సౌత్ రుచులు చూపిస్తున్నారు!
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:10 AM
వడ్డించే పదార్థాల్లో నాణ్యత, కస్టమర్లకు మర్యాద, ఎందులోనూ రాజీ పడని ధోరణి... ఇవే నా విజయానికి కారణం’ అంటారు బీనా గాంధీ. సాధారణ గృహిణి నుంచి చిన్న....
‘వడ్డించే పదార్థాల్లో నాణ్యత, కస్టమర్లకు మర్యాద, ఎందులోనూ రాజీ పడని ధోరణి... ఇవే నా విజయానికి కారణం’ అంటారు బీనా గాంధీ. సాధారణ గృహిణి నుంచి చిన్న వ్యాపారిగా మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పుడు ఆరు రెస్టారెంట్లకు యజమానిగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ముంబయి, అహ్మదాబాద్ ప్రజలకు అచ్చమైన దక్షిణాది ఆహారాన్ని రుచి చూపిస్తున్న బీనా... ‘‘కస్టమర్ల ముఖంలో చిరునవ్వే నాకు గొప్ప ప్రశంస’’ అని చెబుతున్నారు.
‘‘వివాహమై, ముంబయిలోని అత్తవారింట్లో అడుగు పెట్టిన తరువాత... నేను బాగా మిస్ అయినది మా నాన్ననీ, అమ్మనీ, అమ్మ చేతి ఇడ్లీని. మా అత్తవారింట్లో పూర్తిగా మహారాష్ట్ర, ఉత్తరాది వంట పద్ధతులే ఉండేవి. నా ఇబ్బందిని గమనించి నా భర్త అప్పట్లో ముంబయిలోని కొన్ని సౌత్ ఇండియన్ రెస్టారెంట్లకు తీసుకువెళ్ళేవారు. కానీ ఏవీ నాకు రుచిగా అనిపించలేదు. ముఖ్యంగా ఇడ్లీలు గట్టిగా ఉండేవి. దోశలు, చట్నీల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఇడ్లీల్లో వాడే బియ్యమే దీనికి కారణం. నేను పుట్టింది తమిళనాడులోని కోయంబత్తూరులో. ఇరవై నాలుగేళ్ళు అక్కడే పెరిగాను. అక్కడి వంటకాలు నా జీవితంలో విడదీయలేని భాగం. 1993లో మంబాయికి వచ్చినప్పుడు... వాటన్నిటినీ కోల్పోయినట్టనిపించిది. ఈ సంగతి నాన్నతో చెబితే... కోయంబత్తూరు నుంచి బియ్యం పంపించారు. గ్రైండర్లో పిండి రుబ్బి ఇడ్లీలు చేసుకొని తింటే... ప్రాణం లేచొచ్చింది. దక్షిణాది ఆహారం పట్ల నాకున్న ఆ ఇష్టం... నన్ను వ్యాపారవేత్తని చేస్తుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.
