హ్యాపీ హ్యాపీ హార్మోన్లు..
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:47 AM
సంతోషాన్నిచ్చే అంశాలు మనిషి మనిషికీ మారిపోతూ ఉంటాయి. అయితే ఒక అంశం మనల్ని సంతోషపెట్టాలంటే, మనలోని హ్యాపీ హార్మోన్స్ సరైన మోతాదుల్లో స్రవిస్తూ ఉండాలని మీకు తెలుసా? ఆ హార్మోన్లు, వాటి మోతాదులను స్థిరంగా ఉంచే మార్గాల గురించి వైద్యులేమంటున్నారో తెలుసుకుందాం!
సంతోషాన్నిచ్చే అంశాలు మనిషి మనిషికీ మారిపోతూ ఉంటాయి. అయితే ఒక అంశం మనల్ని సంతోషపెట్టాలంటే, మనలోని హ్యాపీ హార్మోన్స్ సరైన మోతాదుల్లో స్రవిస్తూ ఉండాలని మీకు తెలుసా? ఆ హార్మోన్లు, వాటి మోతాదులను స్థిరంగా ఉంచే మార్గాల గురించి వైద్యులేమంటున్నారో తెలుసుకుందాం!
హార్మోన్లు శరీరంలోని రసాయన దూతలు. గ్రంథుల నుంచి విడుదలైన వెంటనే రక్తప్రవాహంలో కలిసి, వేర్వేరు అంతర్గత అవయవాలు, కణజాలాల మీద ప్రభావం కనబరుస్తూ భౌతిక, మానసిక ఆరోగ్యాలను గాడిలో పెడుతూ ఉంటాయి. ఇలాంటి హార్మోన్లలో ‘ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా హ్యాపీ హార్మోన్స్’ అనే హార్మోన్ల సమూహం ఒకటి ఉంటుంది. మన భావోద్వేగాలన్నీ వీటితో ముడిపడి ఉంటాయి. పట్టరాని సంతోషం, చెప్పలేనంత దుఃఖం, ఉరకలేసే ఉత్సాహం.. ఇలా హ్యాపీ హార్మోన్లు పలురకాల భావోద్వేగాలను నియంత్రిస్తూ ఉంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నప్పుడు ఎంత సంతోషకరమైన అంశం కూడా మనల్ని ఆనందపెట్టలేదు. ఎంతటి విచారకరమైన అంశమైనా మనల్ని ఏడిపించలేదు. కాబట్టి ఈ హ్యాపీ హార్మోన్ల మోతాదులను స్థిరంగా ఉంచే జీవనశైలిని అనుసరించడం అత్యవసరం. మెదడులో స్రవించే హ్యాపీ హార్మోన్లు నాలుగు రకాలు. వాటి పనితీరు కూడా భిన్నమే!
ఆక్సిటోసిన్: దీనికి లవ్ హార్మోన్ అనే మరో పేరు కూడా ఉంది. స్పర్శ, కౌగిలింత లాంటి సాన్నిహిత్యంతో కూడిన ప్రతి చిన్న పనితో ఈ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. ఒంటరిగా ఉండిపోవడం, కుంగుబాటు, ఆందోళన ఈ హార్మోన్ లోపం ప్రధాన లక్షణాలు
డోపమిన్: దీన్ని రివార్డ్ హార్మోన్ అని కూడా అంటారు. అది ఎంత చిన్న పని అయినా, దాన్లో విజయం సాధించినప్పుడు పొందే సంతృప్తినీ, సంతోషాన్నీ డోపమిన్ హార్మోన్‌తో ముడి పెట్టవచ్చు. ప్రేరణ లోపించడం, నిరాశ నిస్పృహలు ఈ హార్మోన్ లోపానికి సంకేతాలు
సెరటోనిన్: దీన్ని మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్ అని కూడా అంటారు. మానసిక కుంగుబాటును తగ్గించే మందులన్నీ ఈ హార్మోన్ ఆధారంగానే రూపొందుతూ ఉంటాయి. ఆందోళన, భయం, ప్యానిక్ అటాక్స్ ఈ హార్మోన్ లోపానికి సంకేతాలు
ఎండార్ఫిన్స్: మెదడులోని పిట్యుటరీ, హైపోథలామ్‌సలలో స్రవించే ఎండార్ఫిన్స్ సహజసిద్ధ నొప్పి నివారిణులు. నొప్పి, ఒత్తిడులను తగ్గిస్తాయి. ఎండార్ఫిన్ల లోపంతో ప్లెజర్‌ను ఆస్వాదించలేకపోవడం, మూడ్ మారిపోతూ ఉండడం, నొప్పిని తట్టుకోలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి
పరిష్కారాలున్నాయి
స్ట్రెస్ హార్మోన్లు అయిన కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్లు కూడా మన భావోద్వేగాలను ప్రభావితం చేయగలుగుతాయి. కాబట్టి హ్యాపీ హార్మోన్లకూ స్ట్రెస్ హార్మోన్లకూ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటూ హ్యాపీ హార్మోన్ల స్రావాలను పెంచే పనులకు పూనుకోవాలి. అందుకోసం...
