పుదీనా మొక్కని ఇలా...
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:50 AM
వంటకాల్లో విరివిగా ఉపయోగించే పుదీనా కోసం ప్రతిసారీ మార్కెట్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఓ కుండీలో సులువుగా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం...
పుదీనా కట్టను తెచ్చుకున్నప్పుడు అందులో తాజాగా పచ్చగా ఉన్న ఓ కొమ్మను తీసుకుని వాడిన, ఎండిన ఆకులను తుంచేయాలి. కనీసం ఆరంగుళాల పొడవున్న కాడ అయితే మంచిది.
ఓ గ్లాసు నిండా నీటిని తీసుకుని అందులో ఈ కాడను ఉంచాలి. గ్లాసుకు నేరుగా ఎండ తగలకుండా గాలి, వెలుతురు సోకేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లాసులో నీటిని రెండురోజులకోసారి మారుస్తూ ఉండాలి. పది రోజుల తరువాత కాడ కింద తెల్లటి వేర్లు రావడం గమనించవచ్చు.
వెడల్పాటి కుండీలో మట్టి, కంపోస్టు, కోకోపీట్ వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని నీటితో తడిపి వేర్లతో నిండిన పుదీనా కాడను జాగ్రత్తగా నాటాలి. కుండీలో మట్టి పూర్తిగా తడారిపోకుండా కొద్ది కొద్దిగా నీటిని చిలకరిస్తూ ఉండాలి.
ఉదయం పూట కొద్దిసేపు సూర్యరశ్మి తగిలేలా ఆ తరువాత నీడ ఉండేలా కుండీని ఏర్పాటు చేసుకోవాలి. బాల్కనీ, వంటింటి కిటికీల వద్ద పెట్టుకోవచ్చు.
వారం రోజుల్లో మొక్క స్థిరపడి కాండం నుంచి కొత్త కొమ్మలు, ఆకులు వస్తాయి. మొక్క పై భాగంలో ఉన్న వాటిని తుంచుతుంటే పక్కల నుంచి కొత్తవి వస్తుంటాయి. ఆకులన్నింటినీ ఒకేసారి కోయకూడదు. ఓ వైపు భాగాన్ని అలాగే ఉంచితే మొక్క బలంగా పెరుగుతుంది.