అంతరిక్ష శోధనకు సారథిగా...
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:54 AM
అంతరిక్షంలో తారల మధ్య ధూళి రేణువులను అధ్యయనం చేసే, 168 కోట్ల డాలర్ల ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్టు ‘పఫిన్స్’కు నేతృత్వం వహించబోతోంది బెంగుళూరుకు చెందిన రమ్య మంజునాథ్ అంచె. అందుకోసం సూక్ష్మ టెలిస్కో్‌పను నిర్మించబోతున్న ఈ మహిళా ఖగోళ శాస్త్రవేత్త ఆసక్తికరమైన కథనమిది.
2003, ఫిబ్రవరి 1న స్పేస్ షటిల్ కొలంబియా దుర్ఘటనలో, కల్పనా చావ్లా, మరో ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే! ఈ విషాద వార్త ప్రపంచాన్ని శోక సముద్రంలో ముంచెత్తితే, రమ్య మంజునాథ్‌లో అంతరిక్షం పట్ల అంతులేని ఆసక్తిని రేకెత్తించింది. దాంతో తోటి విద్యార్థులకు భిన్నంగా పరిశోధనా రంగం వైపు అడుగులు వేసింది రమ్య. ఆ క్రమంలో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగిందామె.
ప్రస్తుతం ఆరిజోనా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న రమ్య మంజునాథ్ అంచె, తాజాగా నాసా సారధ్యంలో, పొలారిమెట్రీ ఇన్ ది అల్ట్రావయొలెట్ టు ఫైండ్ ఫీచర్స్ ఇన్ ఇంటర్‌స్టెల్లార్ డస్ట్ (పఫిన్స్) మిషన్‌కు, ప్రధాన పరిశోధకురాలిగా ఎంపికైంది. రమ్య సారథ్యంలో రూపొందబోయే టెలిస్కోప్, తారల మధ్య తేలే ధూళి రేణువులను అధ్యయనం చేయనుంది. గత 50 ఏళ్లలో ఈ తరహా మిషన్స్‌లో ఇదే మొదటిది కావడం చెప్పుకోదగిన విషయం.
కొలంబియా దుర్ఘటనతో...
మైక్రోబయాలజిస్ట్‌గా పదవీ విరమణ పొందిన మంజునాథ్ కూతురైన రమ్య, నిరంతరం సైన్స్ చర్చలు జరిగే కుటుంబంలో పుట్టింది. దాంతో బాల్యం నుంచే అంతరిక్షం పట్ల ఆమెలో ఆసక్తి ఏర్పడింది. దేవనహళ్లిలోని ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్‌తో పాటు ఎమ్‌ఈస్ విద్యాసాగర్ ప్రొఫ్రెసర్ ఎమ్‌పిఎల్ శాస్త్రి పియు కాలేజ్‌లో చదువుకుని, శ్రీ ఎమ్ విశ్వేశ్వరాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిఇ ఎలక్ట్రికల్స్ పూర్తి చేసిందామె. సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఉద్ధృతంగా విస్తరిస్తున్న సమయంలో ఎక్కువమంది ఇంజనీర్లు, ఆకట్టుకునే ప్యాకేజీలతో మల్టినేషనల్ కంపెనీల్లో చేరిపోవాలని ఆసక్తి కనబరిస్తే, రమ్య మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచించింది. ‘‘నేనెప్పుడూ పరిశోధననే ఇష్టపడేదాన్ని.
పైగా అప్పట్లో నా కుటుంబం కూడా నా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కాబట్టే పరిశోధనా రంగం వైపు ప్రయాణించగలిగాను’’ అంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది రమ్య. 2003లో కొలంబియా దుర్ఘటన ఆమెను సైన్స్‌కు మరింత చేరువ చేసింది. ఆ దుర్ఘటన తననెంతో ప్రభావితం చేసిందనీ, ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? దాన్ని నివారించే అవకాశం ఏ మేరకు ఉంది? అనే ఆలోచనలు తనను వేధించడం మొదలుపెట్టాయంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చిందామె.
అంతరిక్ష ధూళి రేణువుల అధ్యయనం కోసం...
పరిశోధన పట్ల ఆసక్తితో ఆస్ట్రనామికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎమ్‌టెక్-పిహెచ్‌డి కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌లో చేరిన రమ్య, తర్వాత 2021లో ఆరిజోనా విశ్వవిద్యాలయంలోని స్టీవార్డ్ అబ్జర్వేటరీలో అసిస్టెంట్ రీసెర్చ్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగింది. తాజాగా నానా చేపట్టిన పఫిన్స్ మిషన్‌కు సారథ్యం వహించే అవకాశాన్ని గెలుచుకుంది. తాజాగా పఫిన్స్ అందించబోయే డాటాతో నక్షత్రాల మధ్య ధూళిని అర్థం చేసుకోడానికి దీర్ఘకాలంగా జరుగుతున్న ప్రయాసలన్నీ ఫలించనున్నాయి. రాబోయే నాలుగేళ్ల లోపు టెలిస్కోప్ రూపకల్పన పూర్తవుతుందనీ, 2030 నాటికి దాన్ని లాంచ్ చేయగలుగుతామనీ అంటోంది రమ్య. అంతరిక్షంలోకి లాంచ్ చేయబోయే ఈ టెలిస్కోప్ నిర్మాణంలో మరో 40 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యార్థులు, పరిశోధకులు పాలుపంచుకోబోతున్నారు. రమ్య, ఈ మిషన్‌కు ప్రధాన పరిశోధకురాలిగా వ్యవహరించడం చెప్పుకోదగిన విశేషం.
ఈ మిషన్ కీలకం
నక్షత్రాల మధ్య ఉండే అతి సూక్ష్మ ధూళి రేణువులు 50 నానోమీటర్ల కంటే చిన్నవి కాబట్టి సాధారణ ఆప్టికల్ లేదా ఇన్‌ఫ్రారెడ్ పద్ధతుల్లో వాటిని కనిపెట్టడం సాధ్యపడదు. అంతరిక్ష ప్రక్రియల్లో ఈ ధూళి రేణువులు కీలక పాత్ర పోషిస్తాయి. అంతరిక్షంలో కాంతి ప్రయాణించే తీరు, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడే పరిస్థితులను ప్రభావితం చేస్తూ ఉంటుంది. వేర్వేరు తరంగదైర్ఘ్యాల్లో అతినీలలోహిత కాంతిని కొలవడం ద్వారా, ధూళి కణాలు కాంతిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పఫిన్స్ మిషన్ తెలుసుకోగలుగుతుంది.
అంతరిక్ష ధూళి రేణువులు, అయస్కాంత క్షేత్రాలు, అంతరిక్షంలో కాంతి ప్రయాణ విధానాలు, వీటి మధ్య ఉన్న సంబంధాల అధ్యయనానికి ఈ మిషన్ తోడ్పడుతుంది. అలాగే సుదూర గ్రహ వ్యవస్థలను పరిశీలించే పద్ధతులను మెరుగుపరచడానికీ, వాటి లక్షణాలను విశ్లేషించడానికీ పఫిన్స్ పరిశోధనలు సహాయపడతాయి. 2030లో ఒక చిన్న ఉపగ్రహం ద్వారా ఈ సూక్ష్మ టెలిస్కోప్‌ను భూమి దిగువ కక్ష్యలోకి పంపించనున్నారు.