యాత్ర... ఒక మధుర జ్ఞాపకంగా
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:43 AM
వారణాసికి దీపావళికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. దీపావళి తరువాత... కార్తిక పౌర్ణమినాడు వారణాసిలో జరిగే ‘దేవ దీపావళి’కి లక్షలాదిమంది యాత్రికులు పోటెత్తుతారు.
వారణాసికి దీపావళికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. దీపావళి తరువాత... కార్తిక పౌర్ణమినాడు వారణాసిలో జరిగే ‘దేవ దీపావళి’కి లక్షలాదిమంది యాత్రికులు పోటెత్తుతారు. ‘దేవ దీపావళిని, వారణాసిని మేము చూపించినట్టు ఎవరూ చూపించలేరు’’ అంటారు రాధిక, నేహా. సోషల్‌మీడియాలో చాలామందికి ‘బెనారస్ గర్ల్స్’గా సుపరిచితులైన వీరిద్దరూ హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక యాత్రలను నిర్వహించటానికి ’ఎన్‌ఆర్ ట్రావెల్ బడ్డీ’ అనే కంపెనీని స్థాపించారు. దీపావళి సందర్భంగా వారు తమ అనుభవాలను ’నవ్య’తో పంచుకున్నారు.
‘‘చాలామందిలాగానే మాకు కూడా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తి ఎక్కువ.. బైక్‌ల మీద వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాళ్లం. బంధువులతో, మిత్రులతో బృందాలుగా వెళ్లినప్పుడు కూడా మేమే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్లం. దానినే ఒక బిజినెస్‌గా ఎందుకు మలచుకోకూడదనే ఆలోచన వచ్చింది. సాధారణంగా ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రదేశాలు చూడాలంటే ట్రావెల్ ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. వారే అన్ని ఏర్పాట్లు చేస్తారు.
కానీ ఆధ్యాత్మిక ప్రదేశాలలో యాత్రికుల అవసరాలు వేరుగా ఉంటాయి. వాటి గురించి మాకు బాగా తెలుసు కాబట్టి కేవలం ఆధ్యాత్మిక యాత్రలను ఎందుకు నిర్వహించకూడదని అనుకున్నాం. ఆ ఆలోచన వచ్చిన వెంటనే సన్నిహితులతో పంచుకున్నాం. అనేకమంది వారణాసి యాత్రకు రావటానికి ఆసక్తి చూపించారు. ఇలా మా ప్రస్థానం మొదలయింది. ఇప్పటికీ మేము నిర్వహించే యాత్రల్లో ఎక్కువ శాతం వారణాసికే ఉంటాయి. ముఖ్యంగా దీపావళి తర్వాత... కార్తిక పౌర్ణమి నాడు జరిగే ‘దేవ దీపావళి’ ఉత్సవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తూ ఉంటారు. అందుకే మా టూర్లలో ఇది విశేషమైనదని చెప్పొచ్చు.
అంత సులువేం కాదు...
ఇలాంటి యాత్రలను నిర్వహించటమంటే సులభమని ఎంతోమంది అనుకుంటారు. కానీ దీని వెనుక చాలా శ్రమ ఉంటుంది. ఉదాహరణకు చాలా ప్రదేశాలలో ఆలయాలు చిన్న సందుల్లో ఉంటాయి. కార్లు వెళ్లవు. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ముందే ప్రత్యామ్నాయ వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు... ఆలయాలు తెరిచి ఉండే సమయాలు వేర్వేరుగా ఉంటాయి. వాటిని ముందే తెలుసుకోవాలి. ఇక ఆహారం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
అంతేకాకుండా చాలామంది ఆధ్యాత్మిక యాత్ర కోసమే వచ్చినా షాపింగ్ చేయాలనుకుంటారు. ఉదాహరణకు వారణాసిలో బెనారస్ చీరలు చాలా ప్రసిద్ధి. అక్కడ దొరికే పాన్ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో.... మేము ముందే వెళ్లి ఆ ప్రదేశాలన్నీ తిరిగి వస్తాము. అక్కడ ప్రసిద్ధి చెందిన షాపుల గురించి తెలుసుకుంటాం. ఇలా మాకు వారణాసిలో ప్రతి సందు తెలుసు. అందుకే ’వారణాసిని మేము చూపించినట్లు ఇంకెవ్వరూ చూపించరు’ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.
జెన్ జీలోనూ ఆసక్తి
అయోధ్యలో రామాలయం ప్రారంభమయిన తర్వాత వారణాసికి వచ్చిన వారు అక్కడకు కూడా వెళ్లాలనుకుంటున్నారు. కాబట్టి వారణాసి, అయోధ్యలకు తీసుకువెళ్తున్నాం. ఒకప్పుడు ఆధ్యాత్మిక యాత్రలకు కేవలం వృద్ధులు మాత్రమే వెళ్తారనే భావన ఉండేది. కానీ ఇప్పుడు అన్ని వయస్సుల వారు ఈ యాత్రల పట్ల ఆసక్తి చూపుతున్నారు. జెన్ జీ కూడా ఆధ్యాత్మికత ఆసక్తి చూపుతోంది. దీంతో వారణాసితో పాటు అయోధ్య, గయ, కామాఖ్య, దుర్గాపూజ సమయంలో కోల్‌కతాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. మా దగ్గరకు వచ్చేవారిలో కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతాలకే వెళ్లాలని కోరుకుంటున్నారు.
ఇప్పటిదాకా మేము ఎక్కడా ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో చూసిన వారు, మా గురించి తెలిసిన వారు యాత్రలను బుక్ చేసుకుంటున్నారు. రోజు రోజుకు వీరి సంఖ్య బాగా పెరుగుతోంది.