ఇంటి గడప దాటి...పారిశ్రామికవేత్తలుగా ఎదిగి
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:02 AM
స్టార్టప్ అనగానే మనకు వేలకోట్ల నిధులు, విదేశీ పెట్టుబడులు గుర్తుకువస్తాయి. కానీ, అసలైన పారిశ్రామిక విప్లవం చిన్న ఊర్లోని మధ్యతరగతి మహిళల చేతుల్లో రూపుదిద్దుకుంటోంది. ఓటమిని గెలుపుగా మార్చుకున్న ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
స్టార్టప్ అనగానే మనకు వేలకోట్ల నిధులు, విదేశీ పెట్టుబడులు గుర్తుకువస్తాయి. కానీ, అసలైన పారిశ్రామిక విప్లవం చిన్న ఊర్లోని మధ్యతరగతి మహిళల చేతుల్లో రూపుదిద్దుకుంటోంది. ఓటమిని గెలుపుగా మార్చుకున్న ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
మన దేశంలో పారిశ్రామికవేత్తల కథలు అనగానే ఎక్కువగా వెంచర్ క్యాపిటల్, టెక్నాలజీ స్టార్ట్‌పల చుట్టూనే తిరుగుతాయి. కానీ, వెలుగు జిలుగులకు దూరంగా కుగ్రామాల్లో ఉంటూనే స్థానిక సమస్యలకు పరిష్కారాలు చూపుతూ పదిమందికీ ఉపాధినిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరు రాత్రికి రాత్రే స్టార్లు కాలేదు. ప్రతి అడుగులోనూ ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఒత్తిళ్లు ఎదురైనా పట్టుదలనే ఆయుధంగా చేసుకున్నారు. అడ్డంకులను అధిగమించి గెలుపు జెండా ఎగురవేసిన ముగ్గురు మహిళల ప్రయాణం నేటితరం యువతకు ఆదర్శ ప్రాయం.
చెన్నైకి చెందిన తామరై సెల్వి కథ ఇది. లాక్‌డౌన్ సమయంలో ప్రపంచం స్తంభించినా ఆమె ఆలోచనలు మాత్రం ఆగలేదు. ఖాళీగా ఉండకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ డెకరేటివ్ వస్తువుల తయారీ నేర్చుకున్నారు. మట్టిదీపాలు, ఐస్‌క్రీం పుల్లలు, అరటి ఆకులతో చేసిన కళాఖండాలను విక్రయించేందుకు కేవలం 8 వేల రూపాయలతో రంగంలోకి దిగారు. ప్రారంభంలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. మొదటి నెలలో వచ్చిన ఆదాయం 1500 రూపాయలే. కానీ ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వచ్చిన ప్రతి రూపాయిని అనవసర ఖర్చులకు వాడకుండా తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను వాడుకుంటూ ‘హీనా హోం డెకార్స్’ బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. డెలివరీ సమయంలో వస్తువులు పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురైతే ప్యాకేజింగ్ నాణ్యతను పెంచుతూ సమస్యను పరిష్కరించుకున్నారు. నేడు ఆమె సంస్థ రోజుకు 100కుపైగా ఆర్డర్లు అందుకుంటూ గతేడాది ఏకంగా 56 లక్షల రూపాయల టర్నోవర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఫిజియోథెరపిస్ట్ నుంచి తయారీదారుగా
మహారాష్ట్రలోని వాద్రాకు చెందిన డాక్టర్ తన్విపాండే మార్గం మరింత విభిన్నం. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన ఆమె రోగులకు చికిత్స అందించే సమయంలో ఒక ప్రధానమైన లోటును గమనించారు. రోగులకు అవసరమైన ‘ఆర్థోపెడిక్ ఎయిడ్స్‘ (రోగులకు అవసరమైన పరికరాలు) స్థానికంగా లభించడం లేదు. దీంతో రోగులు నాగ్‌పూర్ వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా ఒక తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని సంకల్పించారు. అయితే, డాక్టర్‌గా ఉన్న ఆమెకు ఫ్యాక్టరీ నిర్వహణ, బ్యాంక్ పేపర్ వర్క్ కొత్త సవాళ్లు విసిరాయి. అయినా వెనకడుగు వేయకుండా ‘శ్రీసాయి ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ ఎయిడ్స్’ను ప్రారంభించారు. ప్రస్తుతం వార్దా జిల్లాలో ప్రత్యేకమైన పాదరక్షలు, స్ప్లింట్లు తయారుచేసే ఏకైక యూనిట్ ఇదే. తన వైద్య వృత్తికి, వ్యాపారానికి సమన్వయం కుదుర్చుకుంటూ మానవీయతతో కూడిన వ్యాపారవేత్తగా ఎదిగారు తన్విపాండే.
కుటుంబ కలను ఫ్యాక్టరీగా మార్చి
తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన భారతిది అరుదైన పోరాటం. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తిచేసినా పేదరికం కారణంగా ఆమె కలలు కాగితానికే పరిమితమయ్యాయి. ఆమె భర్త శివకుమార్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసేవారు. ఇద్దరికీ సొంతంగా ఒక ఇండస్ట్రియల్ యూనిట్ పెట్టాలని ఉన్నా బ్యాంకు రుణాలు దొరకక ఏళ్ల తరబడి నిరీక్షించారు. అయితే, ప్రభుత్వం నిర్వహించే పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల ద్వారా మెలకువలు నేర్చుకున్న భారతి ఎట్టకేలకు బ్యాంకు రుణం సంపాదించి 2003లో ‘శ్రీగణపతి ఇండస్ట్రీస్ స్థాపించారు. భారీ వాహనాలకు అవసరమైన విడిభాగాలను తయారుచేసే ఈ యూనిట్ ఇప్పుడు నిరంతర ఆర్డర్లతో బిజీగా ఉంది. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వాడుతూ లెక్కలను పక్కాగా నిర్వహిస్తూ నలుగురికీ పని కల్పిస్తోంది. ఒకప్పుడు సాధ్యం కాదు అనుకున్న కల నేడు ఆమె గ్రామంలోని ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తోంది.
డబ్బు కాదు.. తపన ఉండాలి
ఈ ముగ్గురు మహిళల ప్రయాణం ఒక విషయాన్ని చాటిచెబుతోంది. వ్యాపారంలో విజయం సాధించడానికి కేవలం డబ్బు ఉంటే సరిపోదు, నిరంతరం నేర్చుకోవాలన్న తపన ఉండాలి. వీరు కేవలం లాభాల కోసమే పని చేయడం లేదు, స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. తమ కమ్యూనిటీ సమస్యలను పరిష్కరిస్తున్నారు. మహిళా సాధికారత అనేది కేవలం వేదికల మీద చెప్పే నినాదం కాదు, అది అట్టగు స్థాయి నుంచి వస్తున్న నిశ్శబ్ద విప్లవం.