సీతాఫలాలు కొనేముందు...
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:40 AM
మార్కెట్లో సీతాఫలాలను కొనేముందు తియ్యగా నాణ్యంగా ఉన్నవాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...
ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ గట్టిగా ఉంటే అవి కాయలని గుర్తించాలి. అలాంటివి తినడానికి పనికిరావు. చేత్తో పట్టుకుని చూసినప్పుడు కాస్త మెత్తగా అనిపిస్తే కొనవచ్చు. వాటిని ఇంట్లో బియ్యం డబ్బాలో పెడితే రెండు లేదా మూడు రోజుల్లో పండి తినడానికి వీలుగా మారతాయి. మరీ గట్టిగా అనిపిస్తే మాత్రం వాటిని కొనకపోవడమే మంచిది. అలాంటివి ఒక్కోసారి పక్వానికి రాకుండానే పాడైపోతాయి.
లేత ఆకుపచ్చ రంగులో మెరుస్తూ పసుపు-తెలుపు చారలతో నిండి ఉన్నట్లయితే అవి చక్కగా పండినవని గుర్తించాలి. ఇవి మంచి సువాసన వెదజల్లుతూ తియ్యటి రుచితో ఉంటాయి.
పండ్లపై ఉండే గళ్లు విచ్చుకుని వాటి మధ్య తెల్లటి చారలు స్పష్టంగా కనిపిస్తుంటే అవి చెట్టుపైనే పండినవని అర్థం.
లోపల నుంచి పక్వానికి వచ్చి గుజ్జుతో నిండిన సీతాఫలాన్ని చేతిలోకి తీసుకోగానే తేలికగా అనిపిస్తుంది. అదే కాయ అయితే బరువుగా ఉన్నట్లు తెలుస్తుంది.
పైన నల్లటి మచ్చలు కనిపిస్తూ పట్టుకోగానే మెత్తగా అనిపిస్తే లోపల పాడైపోయి ఉండవచ్చని గ్రహించాలి. అలాంటి వాటిని పలుమార్లు పరిశీలించి ఎంపిక చేసుకోవాలి.
బాగా మగ్గి తియ్యటి సువాసన రాని పండ్లు చెడిపోయినవిగా గుర్తించాలి.
గళ్లు పెద్దగా వెడల్పుగా ఉన్న పండ్లలో గుజ్జు ఎక్కువగా గింజలు తక్కువగా ఉంటాయి. ఇవి తినడానికి బాగుంటాయి.