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తేలికపాటి వ్యాయామంతో కూడా డోపమిన్, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి
ఆహారం: సమతులాహారం తీసుకోవాలి. అధిక కొవ్వులను కలిగి ఉండే ఆహారం హ్యాపీ హార్మోన్ల స్రావాన్ని మందగిస్తుంది
సంతృప్తి: సాధ్యపడని లక్ష్యాలకు బదులుగా అందుకునే వీలున్న చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరుచుకుని, వాటిని అందుకోవడం వల్ల సంతృప్తి దక్కుతుంది. ఈ సంతృప్తి హ్యాపీ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది
సామాజిక బంధాలు: నలుగురితో కలిసి కాలక్షేపం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, నవ్వుకోవడం... వీటి వల్ల కూడా ఆక్సిటోసిన్ స్రావం పెరుగుతుంది
ప్రేమాప్యాయతలు: నచ్చిన వ్యక్తితో, పిల్లలతో ప్రేమగా మెలగడం, నాణ్యమైన సమయాన్ని గడపడం హ్యాపీ హార్మోన్లను పెంచే మరొక మార్గం
సూర్యరశ్మి: సెరటోనిన్, డోపమిన్ హార్మోన్లను పెంచడంలో సూర్యరశ్మి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎండకు బహిర్గతమవుతూ ఉండాలి
నిద్ర: కంటినిండా నిద్రకు ప్రాధాన్యమివ్వాలి. ఫలితంగా ఆక్సిటోసిన్ పెరుగుతుంది
హార్మోన్లు తగ్గితే...
హ్యాపీ హార్మోన్ స్రావాలు తగ్గితే, సంతోషాన్నిచ్చే అంశాలేవీ సంతోషపెట్టకపోవచ్చు. సంతృప్తినిచ్చే అంశాలేవీ సంతృప్తిని అందించలేకపోవచ్చు. నిర్వేదం, అనాసక్తి ఆవరించవచ్చు. ఎంత ఉద్వేగపూరితమైన విషయమైనా నిరాసక్తంగా కనిపించవచ్చు. కొత్త కారును చూసి ఎవరైనా ఉత్సాహపడిపోతారు. కానీ హ్యాపీ హార్మోన్లు లోపించిన వారిలో ఇలాంటి ఉత్సాహం కనిపించకపోవచ్చు. కొన్ని రకాల మెదడు సంబంధ రుగ్మతలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. పార్కిన్సన్స్‌కు గురైన పెద్దల్లో ఈ లక్షణం ప్రస్ఫుటంగా కనిపించవచ్చు. అలాగే కొన్ని ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా తాత్కాలికంగా ఈ పరిస్థితి తలెత్తవచ్చు
నివారణ చర్యలు ఇవే!
హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడే అమీనో యాసిడ్లు మనకు ఆహారం ద్వారా అందుతాయి. వీటిలో లోపం తలెత్తితే హార్మోన్ల స్రావాలు తగ్గి భావోద్వేగాలు అదుపుతప్పుతాయి. కాబట్టి ప్రొటీన్, పీచు పుష్కలంగా దొరికే ఆహారంతో పాటు నూనె, ఉప్పు, పిండిపదార్థాలు తక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, నిద్రకు ప్రాధాన్యమిస్తూ, సామాజిక సంబంధాలు బలపరుచుకోవాలి. మానసికోల్లాసాన్ని పెంచే పనులకు పూనుకోవాలి. సంతోషపెట్టే పనులను ఎంచుకోవాలి.