Share News

ఇలా దాచుకుందాం...

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:29 AM

పూలను వాటి ఆకారం చెదరకుండా టిష్యూ లేదా పార్చ్‌మెంట్‌ పేపర్ల మధ్య ఉంచి ఆపైన పుస్తకం పేజీల మధ్య జాగ్రత్తగా పెట్టాలి. ఈ పుస్తకాన్ని మూసి దానిపై మరికొన్ని బరువైన పుస్తకాలను ఉంచాలి.

ఇలా దాచుకుందాం...

ఎంతో ఇష్టంగా పెంచుకున్న గులాబీ మొక్కకు మొదటిసారి పూసిన పువ్వు, ప్రత్యేక సందర్భాల్లో మనకిష్టమైనవారు ఇచ్చిన బొకేలోని రంగు రంగుల పూలు.. రెండు రోజులకే వాడిపోతుంటే బాధపడుతుంటాం. అలాంటప్పుడు తాజాదనం లేకపోయినా చిన్న చిట్కాలతో ఆ పూలను వాటి జ్ఞాపకాలను ఏళ్ల తరబడి ఎలా భద్రపరచుకోవచ్చో చూద్దాం...

ప్రెస్సింగ్‌

పూలను వాటి ఆకారం చెదరకుండా టిష్యూ లేదా పార్చ్‌మెంట్‌ పేపర్ల మధ్య ఉంచి ఆపైన పుస్తకం పేజీల మధ్య జాగ్రత్తగా పెట్టాలి. ఈ పుస్తకాన్ని మూసి దానిపై మరికొన్ని బరువైన పుస్తకాలను ఉంచాలి. నెల రోజుల తరువాత ఆ పూలు అణగి పలుచగా మారి పూర్తిగా ఎండిపోతాయి.తరువాత వీటిని తీసి ఓ బాక్సులో దాచుకోవచ్చు. లేదంటే ఫొటో ఫ్రేములు, గ్రీటింగ్‌ కార్డులు, బుక్‌మార్క్‌ల తయారీలో వాడవచ్చు. చామంతి, బంతి, మందారం, మల్లె, బోగన్‌విల్లా, లావెండర్‌, వైలెట్స్‌, గడ్డిపూలకు ఈ పద్ధతి అనువుగా ఉంటుంది.

ఎయిర్‌ డ్రైయింగ్‌

తాజా పూల కాడలను దగ్గరగా చేర్చి కట్టల మాదిరి దారంతో గట్టిగా కట్టాలి. ఈ పూల కట్టలను పొడిగా చీకటిగా ఉండే చోట తలకిందులుగా వేలాడదీయాలి. వీటికి గాలి బాగా ప్రసరించేలా చూసుకోవాలి. మూడు వారాల్లో పూలు పూర్తిగా ఆరిపోతాయి. వాటి ఆకారం, రంగుల్లో ఏ మార్పూ ఉండదు. గులాబీ మొగ్గలు, పెద్ద సైజు బంతి పూలు, జిన్నియా, బేబీస్‌ బ్రీత్‌, స్ట్రా ఫ్లవర్‌, సన్‌ ఫ్లవర్‌ లాంటివాటికి ఈ పద్ధతిని అనుసరించవచ్చు. వీటిని అట్టపెట్టెల్లో మాత్రమే దాచుకోవాలి. ఈ పూల రెక్కల మధ్య నాలుగైదు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి ఫ్లవర్‌ వేజ్‌లలో సర్ది హోమ్‌ డెకార్‌లా వాడుకోవచ్చు.


సిలికా జెల్‌తో...

ముందుగా ఒక డబ్బాలో సిలికా జెల్‌ వేసి దానిమీద పూలను జాగ్రత్తగా ఉంచి వాటి మీద కూడా జెల్‌తో పొరలా కప్పాలి. డబ్బాకి గట్టిగా మూతపెట్టి వారంపాటు అలాగే ఉంచాలి. తరువాత పూలను బయటికి తీసి జెల్‌ను తొలగించాలి. రంగు, ఆకారం మారకుండా పూలు చక్కగా ఎండిపోతాయి. ఈ పూలను రెసిన్‌ మౌల్డ్స్‌లో ఉంచి అందమైన కీచైన్లు, పెండెంట్లు, కోస్టర్లు, పేపర్‌ వెయిట్లు తయారుచేసుకోవచ్చు.

Updated Date - Nov 29 , 2026 | 04:32 AM