు. అనేక దివ్యశక్తులు కలిగిన ఆ మూర్తి అధర్మాన్ని అణచివేసి, ధర్మాన్ని స్థాపిస్తాడు. ఆయన అత్యంత పరాక్రమవంతుడు, మహాత్ముడు, సదాచారవంతుడు. సజ్జనులను రక్షిస్తాడు. దుర్జనులను నిర్జిస్తాడు. ఆయన మనసులో తలచిన వెంటనే రకరకాల కవచాలు, ఆయుధాలు, అస్త్ర శస్త్రాలు, వాహనాలు ప్రత్యక్షమవుతాయి. చేతిలో ఖడ్గాన్ని ధరించి, దేవదత్తమనే గుర్రంపై సంచరిస్తూ, మూడు రోజుల్లో అధర్ములందరినీ అంతం చేస్తాడని ‘మహాభారతం’ చెబుతోంది. కల్కి అవతరించే సమయానికి కృతయుగం ఆరంభమవుతుందని ‘విష్ణుధర్మోత్తర పురాణం’ వెల్లడించింది.. మళ్ళీ కర్మభూమి నిర్మాణమవుతుందని, వైవస్వత మనువు పాలన మొదలవుతుందని ‘భవిష్య పురాణం’ పేర్కొంది.

విష్ణుపురాణం ప్రకారం... ఆ అవతారమూర్తికి విగ్రహ రూపాన్ని ఇచ్చినప్పుడు... నాలుగు చేతులలో శంఖం, చక్రం, ఖడ్గం, ఖేటకాలను (డాలు) ధరించి, అశ్వాన్ని ఎక్కినట్టు చూపించాలి. ఆ మూర్తిలో ఒక విలక్షణమైన క్రోధభావాన్ని, భీకరత్వాన్ని అభివ్యక్తం చేయాలి.

వైఖానస ఆగమం ప్రకారం... కల్కిని మధ్యమ దశతాళంలో, 120 అంగుళాల ఎత్తులో, గుర్రం ముఖంతో, మనుష్య దేహంతో రూపొందించాలి. ఆయన నాలుగు చేతులతో శంఖ, చక్ర, ఖడ్గ, ఖేటకాలను ధరించి భయంకరంగా ఉంటాడు. మూర్తి కౌతుకబేరం (నిత్యపూజలు అందుకొనే భోగమూర్తి) కూడా చతుర్భుజాలతోనే ఉండాలి.

అగ్ని పురాణం ప్రకారం... కల్కి విల్లు, బాణం ధరించి, గుర్రం మీద కూర్చుంటాడు. శంఖ, చక్ర, బాణ, ఖడ్గాలను కూడా ధరించి ఉండవచ్చు.


మార్కండేయ సంహిత ప్రకారం.. కల్కి రక్తవర్ణుడై, గుండ్రని కన్నులతో, చర్మపు వస్త్రాన్ని చుట్టుకొని, జటాజూటంతో, కరండమకుటం ధరించి, కత్తి డాలు పట్టుకొని, ఇరువైపులా బ్రాహ్మీ, లక్ష్మీదేవి, పరిజనులు, దేవతలతో కూడి ఉంటాడు. కాగా. ‘పాద్మసంహిత’ కొన్ని విశేషాలను చెప్పింది. దాని ప్రకారం కల్కికి మీసాలు ఉంటాయి. ఆ స్వామి ఆసనమూర్తిగా ఉన్నప్పుడు... అభయ, వరద ముద్రలు ఉండాలి. ఖడ్గ, ఖేటకాలు ఉండకూడదు. కల్కికి శయన భంగిమ లేదు. స్వామి వెనుక ఉన్న గోడపై యాజ్జవల్క్య, నారదులను చిత్రించాలి. ‘విష్వక్సేన సంహిత’ ప్రకారం... ఆయనకు కుడివైపున శ్రీదేవి, ఎడమవైపున పుష్టిదేవి ఉంటారు.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

Updated Date - Jun 19 , 2026 | 04:44 AM