మన హైదరాబాద్ ఒకప్పటి ‘ఇస్ఫహాన్’
ABN , Publish Date - May 03 , 2026 | 03:37 AM
ఇటీవల ఇరాన్‌లోని ‘ఇస్ఫహాన్’ నగరం గురించి.. అక్కడ ఉన్న అణుశుద్ధి కేంద్రాల గురించి ప్రపంచమంతా మాట్లాడుతోంది. ఇరాన్‌లోని అత్యంత సుందర నగరాల్లో ...
ఇటీవల ఇరాన్‌లోని ‘ఇస్ఫహాన్’ నగరం గురించి.. అక్కడ ఉన్న అణుశుద్ధి కేంద్రాల గురించి ప్రపంచమంతా మాట్లాడుతోంది. ఇరాన్‌లోని అత్యంత సుందర నగరాల్లో ఒకటైన ఈ నగరం నమూనాలోనే మన హైదరాబాద్‌ను నిర్మించారని.. ఒకప్పుడు హైదరాబాద్‌ను ‘నయా ఇస్ఫహాన్’ అని పిలిచేవారని కొద్ది మందికి మాత్రమే తెలుసు. హైదరాబాద్‌కు మూసీ నది ఒడ్డున ఇస్ఫహాన్ నగర నమూనాలో నిర్మించాలనే ఆలోచన వెనకున్న రూపకర్త మీర్ మోమిన్ అస్త్రాబాది. ఆయన నిర్మించిన నగరంలోనే ఆయన తన కోసం ఒక అద్భుతమైన సమాధిని కూడా నిర్మించుకున్నాడు.
ఒకప్పుడు గోల్కొండ కోట వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులతో.. విదేశీ యాత్రికులతో కిటకిటలాడుతూ ఉండేది. ఒక దశలో గోల్కొండ కోటను దాటి మరో కొత్త నగరాన్ని కడితే బావుండుననే ఆలోచన గోల్కొండ ప్రభువైన కులీకుతుబ్‌షాకు కలిగింది. ఆయన ఆ బాధ్యతను తన వద్ద మహామంత్రిగా పనిచేస్తున్న మీర్ మోమిన్‌కు అప్పచెప్పాడు. మీర్ మోమిన్ అస్త్రాబాది పర్షియా (ఇరాన్)కు చెందిన వాడు. గొప్ప పండితుడు. పర్షియాలో షా తహ్మాస్ప్ అనే రాజు దర్బార్‌లో ఆయన కుమారుడు హైదర్‌కు శిక్షకుడిగా ఉండేవారు. ఆ తర్వాతి కాలంలో జరిగిన అధికార పోరులో ఆ యువరాజు హత్యకు గురికావడం, ఆ దిగులుతో రాజు కూడా కన్నుమూయడంతో మీర్ మోమిన్ ప్రాణభయంతో మక్కాకు వెళ్లిపోయాడు. అక్కడ కొంతకాలం ఉండి 1579లో గోల్కొండకు చేరుకున్నారు. ఇక్కడ మసీదుల్లో ఆయన చెప్పే మత ప్రవచనాలు, ఖగోళ, వాస్తు శాస్త్రాలపై ఆయనకున్న పట్టు మహమ్మద్ కులీ కుతుబ్‌షా దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఆయనను తన ప్రభుత్వంలో పేష్వా (ప్రధానమంత్రి)గా నియమించుకున్నారు.
కొత్త నగరం..
మీర్ మోమిన్ సలహా మేరకు ముచుకుందా (నేటి మూసీ) నది పక్కన ఒక కొత్త నగర నిర్మాణం ప్రారంభమయింది. ఈ సమయంలోనే ప్లేగు వచ్చి అనేక వేల మంది మరణించారు. ఈ ప్లేగు వ్యాధి తగ్గినందుకు గుర్తుగా చార్మినార్ నిర్మాణంతో పాటుగా.. దానిని నాలుగు రోడ్ల కూడలిగా(చుడీ బజార్, మరోవైపు మొఘల్‌పురా, పత్తర్‌ఘట్టి, పురానాపూల్) మార్చారు. కొత్త కొత్త నిర్మాణాలతో, తోటలతో, తటాకాలతో హైదరాబాద్ కళకళలాడుతూ ఉండేది. ఈ నగర నిర్మాణం ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ను పోలి ఉండటంతో హైదరాబాద్‌ను ‘నయా ఇస్ఫహాన్’ అని పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది షియా పండితులు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడటానికి ఇష్టపడేవారు. హైదరాబాద్‌లో ఆ సమయంలో షియాలు ఇరాన్ నుంచి వచ్చి స్థిరపడటం మొదలుపెట్టారు. వారిలో చాలా మందికి తమ స్వస్థలం నుంచి దూరంగా వచ్చి స్థిరపడ్డామనే బెంగ ఉండేది. తాము చనిపోయే ముందు స్వస్థలానికి వెళ్లాలనే కోరిక కూడా ఉండేది. దీనిని గమనించిన మీర్ మోమిన్-ఇరాక్‌లోని పవిత్ర యుద్ధం జరిగిన కరబల నుంచి ఒంటెలు, గుర్రాల మీద ఇసుకను తెప్పించి పోయించి ఒక శ్మశాన వాటికను నిర్మించారు. అదే - ‘దాయిరా మీర్ మోమిన్’ అనే శ్మశాన వాటికగా స్థిరపడింది. కుతుబ్‌షాహీల రాజవంశస్థుల అనేక మంది సమాధులతో పాటు సాలార్‌జంగ్ 1, 2, 3 సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒక విధంగా-హైదరాబాద్ చరిత్రకు ఈ శ్మశాన వాటిక ఒక పునాదిలాంటిది. ఈ రోజుకు ఇక్కడ మీర్ మోమిన్ సమాధి వద్ద ప్రతి ఏడాది ఉర్సు జరుగుతుంది. సంతానం లేని వారు, అనారోగ్యంతో ఉన్న వారు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తే కోరికలు తీరుతాయని చాలా మంది నమ్ముతారు.
చివరిగా..
ఇప్పటి హైదరాబాద్-ఒకప్పుడు మూసీ నది ఒడ్డున ఉన్న ‘చించిలం’ అనే చిన్న గ్రామం. తన వాస్తు, నిర్మాణ నైపుణ్యంతో ఒక అందమైన నగరానికి పునాదులు వేసిన ఘనత ఘనత మీర్ మోమిన్‌దే! ఈ రోజుకు హైదరాబాద్‌లో ఇరాన్ (ఒకప్పటి పర్షియా) సంస్కృతి పరిఢవిల్లుతోందంటే దానికి మీర్ మోమిన్ కూడా ఒక ప్రధాన కారణం. హైదరాబాద్‌లోని అనేక చారిత్రాత్మక కట్టడాల వెనక మీర్ మోమిన్ ముద్ర కనిపిస్తుంది. అలాంటి మీర్ మోమిన్ సమాధి ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. దానిని పరిరక్షించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.
మీర్ మోమిన్ కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు,
ఒక గొప్ప హకీమ్ (వైద్యుడు) కూడా. నగరంపై ప్లేగు విరుచుకు పడినప్పుడు ప్రజలకు చికిత్స అందించడానికి ‘దారుల్ షిఫా’ అనే ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అక్కడ ఉచిత వైద్యం, ఆహారం, వసతి అందించేవారు. చార్మినార్, మక్కా మసీదు, బాద్ షా అషూర్ ఖానా, ఖైరతాబాద్ మసీదు వంటి అద్భుత కట్టడాలన్నింటి వెనక ఆయన ముద్ర ఉంది.