నట్స్ నిల్వ...
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:13 AM
కాజు, బాదం, పిస్తా, వాల్‌నట్స్ లాంటి నట్స్ రుచి మారకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలో చూద్దాం...
కాజు, బాదం, పిస్తా, వాల్‌నట్స్ లాంటి నట్స్ రుచి మారకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలో చూద్దాం...
నట్స్‌లో సహజంగానే నూనెలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటికి గాలి, వేడి, వెలుతురు సోకితే ఆక్సిడేషన్ వల్ల వాటి రుచి మారుతుంది. కాబట్టి బజారు నుంచి తెచ్చిన వెంటనే నట్స్‌ను గాలి చొరబడని డబ్బాల్లో లేదా సీసాల్లో భద్రపరచుకోవాలి.
నట్స్‌కు తేమ తగిలితే అవి త్వరగా చెడిపోతాయి. కాబట్టి వాటిని చేత్తో తాకకూడదు.
నట్స్ ప్యాకెట్లను తెరచిన తరువాత వాటిని అలాగే ఉంచకూడదు. సీలింగ్ క్లిప్స్‌తో వాటిని మూసి గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నట్స్ డబ్బాలను గాలి, వెలుతురు ఎక్కువగా ప్రసరించే ప్రదేశాల్లో పెట్టకూడదు. పొడిగా, చీకటిగా ఉండే మూలల్లో వాటిని భద్రపరచాలి.
ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు నట్స్‌ని ఫ్రిజ్‌లో పెడితే ఆర్నెల్లు తాజాగా ఉంటాయి. అదే ఫ్రీజర్ సేఫ్ కంటెయినర్లో పోసి ఫ్రీజర్లో పెడితే ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ నుంచి వీటిని బయటికి తీసిన తరువాత అవి గది ఉష్ణోగ్రతకు వచ్చాకే వాటి మూత తెరవాలి.
షెల్స్‌తో ఉన్న నట్స్ చాలాకాలం నిల్వ ఉంటాయి. చిన్న ముక్కలుగా చేసిన నట్స్, పగిలినవి త్వరగా పాడవుతాయి.
కాజు, పిస్తా, పల్లీలు, హేజల్ నట్స్ బయట ఆర్నెల్లు ఫ్రిజ్‌లో ఏడాది ఫ్రీజర్లో రెండేళ్లు తాజాగా ఉంటాయి. వాల్‌నట్స్ బయట మూడు నెలలు మాత్రమే బాగుంటాయి. అదే బాదం అయితే బయట ఏడాది ఫ్రిజ్‌లో రెండేళ్లు భద్రంగా ఉంటాయి.
నట్స్ ప్యాకెట్స్‌ను కొనేటప్పుడు వాటిమీద ప్యాకింగ్, గడువు తేదీలను పరిశీలించాలి.