ఈ బంగారు తల్లులు కీర్తి పతాకలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:04 AM
వైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని.. సంకల్పానికి కాదని నిరూపించిన వీర వనితలు వీరు. పేదరికం, అవమానాలు, కంటికి కనిపించని భవిష్యత్తు, శారీరక లోపాలు.. ఇవన్నీ ఒకవైపు విసిరిన సవాళ్లయితే.. మరోవైపు వాటిని చిత్తుచేస్తూ విశ్వక్రీడా వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆత్మవిశ్వాసం వీరిది.
వైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని.. సంకల్పానికి కాదని నిరూపించిన వీర వనితలు వీరు. పేదరికం, అవమానాలు, కంటికి కనిపించని భవిష్యత్తు, శారీరక లోపాలు.. ఇవన్నీ ఒకవైపు విసిరిన సవాళ్లయితే.. మరోవైపు వాటిని చిత్తుచేస్తూ విశ్వక్రీడా వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆత్మవిశ్వాసం వీరిది. కన్నీళ్లను చెమట చుక్కలుగా మార్చి, ప్రపంచం తమవైపు చూసేలా చేసిన ఈ నలుగురు ఛాంపియన్ల జీవిత గాధలు కేవలం క్రీడా విజయాలు మాత్రమే కాదు... ఓడిపోతున్న ప్రతి మనిషికి గెలుపు మార్గాన్ని చూపే సజీవ స్ఫూర్తి దీపాలు!
ఆర్మ్‌లెస్ ఆర్చర్- శీతల్ దేవి
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా లోయిధార్ అనే మారుమూల గ్రామంలో జన్మించింది శీతల్ దేవి. పుట్టుకతోనే ‘ఫోకోమెలియా’ అనే అరుదైన జన్యులోపంతో రెండు చేతులు లేకుండా జన్మించింది. చేతులు లేని ఆడపిల్ల పుట్టడంతో ఆ పేద కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్నతనంలో తోటి పిల్లలు ఆడుకుంటుంటే, శీతల్ దూరంగా నిలబడి చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేది.అయితే శీతల్ ఆత్మన్యూనతా భావానికి లొంగిపోలేదు. కాళ్లనే చేతులుగా మార్చుకుంది. రోజువారీ పనుల నుంచి చెట్లు ఎక్కడం వరకు ప్రతి పనినీ కాళ్లతోనే చేయడం సాధన చేసింది. 2019లో భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఆమెలోని ప్రతిభను గుర్తించింది. ఆమెకు కృత్రిమ చేతులు అమర్చాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. దాంతో కోచ్‌లు అభిలాష చౌదరి, కుల్దీప్ వేద్వాన్‌లు ఆమెకు కాళ్లతోనే విల్లు పట్టడం నేర్పించారు.
కుడి కాలుతో విల్లును పట్టుకుని, గొంతు, గడ్డం సాయంతో బాణాన్ని వెనక్కి లాగి గురి చూసి కొట్టడం నేర్చుకుంది. వినడానికి అసాధ్యంగా అనిపించే ఈ విద్యను కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే శీతల్ ఆపోశన పట్టింది. పారా ఆర్చరీ చరిత్రలోనే ప్రపంచంలోనే ఏకైక ఆర్మ్‌లెస్ (చేతులు లేని) మహిళా ఆర్చర్‌గా చరిత్రకెక్కింది. 2024 ప్యారిస్ పారాలింపిక్స్‌లో పతకం సాధించి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు అందుకుంది.
జపాన్‌లో ఇటీవల ముగిసిన ఆసియా పారా గేమ్స్ 2026 లోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ పతకాల పంట పండించింది. తన అసమాన ప్రతిభతో మరోసారి బంగారు పతకాలను ముద్దాడి భారత్ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా ఎగురవేసింది.
పోలియో కబళించినా.. మోనా అగర్వాల్
రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన మోనా అగర్వాల్‌ను తొమ్మిది నెలల పసిపాపగా ఉన్నప్పుడే పోలియో మహమ్మారి కబళించింది. దాంతో ఆమె రెండు కాళ్లు పూర్తిగా పక్షవాతానికి గురయ్యాయి. వీల్‌చైర్‌కే పరిమితమైన ఆడపిల్లగా మోనా ఎన్నో వివక్షలు ఎదుర్కొంది. అయినా పట్టుదలతో దూరవిద్య ద్వారా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
డిసెంబర్ 2021లో (34 ఏళ్ల వయసులో) షూటింగ్ వైపు అడుగులు వేసింది. సరైన రైఫిల్ కొనడానికి డబ్బులు లేక రుణాలు తీసుకుంది. చంటిబిడ్డను ఇంట్లో ఉంచి, ప్రాక్టీస్ కోసం తీవ్రమైన శారీరక, మానసిక వేదనను అనుభవించింది.
