Share News

జీర్ణశక్తి భేషుగ్గా...

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:38 AM

పొట్టను ఇష్టారాజ్యంగా వాడుకోవడం భారతీయులు చేసే పెద్ద తప్పు అని బెంగుళూరుకు చెందిన ప్రముఖ కోలోరెక్టల్‌ సర్జన్‌, గట్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పరమేశ్వర అంటున్నారు. పొట్టనెలా కాపాడుకోవాలో ఆయన ఇలా వివరిస్తున్నారు....

జీర్ణశక్తి భేషుగ్గా...

పొట్ట మురుగు కాల్వ కాదు. కాబట్టి వేళాపాళా లేకుండా, నచ్చిన పదార్థాన్ని పొట్టలోకి తోసేసే అలవాటు మానుకోవాలి. మరీ ముఖ్యంగా పొద్దు పోయిన తర్వాత భోజనాలు, చిరుతిళ్లు తినే అలవాటు పెరిగిపోతోంది. కానీ రాత్రుళ్లు బాగా పొద్దు పోయాక ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకునే పదార్థాల్లో నూనె, ఉప్పు, చక్కెరలు ఎక్కువగా పీచు తక్కువగా ఉంటుంది. నిజానికి మన పేగుల్లోని బ్యాక్టీరియాకు ప్రధాన ఆహారం పీచు. ఈ ఆహారం లోపించడంతో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా క్షీణిస్తుంది. అంతే కాదు...

లయ తప్పితే: జీర్ణ ప్రక్రియ, పేగుల బ్యాక్టీరియా ఒక దైనందిన లయను పాటిస్తూ ఉంటాయి. శరీరం విశ్రాంతిని కోరుకునే వేళల్లో ఆహారం తినడం వల్ల ప్రక్రియ లయ తప్పుతుంది.

యాసిడ్‌ రిఫ్లక్స్‌: నిద్రకు ముందు తింటే, నిద్ర పోతున్నా మన పొట్ట పని చేస్తూనే ఉంటుంది కాబట్టి యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్య పెరుగుతుంది.

నిద్రాభంగం: నిద్రకు ముందు తింటే కంటినిండా నిద్ర లోపిస్తుంది. నిద్రలేమి జీర్ణ ప్రక్రియను భంగపరుస్తుంది. దాంతో పేగుల ఆరోగ్యం క్షీణిస్తుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం...

వ్యవధి: రోజులో చివరి భోజనం నిద్రకు కొన్ని గంటల ముందే పూర్తి చేయాలి. పొట్టను పూర్తిగా కాకపోయినా, కొంత మేరకు ఖాళీగా ఉంచుకోవాలి.


తేలికపాటి భోజనం: రాత్రి తినే భోజనం భారీగా ఉండకూడదు. భారీ భోజనంతో జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో నిద్రాభంగం కలుగుతుంది.

పీచు: కూరగాయలు, పప్పుదినుసులు, పొట్టుతీయని ధాన్యాలు సరిపడా పీచును కలిగి ఉండి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తాయి. దాంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం పుంజుకుంటుంది.

భోజన వేళలు

  • రోజూ ఒకే సమయానికి భోజనం తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఆకలి కూడా అదుపులో ఉంటుంది.

  • అర్థరాత్రి భోజనాలు, పీచు తక్కువగా కొవ్వులు ఎక్కువగా ఉండే భారీ భోజనాలు మానుకోవాలి.

  • ప్రతి భోజనంలో పీచు, ప్రొటీన్‌ సరిపడా ఉండేలా చూసుకోవాలి.

  • అసిడిటీ వేధిస్తున్నప్పుడు మసాలాలు, పుల్లని పదార్థాలు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.

  • జీర్ణశక్తి కోసం సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.

  • కడుపు నిండా భోజనం తినడం సరి కాదు. పొట్టలో కొంత మేరకు జాగా ఉంచాలి.

  • కడుపుబ్బరం, ఛాతీలో మంట తరచూ వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి.

Updated Date - Nov 24 , 2026 | 12:42 AM