అంతర్ముఖ ప్రయాణం
ABN , Publish Date - May 22 , 2026 | 02:24 AM
కొన్ని వారాల క్రితం ఒక పేషెంట్ నన్ను కలిశారు. వయోధికుడైన ఆయనకు కరోనరీ స్టెంటింగ్ ప్రక్రియ జరిగింది. బాగానే కోలుకున్నారు. ఆయన రిపోర్టుల్ని నేను పరిశీలిస్తున్నప్పుడు...
తీర్థయాత్ర...
కొన్ని వారాల క్రితం ఒక పేషెంట్ నన్ను కలిశారు. వయోధికుడైన ఆయనకు కరోనరీ స్టెంటింగ్ ప్రక్రియ జరిగింది. బాగానే కోలుకున్నారు. ఆయన రిపోర్టుల్ని నేను పరిశీలిస్తున్నప్పుడు... ‘‘డాక్టర్! ఈ ఏడాది నేను చార్‌ధామ్ యాత్రకు వెళ్ళొచ్చా?’’ అని అడిగారు. ఒక కార్డియాలజిస్టుగా, హిమాలయ యాత్రలోని శారీరక శ్రమను నా మనసు వెంటనే అంచనా వేసింది. చాలా ఎత్తులో, నిటారుగా ఉండే మార్గాల్లో ప్రయాణించాలి. ఆక్సిజన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అతి శీతలమైన ఉష్ణోగ్రతలు, అలసట, భావోద్వేగాల్లో ఉద్రిక్తత, ఇటీవలే చికిత్స పొందిన గుండె మీద భౌతికమైన ఒత్తిడి... వీటిని పరిగణనలోకి తీసుకొని, ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాను. ఆయన వెళ్ళిన తరువాత... ‘అసలు మనుషులు యాత్రలకు ఎందుకు వెళ్తారు? బలహీనమైన ఈ శరీరం, ఏదో పవిత్రమైన దాన్ని వెతుకుతూ పర్వతాలను, నదులను దాటి ప్రయాణించాలని ఎందుకు ఇంకా తపిస్తుంది? నాగరికతలను, శతాబ్దాలను అధిగమించి ‘యాత్ర’ అనే భావన ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది?’ అనే ప్రశ్నలు నాలో మెదిలాయి. బహుశా... కేవలం బాహ్యంగా ప్రయాణించడమే కాదు, అంతరంగంలోకి తిరిగి వెళ్ళాలనే అవ్యక్తమైన తపన ప్రతి వ్యక్తి లోపలా ఉండడం వల్ల కావచ్చునని అనిపించింది.
ఆధ్యాత్మికత అంటే...
‘హార్ట్‌ఫుల్‌నెస్’ పద్ధతిలో, ఆధ్యాత్మికత అంటే కేవలం పుణ్యక్షేత్రాలను సందర్శించడం, ఆచారాలు పాటించడం, లేదా బాహ్య ప్రయాణాలు చేయడం మాత్రమే కాదు. నిజమైన ‘తీర్థయాత్ర’ అంటే చైతన్యం అంతర్ముఖంగా ప్రయాణించడం. దీన్ని దాజీ ‘సాహసయాత్ర... అంటే ఒకరు తమ చైతన్యంలోకి సాగించే అంతర్గతమైన సాహసయాత్ర’గా అభివర్ణించారు. పర్వతాలను, సముద్రాల్ని, సుదూర ప్రాంతాల్నీ అన్వేషించే సాహసయాత్రల్లా కాకుండా... ఈ యాత్ర మానవ హృదయంలోని విశాలమైన, అప్పటివరకూ అన్వేషించని ప్రదేశాన్ని అన్వేషిస్తుంది. ఈ ప్రయాణం కొనసాగుతున్నకొద్దీ మనిషి జీవితంలో ఒక అసాధారణమైన అంశం సహజంగా వికసించడం ఆరంభిస్తుంది. అశాంతి స్థానంలో సంతృప్తి, ఆందోళన స్థానంలో శాంతి, భయం స్థానంలో ధైర్యం, గందరగోళం స్థానంలో స్పష్టత, అధికారభావం స్థానంలో ప్రేమ, స్వార్థం స్థానంలో ఔదార్యం వస్తాయి. ఆధ్యాత్మికత అంటే జీవితం నుంచి పారిపోవడం కాదనీ, జీవితాన్ని శుద్ధి చేసుకోవడం అనీ యాత్రికుడు నెమ్మదిగా తెలుసుకుంటాడు.
