పాలకుడైన బానిస
ABN , Publish Date - May 22 , 2026 | 02:21 AM
బానిసలుగా వెళ్ళి, ఐగుప్తు (ఈజిప్టు)ను పాలించే స్థాయికి ఎదిగి, స్వజాతి సముద్ధరణకు అంకితమైనవారిలో... మోషేకన్నా మూడువందల ఏళ్ళ క్రితం మరొకరున్నారు. అతని...
దైవమార్గం
బానిసలుగా వెళ్ళి, ఐగుప్తు (ఈజిప్టు)ను పాలించే స్థాయికి ఎదిగి, స్వజాతి సముద్ధరణకు అంకితమైనవారిలో... మోషేకన్నా మూడువందల ఏళ్ళ క్రితం మరొకరున్నారు. అతని పేరు యోసేపు. అతని జీవితాన్ని పరిశీలిస్తే చిత్రవిచిత్రమైన సంఘటనలు కనిపిస్తాయి. ఐగుప్తీయులు కనిపించిన యువతీ యువకులను బానిసలుగా కొనడం, వారితో అన్ని పనులూ చేయించుకోవడం లాంటి సంఘటనలు యోసేపు కాలం నుంచి ఎన్నో ఉన్నాయి. యోసేపు కూడా అలా అమ్మకానికి గురైనవాడే. అతనంటే ఓర్వలేని అన్నలే అతన్ని ఐగుప్తు వర్తకులకు అమ్మేశారు. ముందుగా... అతని పూర్వ చరిత్రను తెలుసుకుందాం.
ప్రపంచంలో పలు మతాలకు మూల పురుషుడు అబ్రహం. అతనికి ‘జననముల తండ్రి’ అనే మరో పేరు కూడా ఉంది. ఇస్సాకు అతని చిన్న కుమారుడు. కాగా... ఇస్సాకు చిన్న కుమారుడు యాకోబు. అతనికి పన్నెండు మంది కుమారులు. వారే పన్నెండు తెగల ఇజ్రాయేలీయులు. వారిలో పదకొండోవాడు యోసేపు. ఈ పన్నెండు తెగల్లో... యోదా తెగ నుంచి దావీదు, క్రీస్తు లాంటి మహనీయులు పుట్టారు. లోకానికి సందేశకులయ్యారు.
యోసేపు పుట్టినప్పటి నుంచి అతని తండ్రి యాకోబుకు అన్నీ సమృద్ధిగా కలిసొచ్చాయట. అందుకే అతనంటే యాకోబుకు ఎంతో ఇష్టం. ఇది మిగిలిన కుమారుల అసూయకు కారణమయింది. వారు యోసేపును ఏకంగా అంతం చెయ్యాలనుకున్నారు. వారి ప్రయత్నాలు విఫలం కావడంతో... ఆ దారిన వస్తున్న ఇస్మాయేలీయులకు యోసేపును అమ్మేశారు. వారు ఐగుప్తీయులకు విక్రయించారు. ఐగుప్తుకు వెళ్ళిన తరువాత... తన చాతుర్యంతో తక్కువ కాలంలోనే ఎంతోమందిని యోసేపు ఆకట్టుకున్నాడు. అనేక ఆసక్తికరమైన సంఘటనల అనంతరం ఈజిప్టు రాజమందిరంలో అధికారికంగా చోటు దక్కించుకున్నాడు. చివరకు ఐగుప్తుకు పాలకుడు కూడా అయ్యాడు.
యోసేపు తనకు అందివచ్చిన అవకాశాలన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కానీ తన మూలాలను మరువలేదు. తనకన్నా ముందు కోటలోకి వచ్చి బానిసల్లా బతుకుతున్నవారికి విముక్తి కల్పించాడు. యోసేపు సింహాసనం అధిష్టించాక... అతని అన్నలు నిందితులుగా పట్టుబడి... తీర్పు కోసం అతని ముందు నిలబడ్డారు. తాను ఎవరనే అనుమానం వారికి రానీయకుండా... న్యాయవిచారణ జరిపి వారిని విడుదల చేశాడు. అన్నల ప్రవర్తన, బానిసగా అమ్మకం లాంటివి ఎదుర్కొన్నా... తన ప్రతిభతో పాలకుడిగా, ఎందరికో విముక్తి కలిగించినవాడుగా ఖ్యాతిగాంచాడు యోసేపు.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్,
9866755024
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..