Share News

కాచ్రి...ఎడారి దోసకాయ

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:08 AM

కాచ్రి (కుకుమిస్‌ ప్యూబెసెన్స్‌) పశ్చిమ భారత దేశంలోని ఎడారి, ఇసుక ప్రాంతాల్లో, ముఖ్యంగా రాజస్థాన్‌ ఎడారుల్లో సహజంగా పెరిగే ఒక రకం దోసకాయ. దీన్ని ‘అడవి దోస’ అని తెలుగువాళ్లు పిలుస్తారు. ఇది ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కూరగాయ. కాచ్రి కాయలు గోధుమ, పసుపు రంగులో ఉంటాయి. మొదట చేదుగా ఉన్నా...

కాచ్రి...ఎడారి దోసకాయ

కాచ్రి (కుకుమిస్‌ ప్యూబెసెన్స్‌) పశ్చిమ భారత దేశంలోని ఎడారి, ఇసుక ప్రాంతాల్లో, ముఖ్యంగా రాజస్థాన్‌ ఎడారుల్లో సహజంగా పెరిగే ఒక రకం దోసకాయ. దీన్ని ‘అడవి దోస’ అని తెలుగువాళ్లు పిలుస్తారు. ఇది ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కూరగాయ. కాచ్రి కాయలు గోధుమ, పసుపు రంగులో ఉంటాయి. మొదట చేదుగా ఉన్నా, పండే కొద్దీ తీపి, పులుపు కలిసిన రుచిని సంతరించుకుంటాయి. వీటిని ఎండబెట్టి కూరగాయలతో కలిపి వాడతారు. ఉత్తరాదివారికి బాగా అలవాటైన ఆహార ద్రవ్యం ఇది.

‘భోజన కుతూహల’ పాక శాస్త్ర గ్రంథం దీన్ని ఎండబెట్టుకుని తినవలసిన డ్రై వెజిటబుల్స్‌లో చేర్చి చెప్పింది. వడియాలు లేదా ఒరుగుల్లా నూనెలో వేగించుకుని వేపుడు కూరగా తింటారు. ఇతర కూరగాయలతో లేదా దుంపకూరలతో కలిపి వేయించుకోవటం కూడా ఉంది. ఒక విధమైన సుగంధ పరిమళం కలిగి ఉంటుంది. కొద్దిగా కారపు రుచి నాలుకకు తగుల్తూ ఉంటుంది. తేలికదనాన్ని ఇస్తుంది. అతిగా నీరు తాగిన దోషాన్ని పోగొడుతుందని అన్నాడు ‘భోజన కుతూహలం’లో రఘునాథ సూరి.

కాచ్రిని ఎక్కువగా పండించరు. ఎడారి ప్రాంతాల్లో సహజంగా పెరిగే కాయలివి. గ్రామీణ ప్రజలు ఆ వేడి ఇసుకలో తిరిగి ఈ మొక్కల్ని గుర్తించి, కొద్దికొద్దిగా ఏరుకుంటారు. పచ్చిగా కూడా తింటారు. ఊరగాయ పెట్టుకోవచ్చు. ఇతర కూరగాయల్లాగే వండుకోవచ్చు. ఎండబెట్టిన కాచ్రిని కూరల్లో వాడటమే కాకుండా, మెత్తగా దంచి పొడిగా చేసుకుని కూరలు, పచ్చళ్లకు రుచి కోసం కలుపుతారు.


కాచ్రిలోని సహజ పులుపువల్ల ఎడారి ప్రాంతాల్లో నిమ్మకాయ, చింతపండు లాంటి పులుపు పదార్థాలు సులభంగా దొరకని కాలాల్లో అది ముఖ్యమైన రుచినిచ్చే పదార్థంగా ఉపయోగపడింది. రాజస్థానీ గ్రామీణ వంటల్లో కాచ్రి పొడి వాడకం ఎక్కువ. మాంసాన్ని మెత్తగా చేయడానికి, పులుపు అదనంగా చేరటానికీ ఉపయోగపడుతుంది. కబాబ్‌లలో, ఖుడ్‌ ఖర్గోష్‌ లాంటి సంప్రదాయ వంటల్లో దీన్ని వాడతారు.

కాచ్రి జీర్ణాశయాన్ని బలపరుస్తుందంటారు. పొట్టలో నొప్పుల్ని తగ్గిస్తుంది. కాయల్ని ఎండబెట్టి చాలాకాలం నిల్వ చేసుకోవచ్చు; పొడిని కూడా కొన్ని నెలలపాటు దాచుకోవచ్చు. తేలికగా అరుగుతుంది. శరీరానికి తేలికదనం ఇస్తుంది. వేడి ప్రాంతాల్లో జీవించే వారికి ఇది అనుకూలంగా పని చేసే పకృతి వరం.

రాజస్థానీ, పంజాబీ ఎడారి ప్రాంతాల వంటల్లో కాచ్రికి ప్రత్యేక స్థానం ఉంది. తాజా కాచ్రితో పచ్చడి, ఎండిన కాచ్రితో గాఢమైన పుల్లటి పచ్చడి చేస్తారు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరప, వెల్లుల్లి, వేయించిన జీలకర్రతో తాజా కాచ్రిని నూరి పచ్చడి చేస్తారు. ఎండిన కాచ్రిని నానబెట్టి, వేరుశనగ లేదా నువ్వులు, వెల్లుల్లి, కారం, జీలకర్ర, బెల్లం కలిపి నూరి, పచ్చడి చేస్తారు. దీనిని కబాబ్‌లు, రొట్టెలు, పపుకస, అన్నం, అప్పడాల వంటి వాటితో తింటారు.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Sep 26 , 2026 | 01:11 AM