పదకొండో ఆజ్ఞ
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:51 AM
సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు పది ఆజ్ఞలను (టెన్ కమాండ్‌మెంట్స్) అందించాడు. ఆ ఆజ్ఞలు క్రైస్తవ విశ్వాసానికి ప్రధాన సూత్రాలుగా నిలిచాయి. అవి కాకుండా...
దైవమార్గం
సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు పది ఆజ్ఞలను (టెన్ కమాండ్‌మెంట్స్) అందించాడు. ఆ ఆజ్ఞలు క్రైస్తవ విశ్వాసానికి ప్రధాన సూత్రాలుగా నిలిచాయి. అవి కాకుండా మరో ఆజ్ఞను దైవపుత్రుడైన క్రీస్తు బోధించాడు. అదే ప్రేమ. ఆ ఆజ్ఞను తప్పనిసరిగా పాటించి, తన అనుచరులు కావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చాడు.
తన మరణానికి ముందురోజు శిష్యులతో క్రీస్తు సమావేశమయ్యాడు. ఆ శిష్యుల పాదాలు కడిగాడు. తోటివారిపట్ల హెచ్చుతగ్గులకు పోకుండా ఎంత వినయంగా ఉండాలో, సమాజంలోని సాటివారిని ద్వేషించకుండా పరస్పరం ఎలా ప్రేమించుకోవాలో వివరించాడు. అదేరోజు రాత్రి జరిగిన విందులో రొట్టెను విరిచి... ‘‘ఇది నా శరీరం. దీన్ని నా జ్ఞాపకార్థం స్వీకరించండి’’ అని చెప్పాడు. ఆ రాత్రికి ప్రతీకగా... నాటి నుంచి దాదాపు క్రైస్తవులందరూ ఈ విందును నిర్వహిస్తున్నారు. రోమన్ క్రైస్తవులకు ఇది దైనందిన కృత్యమయింది. క్రీస్తు ఆ సందర్భంలో ఇచ్చిన ప్రేమాజ్ఞను పాటించడం అందరి విధి.
ఒకసారి ధర్మశాస్త్ర బోధకుడొకరు క్రీస్తును కలుసుకొని ‘‘మీ ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞ గొప్పది?’’ అని అడిగాడు. ‘‘నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో... నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేది మొదటి ఆజ్ఞ కాగా... నీవు నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాడిని ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ’’ అని క్రీస్తు జవాబు ఇచ్చాడు. తన శిష్యుల సమైక్యతను అసూయా ద్వేషాగ్నులు దగ్ధం చెయ్యడానికి ముందే... తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం ‘‘నేను మిమ్మల్ని ప్రేమించినట్టే... మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి’’ అని క్రీస్తు సూచించాడు.
ఆయన మాటల్లో... పూర్వం దేవుడు చెప్పిన పది ఆజ్ఞల సారం నిక్షిప్తమయి ఉంది. స్వార్థరహితంగా అందరినీ ప్రేమించడం, నీ, నా, తన, మన అనే తేడాలు లేకుండా ప్రేమించడం, మనను ఇష్టపడేవారినే కాకుండా... శత్రువులను సైతం ప్రేమించడం... ఇవన్నీ అందులో కనిపిస్తాయి. ఈ సారాన్నంతటినీ కల్వరిగిరి మీద క్రీస్తు మౌనంగా ప్రకటించాడు. మానవులందరూ ప్రేమాజ్ఞను పాటించాలని ఆయన కోరుకున్నాడు. విశ్వం జీవించేది, విశ్వంలో ఉన్నవారు రాణించేది ఆ ప్రేమ సూత్రంతోనే.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్,
9866755024
ఇవి కూడా చదవండి...
విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్
కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News