సౌతిండియన్ ఫెస్టివల్
మా అత్తవారింట్లో దక్షిణాది కోడలిని నేనొక్కదాన్నే. వాళ్ళకి ఇడ్లీ, దోశలతో పాటు సాంబర్ అన్నం, రసం అన్నం, పొరియల్, అవియల్ లాంటివి పరిచయం చేశాను. దాంతో... మా మామగారు తన మిత్రుల్ని మా ఇంటికి ప్రత్యేకంగా భోజనానికి పిలిచేవారు. దాన్ని ‘సౌతిండియన్ ఫెస్టివల్’ అని ఆయన పిలిచేవారు. వచ్చినవారందరూ నా వంటల్ని మెచ్చుకొనేవారు... ప్రత్యేకించి ఇడ్లీల్ని, దోశల్ని. ‘‘ముంబయిలో ఎక్కడా ఇలాంటివి మేం తినలేదు. వీటిలో ఏం కలుపుతున్నారు? ఎలా తయారు చేస్తున్నారు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించేవారు. కొందరైతే... ఇడ్లీ పిండి, దోశ పిండి నాతో తయారు చేయించి తీసుకువెళ్ళేవారు. అయితే ఉచితంగా తీసుకోవడం వాళ్ళకు ఇబ్బందిగా ఉండేది. మా మామగారి సలహా మేరకు... రుబ్బిన పిండిని అమ్మడం మొదలు పెట్టాను. ఆ తరువాత సాంబార్, రసం, చట్నీ, లెమెన్ రైస్ కూడా అమ్మేదాన్ని. కానీ మూడేళ్ళకే ముంబయిని మేం వదిలెయ్యాల్సి వచ్చింది. మా ఆయన కొత్త వ్యాపారాన్ని ఆరంభించడంతో మేము అహ్మదాబాద్‌కు మారాం. అక్కడ కొన్నాళ్ళు మా పిల్లల పెంపకంతో సరిపోయింది. ఆ తరువాత... ఈవెంట్లకు క్యాటరింగ్ చేశాను. ప్రత్యేకంగా రకరకాల దోశలు, ఉతప్పాలు, ఇడ్లీల్లాంటివి. కానీ అది రెగ్యులర్ బిజినెస్ కాదు. కాబట్టి రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనుకున్నాను. అలా 2000లో... ఇరవై సీట్లతో... అహ్మదాబాద్‌లో తొలి ‘దక్షిణాయణ్’ హొటల్ మొదలుపెట్టాను
ఆ ప్రశంసలతో బ్రాండ్ వాల్యూ
కానీ కొత్తల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దక్షిణాది వంటకాలను చేయగలిగే సిబ్బంది దొరకడం ఒక సమస్య. అలాగే మసాలాల దగ్గర్నించి ప్రతిదీ ఇంట్లోనే రోజూ తయారు చేసేదాన్ని. బయట నుంచి వచ్చే ఆర్డర్లను మా ఆయన డెలివరీ చేసేవారు. క్రమంగా అవరోధాలన్నీ అధిగమించాం. మూడేళ్ళ తరువాత... ముంబాయిలో మా మొదటి రెస్టారెంట్ తెరిచాను. నటి జీనత్ అమన్ లాంటి ప్రముఖులు దాన్ని సందర్శించి ప్రశంసించడంతో... మాకొక బ్రాండ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ముంబయిలో మూడు, అహ్మదాబాద్‌లో మూడు రెస్టారెంట్లను నడుపుతున్నాను. పొడులు, రెడీ-టు-ఈట్ ఐటమ్స్ కూడా విక్రయిస్తున్నాం. నేను ఎక్కడున్నా... మొత్తం అన్నిటినీ ప్రతిరోజూ పర్యవేక్షిస్తాను’’
ఆ రుచుల్ని చెడగొట్టను...
‘‘మా రెస్టారెంట్లలో సంప్రదాయికమైన రెసిపీలకే పెద్దపీట. కొత్త ప్రయోగాల పేరుతో ఆ రుచుల్ని చెడగొట్టాలని అనుకోను. మనం తయారు చేసేది నాణ్యతగా ఉండాలి. వినియోగదారులతో మర్యాదగా మసలుకోవాలి. ఏ విషయంలోనూ రాజీ పడకూడదు... ఈ నియమాలే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచి, మేం విజయం సాధించేలా చేశాయి. ఎందరో సెలబ్రిటీలు మా రెస్టారెంట్లకు వస్తూంటారు. కానీ ప్రతిరోజూ వచ్చే సామాన్యులే మాకు సెలబ్రిటీలు. కుటుంబాలతో సహా వచ్చి ఇడ్లీయో, దోశో తిన్నాక... నవ్వుతూ బయటికి వెళ్ళడం చూస్తూ ఉంటే... ‘ఇంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేం కావాలి?’ అనిపిస్తుంది.’’