Share News

పసికందులకు గృహ చిట్కాలు వద్దు

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:07 PM

పసికందు ఆరోగ్యం కోసం, ఉపశమనం కోసం తల్లులు తెలిసిన, విన్న చిట్కాలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు సమస్యను పరిష్కరించకపోగా, మరింత క్లిష్టం చేసే అవకాశాలు లేకపోలేదు

పసికందులకు గృహ చిట్కాలు వద్దు

పసికందు ఆరోగ్యం కోసం, ఉపశమనం కోసం తల్లులు తెలిసిన, విన్న చిట్కాలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు సమస్యను పరిష్కరించకపోగా, మరింత క్లిష్టం చేసే అవకాశాలు లేకపోలేదు

జలుబు తగ్గించడం కోసం 8 నెలల పసికందుకు విక్స్‌, కర్పూరం మిశ్రమాన్ని వాడడంతో బిడ్డ పరిస్థితి విషమించి, ప్రాణాలు పోయిన సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పసికందులకు అనుసరించకూడని గృహ చిట్కాల పట్ల తల్లులకు అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. విక్స్‌ లాంటి ఉత్పత్తులు స్వల్ప ఉపశమనాన్ని అందించగలుగుతాయి తప్ప సమస్యను నయం చేయవు. పైగా రెండేళ్ల లోపు పసికందులకు విక్స్‌, కర్పూరం లాంటివి ఉపయోగించకూడదు. కర్పూరం, విక్స్‌ల ఘాటైన వాసనలను పిల్లలు భరించలేరు. ఈ వాసనలతో పసికందుల సున్నితమైన శ్వాస నాళాలు దెబ్బతింటాయి. కాబట్టి తల్లులు ఇలాంటి సందర్భాల్లో వైద్యులు సూచించే జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పసికందుల జలుబుకు బ్యాక్టీరియా, వైరస్‌ ప్రధాన కారణాలు. ఈ ఇన్‌ఫెక్షన్లు వాటంతట అవే అదుపులోకొస్తాయి. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు, వైద్యులు సూచించే నేసల్‌ డ్రాప్స్‌ వాడుకోవచ్చు. హైడ్రేషన్‌ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. రెండేళ్లు పైబడిన పిల్లలకు అవసరాన్ని బట్టి వైద్యులు సూచించే యాంటీ హిస్టమిన్‌ మందులు వాడుకోవచ్చు. విక్స్‌ లాంటి వాటిని ఛాతీ, వీపు మీద మినహా నోరు, ముక్కు దగ్గర అప్లై చేసుకోకూడదు. ఛాతీ, వెన్ను దగ్గర విక్స్‌ అప్లై చేయడం వల్ల పిల్లలకు కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే కొందరు తల్లులు పిల్లలకు సాంభ్రాణి పొగ వేస్తూ ఉంటారు. దీంతో ధూళి, బూడిద, పొగ, రసాయనాలతో కూడిన సూక్ష్మ ఘన రేణువులు, నీటి బిందువులు గాల్లో కలిసి పిల్లల శ్వాసనాళాలు ఇబ్బందికి లోనై, దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వేధిస్తాయి. అగర్‌బత్తీ పొగలు కూడా పసికందుల్లో అలర్జీలకు కారణమవుతాయి. ఉబ్బసం కలిగి ఉన్న పిల్లలకు ఎలాంటి పొగ క్షేమం కాదు.

Updated Date - Feb 09 , 2026 | 11:07 PM