Share News

హట యోగమే అసలైన పనిముట్టు!

ABN , Publish Date - Jun 21 , 2026 | 03:11 AM

మనసు, శరీరం సమలేఖనం అయినప్పుడే మనం పతాక స్థాయి సామర్థ్యాన్ని పొందగలుగుతాం! హట యోగా క్రియలు అందుకు ఉపయోగపడే పనిముట్లు లాంటివి అంటున్నారు హటం యోగ స్టూడియో టీచర్‌ ఉష ముర్తినేని. అంతర్జాతీయ యోగా దినోత్పవం సందర్భంగా ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలు...

హట యోగమే అసలైన పనిముట్టు!

మనసు, శరీరం సమలేఖనం అయినప్పుడే మనం పతాక స్థాయి సామర్థ్యాన్ని పొందగలుగుతాం! హట యోగా క్రియలు అందుకు ఉపయోగపడే పనిముట్లు లాంటివి అంటున్నారు హటం యోగ స్టూడియో టీచర్‌ ఉష ముర్తినేని. అంతర్జాతీయ యోగా దినోత్పవం సందర్భంగా ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలు...

భారతదేశ సంస్కృతి, జీవన విధానం ఆధ్యాత్మికతతో ముడిపడి అభివృద్ధి చెందేలా రూపొందాయి. ఆ విధంగా ఎదిగేక్రమంలో మనం మానసికంగా, భౌతికంగా చురుగ్గా, అప్రమత్తంగా నడుచుకునేలా అలవాటు పడతాం! ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేయడం కాదు. మనలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రాథమిక అవసరం ఉంటుంది. దాన్ని తీర్చుకోగలిగే మార్గం వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. ఆ ప్రాథమిక అవసరాన్ని తీర్చగలిగే మార్గం, నాకు ఈషా ఫౌండేషన్‌లో దొరికింది. అలా 2012లో కోయంబత్తూరులో ఇండిపెండెంట్‌ హట యోగా టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఆ శిక్షణ తీసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ హట యోగాను నేర్పిస్తూనే ఉన్నాను.

ప్రకృతి శక్తుల శుద్ధి కీలకం

ఈషాలో ఇన్నర్‌ ఇంజనీరింగ్‌, శూన్య ఇంటెన్సివ్‌, హట యోగ, సంయమనం ఇలా వేర్వేరు కార్యక్రమాలుంటాయి. ఇన్నర్‌ ఇంజనీరింగ్‌లో శాంభవి మహాముద్ర క్రియ, శూన్య ఇంటెన్సివ్‌లో శూన్య ధ్యానంతో పాటు శక్తిచలన క్రియ సాధన ఉంటుంది. హట యోగా పూర్తి భౌతిక సాధన. ఒక క్రియ లేదా ధ్యానానికి తగ్గట్టు మనసును, శరీరాన్ని సిద్ధం చేయడానికి హట యోగ అవసరం. నేరుగా చేసే ధ్యానానికీ, హట యోగాతో మనసునూ, శరీరాన్ని సిద్ధం చేసుకుని చేసే ధ్యానానికీ, పొందే అనుభవానికీ ఎంతో తేడా ఉంటుంది. భౌతికంగా చురుగ్గా ఉండడానికీ, మానసికంగా అప్రమత్తంగా ఉండడానికీ హట యోగా తోడ్పడుతుంది. దీన్లో ఉన్న సాధనలన్నీ మనకిప్పటివరకూ తెలియనివీ, విననివి. దాన్లో భూత శుద్ధి ఒకటి. ఈ ప్రపంచంలోని ప్రతి అంశం పంచభూతాలతో రూపొంది ఉంటుంది. పక్షుల్లో ఎయిర్‌ ఎలిమెంట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టే అవి గాల్లో ఎగరగలుగుతాయి. మనలో నీటి ఎలిమెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రతి జీవిలో ఐదు ప్రకృతి శక్తులు వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి. ఈ ఐదు ఎలిమెంట్స్‌ ఒక మెమరీని మోస్తూ ఉంటాయి. కాబట్టి వాటి మీదే మన ప్రవర్తన ఆధ ారపడి ఉంటుంది. భూతశుద్ధి ద్వారా ఆ ఐదు ప్రకృతిశక్తులను శుద్ధి చేసినప్పుడు, నిరర్థకమైనవన్నీ చెరిగిపోతాయి. ఇలా భూతశుద్ధితో పాటు ఉపయోగ, సూర్యక్రియ, అంగమర్ధన, పలు రకాల ఆసనాలు మొదలైన సాధనలు హట యోగాలో ఉంటాయి.


