Share News

కారప్పొడులతో కమ్మగా..!

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:59 AM

మనం వేడన్నంలో రకరకాల కారప్పొడులను కలుపుకొని ఇష్టంగా తింటుంటాం. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మునగాకు, పల్లీలు, పుట్నాలు, కొబ్బరితో చేసే కారప్పొడులు అందరికీ తెలిసినవే. ఇవికాక ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే వెరైటీ కారప్పొడులు మీ కోసం...

 కారప్పొడులతో కమ్మగా..!

  • గోంగూర కారప్పొడి

కావాల్సిన పదార్థాలు

ఎర్ర గోంగూర- ఓ పెద్ద కట్ట, పల్లీలు- రెండు చెంచాలు, ధనియాలు- చెంచా, నువ్వులు- ఒకటిన్నర చెంచాలు, జీలకర్ర- చెంచా, ఆవాలు- అర చెంచా, మెంతులు- పావు చెంచా, కరివేపాకు- ఒక రెమ్మ, కారం- మూడు చెంచాలు, ఉప్పు- రెండున్నర చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది

తయారీ విధానం

గోంగూరను శుభ్రంగా కడిగి పలుచని గుడ్డ మీద పరచి నీడలో ఆరబెట్టాలి. తరువాత కొద్దిసేపు ఎండలో ఉంచి ఆకులు గలగలలాడేలా ఎండబెట్టాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి పల్లీలు వేసి దోరగా వేయించాలి. అవి సగానికి పైగా వేగిన తరువాత ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుతూ ఎర్రగా వేయించి స్టవ్‌ మీద నుంచి దించాలి. అందులో ఎండిన గోంగూర, ఉప్పు, కారం వేసి కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరువాత గాజు సీసాలోకి తీసి నిల్వ చేసుకోవాలి. ఈ గోంగూర కారప్పొడిని చికెన్‌ ఫ్రై, మటన్‌ ఫ్రైతోపాటు అన్ని రకాల కూరల్లో కూడా వేసుకోవచ్చు. వేడన్నంలో కలిపి నెయ్యి వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.


  • మల్టీ విటమిన్‌ కారప్పొడి

కావాల్సిన పదార్థాలు

గుమ్మడి గింజలు- అర కప్పు, పుచ్చ గింజలు- అర కప్పు, నువ్వులు- అర కప్పు, అవిసె గింజలు- అర కప్పు, నూనె- రెండు చెంచాలు, ధనియాలు- పావు కప్పు, జీలకర్ర- రెండు చెంచాలు, ఎండు మిర్చి- ముప్పావు కప్పు, కరివేపాకు- కప్పు, ఉప్పు- చెంచా, పసుపు- పావు చెంచా, వెల్లుల్లి రెబ్బలు- పావు కప్పు, ఆమ్‌చూర్‌ పొడి లేదా ఉసిరి పొడి- రెండు చెంచాలు

తయారీ విధానం

కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అవిసె గింజలు, నువ్వులను విడివిడిగా వేయించి ఓ పళ్లెంలోకి తీయాలి. తరువాత గిన్నెలో చెంచా నూనె వేసి ధనియాలు, జీలకర్రలను వేయించి మరో పళ్లెంలోకి తీయాలి. గిన్నెలో మరో చెంచా నూనె వేసి ఎండు మిర్చి, కరివేపాకులను విడివిడిగా వేయించి ధనియాల పళ్లెంలోకి తీయాలి. వీటన్నింటినీ బాగా చల్లార్చాలి. ముందుగా మిక్సీ గిన్నెలో ధనియాలు-ఎండుమిర్చి మిశ్రమం, ఉప్పు, ఆమ్‌చూర్‌ లేదా ఉసిరి పొడి, పసుపు వేసి గ్రైండ్‌ చేయాలి. తరువాత గుమ్మడి-అవిసె గింజల మిశ్రమం వేసి బాగా కలిపి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆపైన వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్‌ మోడ్‌లో గ్రైండ్‌ చేయాలి. ఈ కారప్పొడిని వెడల్పాటి పళ్లెంలోకి తీసి అయిదు నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత సీసాలోకి తీసి పెట్టుకోవాలి. ఇందులో ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు తదితర పోషకాలెన్నో ఉంటాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి, శిరోజాల పెరుగుదలకు, చర్మం బిగుతుగా ఛాయగా మారేందుకు, ఎముకల బలోపేతానికి ఈ కారప్పొడి తోడ్పడుతుంది.


  • చికెన్‌ కారప్పొడి

కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు- పావు కేజీ, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, పెద్ద ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- పన్నెండు, ఎండు మిర్చి- పది, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు- చెంచా, పసుపు- పావు చెంచా, కశ్మీరీ కారం- చెంచా, ధనియాల పొడి- చెంచా

తయారీ విధానం

గిన్నెలో చికెన్‌ ముక్కలు, పావు చెంచా ఉప్పు, చిటికెడు పసుపు, పావు చెంచా కారం వేసి కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె పోసి వేడిచేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ చీలికలు వేసి ముదురు గోధుమ రంగు వచ్చేదాకా వేయించి పళ్లెంలోకి తీయాలి. తరువాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకులను కూడా విడివిడిగా వేయించి అదే పళ్లెంలోకి తీయాలి. తరువాత మ్యారినేట్‌ చేసిన చికెన్‌ ముక్కలను నూనెలో వేసి కరకరలాడేలా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ గిన్నెలో ముందుగా చికెన్‌ ముక్కలు వేసి మూడుసార్లు పల్స్‌ మోడ్‌లో గ్రైండ్‌ చేయాలి. తరువాత.. వేయించి పెట్టుకున్న ఎండు మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ చీలికలు, వెల్లులి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆపైన పసుపు, కశ్మీరీ కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. దీన్ని పళ్లెంలోకి తీసి కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇలా తయారుచేసిన చికెన్‌ కారప్పొడిని సీసాలోకి తీసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నాలుగు రోజులు నిల్వ ఉంటుంది.


జీడిపప్పు కారప్పొడి

కావాల్సిన పదార్థాలు

జీడిపప్పు- వంద గ్రాములు, మినపగుండ్లు- చెంచా, పచ్చి శనగపప్పు- ఒకటిన్నర చెంచాలు, కరివేపాకు- రెండు రెమ్మలు, ధనియాలు- చెంచా, జీలకర్ర- చెంచా, కారం- మూడు చెంచాలు, ఉప్పు- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది, నెయ్యి- అర చెంచా

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో చుక్క నెయ్యి, జీడిపప్పు వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీయాలి. తరువాత స్టవ్‌మీద ఉన్న గిన్నెలో మిగిలిన నెయ్యి వేసి మినపగుండ్లు, పచ్చి శనగపప్పు వేసి కలుపుతూ వేయించాలి. అవి సగానికి పైగా వేగిన తరువాత కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసి కలిపి ఎర్రగా వేయించి చల్లార్చి మిక్సీ గిన్నెలోకి తీయాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరువాత ఉప్పు, కారం సరి చూసుకుని సీసాలో పోసుకుంటే చాలా రోజులు తాజాగా నిల్వ ఉంటుంది. ఈ జీడిపప్పు కారప్పొడిని దోశలపై, వేపుళ్లలో కూడా వేసుకోవచ్చు.

Updated Date - Oct 03 , 2026 | 12:59 AM