రైఫిల్ బరువును మోయడం వీల్‌చైర్‌పై ఉన్న మోనాకు అత్యంత కష్టమైనప్పటికీ, ఆమె పట్టుదల ముందు అది చిన్నదైపోయింది. పారా వరల్డ్‌కప్‌లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణం, ప్యారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.
తాజాగా ముగిసిన ఆసియా పారా గేమ్స్ 2026లో మోనా అగర్వాల్ మళ్లీ తన గురి తప్పని రైఫిల్ ప్రదర్శనతో మెరిసింది. షూటింగ్ విభాగంలో అత్యంత కఠినమైన పోటీని తట్టుకొని భారత్‌కు మరొక మరో రెండు బంగారు పతకాలు అందించి తన ఛాంపియన్ ఇమేజ్‌ను మరోసారి నిరూపించుకుంది. క్రీడలకు ఆమె చేస్తున్న కృషికిగాను భారత ప్రభుత్వం మోనాను అర్జున అవార్డుతో సత్కరించింది.
వీల్‌చైర్ యోధురాలు- సువర్ణ రాజ్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన సువర్ణ రాజ్ రెండేళ్ల వయసులోనే పోలియో కారణంగా రెండు కాళ్ల స్వాధీనాన్ని శాశ్వతంగా కోల్పోయింది. సమాజంలో దివ్యాంగులకు ఉన్న సదుపాయాల లేమి ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. రైళ్లలో, బస్సుల్లో వీల్‌చైర్ వెళ్లే మార్గం లేక నరకయాతన అనుభవించింది.
ఆ అవమానమే ఆమెను ఒక పోరాట యోధురాలిగా మార్చింది. రోజువారీ ప్రాక్టీస్ చేస్తూనే, దేశవ్యాప్తంగా పబ్లిక్ బిల్డింగ్‌లు, రైల్వే స్టేషన్‌లలో ‘యాక్సెసిబిలిటీ ఆడిట్స్ (దివ్యాంగుల సౌకర్యాల తనిఖీ) నిర్వహించింది. భారత ఎన్నికల సంఘం తరఫున ‘దివ్యాంగుల ఓటింగ్ విధానం’ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసి సామాజిక మార్పుకు కృషి చేసింది.
పారా అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న సువర్ణ రాజ్.. డిస్కస్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది.ఇటీవల ముగిసిన ఆసియా పారా గేమ్స్‌లోనూ సువర్ణ రాజ్ తన త్రోలతో పతక వేదికపై నిలిచింది. అథ్లెటిక్స్ విభాగంలో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. నడవలేకపోయినా, సమాజంలో మార్పు కోసం, క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలు నేడు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి.
చీకటిని చీల్చుకొని... సిమ్రాన్ శర్మ
ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌కు చెందిన సిమ్రాన్ శర్మ జీవితం పుట్టుకతోనే చీకటిమయమైంది. ఆమె అత్యంత తీవ్రమైన దృష్టిలోపంతో జన్మించింది. బాల్యంలో పాఠశాలకు వెళ్తే తోటి పిల్లలు ఆమె వైకల్యాన్ని చూసి ఏడిపించేవారు, హేళన చేసేవారు. తరగతి గదిలో వెనుక బెంచీకే పరిమితమై, ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి గురై ఎన్నో రాత్రులు ఏడ్చింది.
అయితే, ఆమెలోని క్రీడా తృష్ణను ఆ అంధకారం ఆపలేకపోయింది. కాలేజీ రోజుల్లో ఆమెలోని పరుగు తపనను గమనించిన గజేంద్ర సింగ్ (ఆర్మీ జవాన్) ఆమెకు మార్గదర్శిగా మారారు. సిమ్రాన్ ఆశయానికి తోడుగా నిలిచిన గజేంద్ర, ఆమెను 2017లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన మరుసటి రోజే ఆమెను రన్నింగ్ ట్రాక్‌పైకి తీసుకెళ్లారు. సిమ్రాన్ సాధన కోసం గజేంద్ర తన సొంత ఆస్తులను, పొలాన్ని అమ్మేశారు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ప్యారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సిమ్రాన్, భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకొని అందరి ప్రశంసలు అందుకుంది.
ట్రాక్‌పై మెరుపు వేగంతో దూసుకెళ్లే సిమ్రాన్.. తాజాగా ముగిసిన ఆసియా పారా గేమ్స్ 2026 లోనూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. 100 మీటర్లు, 200 మీటర్ల స్ర్పింట్ విభాగాల్లో అద్భుతమైన టైమింగ్‌తో పరుగు తీసి స్వర్ణ పతకాలు సాధించి భారత పతకాల పట్టికను అగ్రభాగాన నిలిపింది.