గుడ్ల పెంకులతో పోషకాలు ఇలా
ABN , Publish Date - Oct 12 , 2026 | 02:51 AM
కోడిగుడ్ల పెంకులను మొక్కలకు ఎరువుగా వేస్తుంటాం. వాటిని అలా నేరుగా మట్టిలో వేస్తే మొక్కలకు కావాల్సిన పోషకాలు అందడానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా మొక్కలు ఆరోగ్యంగా వేగంగా పెరగడానికి గుడ్ల పెంకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

గుడ్ల పెంకులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఎండిన తరువాత మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. రెండు రోజులకోసారి మొక్కల చుట్టూ కొద్దిగా తవ్వి ఈ పొడిని వేసి మట్టితో కలపాలి. దీంతో మట్టి ద్వారా కాల్షియం, ఇతర పోషకాలు సులువుగా మొక్కలకు చేరతాయి. ఫలితంగా ఆకులు త్వరగా రాలవు. కొత్త రెమ్మలు బలంగా పెరుగుతాయి.
ఓ గిన్నెలో చెంచాడు పెంకుల పొడి, చెంచా వెనిగర్ వేసి బాగా కలిపి పది నిముషాలు నాననివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని లీటరు నీటిలో పోసి కలపాలి. ఇలా తయారుచేసిన ఆర్గానిక్ క్యాల్షియం ఎరువును కొద్దికొద్దిగా మొక్కలకు అందించాలి. పది రోజులకోసారి ఇలా చేస్తుంటే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పువ్వులు బాగా పూస్తాయి. పండ్లు కూడా ఎక్కువగా కాస్తాయి.
బాగా ఎండిన గుడ్ల పెంకులను చేత్తో గట్టిగా నలిపి చూర్ణంలా చేయాలి. దీన్ని మొక్కల చుట్టూ మట్టిపై చల్లితే కాండం, కొమ్మలు, ఆకులపైకి క్రిమి కీటకాలు చేరవు.
గుడ్ల పెంకులను మెత్తగా గ్రైండ్ చేసిన తరువాత జల్లెడ పట్టి ఆ పిండిని కుక్కలు, పిల్లుల ఆహారంలో కలిపితే వాటి దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.