భారత ఆర్మీ ధీర
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:10 AM
వైఫల్యాన్ని సవాలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. భారత ఆర్మీలో ‘రుద్ర’ యుద్ధ హెలికాప్టర్‌ను నడిపే తొలి మహిళా పైలట్‌గా జమ్మూ అమ్మాయి కెప్టెన్ హంసజ శర్మ రికార్డు సృష్టించారు.
వైఫల్యాన్ని సవాలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. భారత ఆర్మీలో ‘రుద్ర’ యుద్ధ హెలికాప్టర్‌ను నడిపే తొలి మహిళా పైలట్‌గా జమ్మూ అమ్మాయి కెప్టెన్ హంసజ శర్మ రికార్డు సృష్టించారు.
భారత సైన్యంలో మహిళలు కేవలం నిర్వహణ పరమైన పనులకే పరిమితం కాదని, యుద్ధరంగంలో శత్రువుల పని పట్టడంలోనూ సిద్ధమేనని మరోమారు నిరూపితమైంది. జమ్మూకు చెందిన 27 ఏళ్ల కెప్టెన్ హంసజ శర్మ భారత ఆర్మీలో ‘రుద్ర’ సాయుధ హెలికాప్టర్‌ను నడిపే అర్హత సాధించిన తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన 2026 ఆర్మీ పరేడ్ డేలో ఆమె నేతృత్వంలోని 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్ ప్రదర్శించిన విన్యాసాలు దేశం గర్వించేలా చేశాయి.
వైఫల్యం నుంచి విజయానికి
హంసజ ప్రయాణం పూలబాట ఏమీ కాదు. ఆర్మీ ఎంపిక ప్రక్రియలో మొదట వైద్య కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. చాలామంది ఇక్కడే నిరాశ చెందుతారు. కానీ హంసజ పట్టు వదలలేదు. తన గది గోడపై ‘నీపట్ల నువ్వు కఠినంగా ఉండు’ అని రాసుకుని, కఠోర శ్రమతో తన లోపాలను సరిదిద్దుకున్నారు. ఏ కోచింగ్ లేకుండానే ఆర్మీ ప్రమాణాలను అందుకుని నాసిక్‌లోని ట్రైనింగ్ స్కూల్‌లో టాపర్‌గా నిలిచారు. ఉత్తమ యుద్ధ విమాన పైలట్‌కు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘సిల్వర్ చీతా’ ట్రోఫీని అందుకున్న తొలి మహిళా అధికారిగా ఆమె రికార్డు సృష్టించారు.
శత్రు భయంకర... రుద్ర
హంసజ నడిపే ఈ రుద్ర హెలికాప్టర్ సామాన్యమైనది కాదు. ఇది మన దేశీయ సాంకేతికతతో తయారైన అద్భుతం. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) రూపొందించిన ఈ హెలికాప్టర్ భూమికి దగ్గరగా ఉంటూ శత్రువుల ట్యాంకులను, స్థావరాలను ధ్వంసం చేయగలదు. ముఖ్యంగా హిమాలయాల వంటి ఎత్తయిన ప్రాంతాల్లో, గడ్డకట్టే చలిలో కూడా ఇది అత్యంత సమర్థవంతంగా పని చేస్తుంది.
ఆకాశమే హద్దుగా
ఒకప్పుడు కేవలం పురుషులకే పరిమితమైన యుద్ధ విమాన పైలట్ బాధ్యతల్లోకి హంసజ వంటివారు రావడం భారత సైన్యంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు సంకేతం. ఇక్కడ ప్రతిభకు తప్ప మరివేటికీ ప్రాధాన్యం లేదని ఆమె నిరూపించారు. జమ్ము వీధుల నుంచి యుద్ధ విమాన కాక్‌పిట్ వరకు ఆమె సాగించిన పయనం దేశంలోని లక్షలాదిమంది యువతులకు స్ఫూర్తిదాయకం. నింగిలో రుద్ర గర్జిస్తుంటే, ఆ స్టీరింగ్‌ను ఒక భారతీయ మహిళ ధైర్యంగా నడపడం మనందరికీ గర్వకారణం.
రుద్ర ప్రత్యేకతలివి...
విధ్వంసక ఆయుధాలు: ఇందులో 20 ఎంఎం గన్, 70 ఎంఎం రాకెట్లతోపాటు శత్రు ట్యాంకులను నేలమట్టం చేసే ‘హెలీనా’ క్షిపణులు ఉంటాయి.
అధునాతన సెన్సార్లు: చీకట్లోనైనా, మంచు కురుస్తున్నప్పుడైనా శత్రువులను కనిపెట్టే థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థ దీని సొంతం.
రక్షణ కవచం: పైలట్ కూర్చునే సీటు నుంచి ఇంధన ట్యాంకుల వరకు అన్నీ బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యంతో ఉంటాయి. శత్రువుల క్షిపణి వస్తోందని ముందుగానే హెచ్చరించే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.