Share News

ముల్లంగితో వెరైటీగా..!

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:42 AM

ముల్లంగి దుంపలతో కూర, పచ్చడి, వేపుడు, సాంబార్‌... ఇలా ఎన్నో చేసుకుంటూ ఉంటాం. ఇవికాక ముల్లంగితో చేసే వెరైటీ రుచులు మీకోసం.

ముల్లంగితో వెరైటీగా..!

ముల్లంగి దుంపలతో కూర, పచ్చడి, వేపుడు, సాంబార్‌... ఇలా ఎన్నో చేసుకుంటూ ఉంటాం. ఇవికాక ముల్లంగితో చేసే వెరైటీ రుచులు మీకోసం.

1.jpg

ముల్లంగి సలాడ్‌

కావాల్సిన పదార్థాలు

  • ముల్లంగి దుంప- ఒకటి, నిమ్మకాయ- ఒకటి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు- పావు కప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పచ్చి మిర్చి- ఒకటి, అల్లం ముక్క- చిన్నది, ఉప్పు- తగినంత, బ్రౌన్‌ షుగర్‌- పావు చెంచా, మిరియాల పొడి- అర చెంచా

తయారీ విధానం

  • ముల్లంగి చివర్లు కొద్దిగా కోసి తీసివేయాలి. పీలర్‌ సహాయంతో తొక్క తీసి గ్రేటర్‌తో తురుమాలి. దీన్ని చేత్తో తీసుకుని రసాన్ని గట్టిగా పిండి వెడల్పాటి గిన్నెలో వేయాలి. ఆపైన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత నిమ్మరసం, బ్రౌన్‌ షుగర్‌, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అంతే రుచికరమైన ముల్లంగి సలాడ్‌ రెడీ..!


2.jpg

ముల్లంగి రొట్టె

కావాల్సిన పదార్థాలు

  • పెద్ద సైజు ముల్లంగి- ఒకటి, పచ్చి మిర్చి- నాలుగు, జీలకర్ర- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, గోధుమ పిండి- రెండు కప్పులు, నూనె- తగినంత

తయారీ విధానం:

  • ముల్లంగికి తొక్క తీసి సన్నగా తురుమి పెట్టుకోవాలి. దీన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, జీలకర్ర, కొద్దిగా నూనె వేసి కలపాలి. అందులో నీరు ఊరిన తరువాత గోధుమ పిండి వేసి మెత్తటి ముద్దలా కలపాలి. దీని మీద మూతపెట్టి పావుగంటసేపు నాననివ్వాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి నూనె రాసి వేడిచేయాలి. తరువాత పిండిని చిన్న ముద్దలుగా చేసి చపాతీల్లా పామాలి. వేడెక్కిన పెనం మీద ఒక్కో చపాతీ వేసి కొద్దిగా నూనె చిలకరించి రెండు వైపులా దోరగా వేయించాలి. తరువాత పళ్లెంలోకి తీసి రైతాతో సర్వ్‌ చేయాలి.


3.jpg

ముల్లంగి పకోడి

కావాల్సిన పదార్థాలు

  • సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు- ఒక కప్పు, శనగపిండి- ఒక కప్పు, బియ్యప్పిండి- పావు కప్పు, ఉప్పు- అర చెంచా కారం- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, ధనియాల పొడి- అర చెంచా, గరం మసాల పొడి- అర చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, వంటసోడా- చిటెకెడు, మిరియాల పొడి- అర చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కరివేపాకు- కొద్దిగా, పుదీనా తరుగు- కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్టు- అర చెంచా, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత

తయారీ విధానం

  • వెడల్పాటి గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, పసుపు, వంటసోడా, గరం మసాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తరువాత అందులో ముల్లంగి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు, రెండు చెంచాల నూనె వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీద మూకుడు పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడిచేయాలి. ఆపైన ముల్లంగి మిశ్రమాన్ని చేత్త్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీల్లా నూనెలో వేయాలి. మధ్య స్థాయి మంట మీద అన్నివైపులా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. పైన కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేయాలి.


4.jpg

ముల్లంగి పాన్‌కేక్‌

కావాల్సిన పదార్థాలు

  • ముల్లంగి తురుం- ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, పచ్చి మిర్చి- రెండు, కొత్తిమీర తరుగు- అర కప్పు, ఉప్పు- అర చెంచా, మిరియాల పొడి- అర చెంచా, కారం- అర చెంచా, గోధుమ పిండి- అర కప్పు, నూనె- తగినంత

తయారీ విధానం

  • వెడల్పాటి గిన్నెలో ముల్లంగి తురుం, వెల్లుల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కారం, గోధుమ పిండి వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనె రాసి వేడిచేయాలి. చెంచాతో పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ అరచేతిలో బిళ్లలుగా చేసి పాన్‌ మీద పరచాలి. వాటి మీద కొద్దిగా నూనె చిలకరించి రెండువైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. వీటిని వేడి వేడిగా టమాటా సాస్‌ లేదా చిల్లీ సాస్‌తో సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - Jan 31 , 2026 | 02:42 AM