నిజమైన గమ్యం...
బాహ్యమైన యాత్రలు నిస్సందేహంగా అపారమైన ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంటాయి. పవిత్రమైన ప్రదేశాలు శతాబ్దాల సామూహిక ప్రార్థన, భక్తి, ఉన్నతమైన ప్రకంపనలను తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. అవి వినయాన్ని, శరణాగతిని ప్రేరేపిస్తాయి. వ్యక్తిగత ఆశయాలకన్నా జీవితం మరింత విశాలమైనదని గుర్తు చేస్తాయి. కానీ అంతిమంగా... బాహ్యమైన ప్రతి యాత్ర అంతర్గతమైన మనస్సును మేలుకొలపడానికి ఉద్దేశించినది. బాహ్యమైన హిమాలయాలు గంభీరమైనవి. కానీ అంతర్గతమైన హిమాలయాలు అంతకన్నా గొప్పవి. ఒక వ్యక్తి పుణ్యక్షేత్ర దర్శనానికి వేల కిలోమీటర్లు ప్రయాణించినా... అంతర్గతంగా అశాంతితోనే మిగిలిపోవచ్చు. మరొకరు నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చొని... హృదయంలోనే ఉన్న పవిత్రమైన ఉనికిని గుర్తించవచ్చు. చైతన్యమే నిజమైన దేవాలయం. అస్తిత్వాన్ని శుద్ధి చేసుకోవడమే నిజమైన యాత్ర. దైవంతో అంతర్గతమైన ఐక్యతే నిజమైన గమ్యం.
అసలైన అర్థం
‘చార్‌ధామ్ యాత్ర చేయవచ్చా?’ బఅని అడిగిన ఆ వ్యక్తి... తనకు తెలియకుండానే శాశ్వతమైన ఒక సత్యాన్ని నాకు గుర్తు చేశారు. మానవులు కేవలం మనుగడతో సంతృప్తి చెందరు. ప్రతి ఆత్మ... తనలోపల ఎక్కడో ఒక చోట అతీతమైన స్థితికోసం పరితపిస్తుంది. కొందరు దాన్ని పర్వతాల్లో, మరికొందరు ప్రార్థనలో, ఇంకొందరు సేవలో, మౌనంలో, ధ్యానంలో అన్వేషిస్తారు. కానీ నిజాయితీతో కూడిన ప్రతి మార్గం చివరకు అంతర్ముఖంగానే కొనసాగుతుంది. చివరకు, గొప్ప ప్రయాణం ఒక పుణ్య క్షేత్రం నుంచి మరో పుణ్య క్షేత్రానికి కాదు... మనస్సులోని గందరగోళం నుంచి హృదయంలోని నిశ్శబ్దానికి సాగుతుంది. చైతన్యం... ప్రవృత్తి నుంచి కరుణకు, అహం నుంచి శరణాగతికి, అశాంతి నుంచి నిశ్చలతకు పరిణామం చెందినప్పుడు... మానవ జీవితం దాని అత్యున్నత స్థాయిలోకి వికసిస్తుంది. అప్పుడు గుండె అనేది కేవలం రక్తాన్ని పంప్ చేసే అవయవం కాదు... అనంతమైనదాన్ని, నిత్యమైనదాన్ని చేరుకొనే పవిత్ర ద్వారంగా మారుతుంది. ప్రపంచంలో ఒక యాత్రికుడిగా ఆరంభమై... చివరకు తన అంతరంగంలోనే ఉన్న గమ్యానికి, స్వస్థలానికి చేరుకోవడం... బహుశా ప్రతి తీర్థయాత్ర తాలూకు అసలైన అర్థం అదేనేమో!
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..