ప్రయోజనాలపరంగా రాజీ పడక తప్పదు

ప్రస్తుతం యోగాలో ఎన్నో కొత్త పోకడలొచ్చాయి. మార్గనిర్దేశాలను అనుసరించకుండా మార్పులు చేర్పులు చేసి తమదైన శైలిలో యోగాసనాలను రూపొందిస్తున్నారు. వాటిని సరిదిద్ది ఒక రూపాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. 2 వేల ఏళ్ల క్రితం పతంజలి మహర్షి, అంతకు ముందు వాడుకలో ఉన్న పోకడలన్నిటినీ సరిదిద్ది కొన్ని సాధనలను అందించారు. కాబట్టే ఆయనను ఫాదర్‌ ఆఫ్‌ మోడర్న్‌ యోగా అని అంటారు. ఈషాలో నేర్పించేవన్నీ ఒరిజినల్‌ రూపాల్లో ఉంటాయి. పైగా సద్దురు, ఆధునిక ప్రపంచానికి అవసరమైన వాటిని జోడించి సాధనలను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఫేస్‌ యోగా, ఛైర్‌ యోగా లాంటి వాటిని చూస్తున్నాం. అయితే యోగాలో ఫిజికల్‌ బాడీ, మెంటల్‌ బాడీ, ఎనర్జీ బాడీలు ప్రభావితమవుతాయి. ఇవన్నీ సంయమనంతో మానవ శరీరాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ మూడు ఎనర్జీలు సమలేఖనం అయినప్పుడు మనిషి సామర్థ్యం పతాకస్థాయిలో ఉంటుంది. హట యోగా రూపకల్పన వెనకున్న ఉద్దేశమిది. కాబట్టి కొత్త పోకడల ప్రయోజనాలను, ప్రభావాలనూ విశ్లేషించాలి. సాధ్యమైనంతవరకూ ఒరిజినల్‌ ఫామ్‌లోని యోగాను ఎంచుకోవాలి. హట యోగాకు స్వల్ప మార్పులు చేసి సాధన చేయడం వల్ల, ఆ యోగాతో పొందే ప్రయోజనాలపరంగా రాజీపడక తప్పదు.

మాది కృష్ణాజిల్లా ఏలూరు. 1996లో హైదరాబాద్‌కు వచ్చేశాను. 2012లో హట యోగా టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఈ ఈషా ప్రోగ్రాం ప్రతి ఏటా గురుపౌర్ణమి రోజు మొదలవుతుంది. ఆరు నెలల పాటు కొనసాగిన ఈ కార్యక్రంతో నాలో నేనే అద్భుతమైన మార్పులను గమనించాను. ప్రపంచాన్ని, మనుషులను చూసే దృష్టి కోణం మారిపోయినట్టు కూడా నాకు నేను గ్రహించాను. నా ఆరోగ్య సమస్యలన్నీ అదుపులోకొచ్చేశాయి. నడవడిక మారిపోయింది. మన శక్తియుక్తులను సాధ్యమైనంత సమర్థంగా, మెరుగ్గా వాడుకోగలిగే మెలకువలు పెంపొందించుకునేలా హట యోగాను రూపొందించినట్టు నేను భావిస్తాను. అందుకోసం ఉపయోగపడే పనిముట్లే హట యోగా, క్రియ యోగా! కాబట్టే ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితాన్ని గడపడం కోసం ఈ పనిముట్లను ఉపయోగించుకోగలిగే శిక్షణ ఇవ్వడాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాను.

గోగుమళ్ల కవిత

Updated Date - Jun 21 , 2026 | 03:11 AM