Share News

వారసుడొస్తున్నాడు

ABN , Publish Date - Jun 28 , 2026 | 02:56 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. మహేష్‌ బాబు.. ఆ తర్వాత ఎవరు? దీనికి సమాధానమే ఘట్టమనేని జయకృష్ణ... ‘అలివేలు మంగాపురం’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న జయకృష్ణ అరంగేట్రం అంత సునాయాసంగా సాగలేదు.

వారసుడొస్తున్నాడు

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. మహేష్‌ బాబు.. ఆ తర్వాత ఎవరు? దీనికి సమాధానమే ఘట్టమనేని జయకృష్ణ... ‘అలివేలు మంగాపురం’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న జయకృష్ణ అరంగేట్రం అంత సునాయాసంగా సాగలేదు. తను హీరో కావడం వెనుక తాతయ్య సూపర్‌స్టార్‌ కృష్ణ ప్రోత్సాహం ఎంతో ఉందంటున్న జయకృష్ణ తొలి ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకులకు ప్రత్యేకం...

తొలి సినిమా అనుభవం ఎలా ఉంది?

నవంబర్‌ చివరిలో షూటింగ్‌ ప్రారంభించాం. మూడు రోజుల క్రితమే పూర్తయింది. ఈ ఏడు నెలలు మొత్తం అవుట్‌డోర్‌లోనే చేశాం. ఒక్క రోజు కూడా సెట్‌లో షూట్‌ చేయలేదు. డ్యాన్సులు, ఫైట్లు అన్నీ రోడ్డు మీదే చేశాం. ఈ మధ్యకాలంలో మొత్తం అవుట్‌డోర్‌లో చేసిన సినిమా ఇదేనేమో! ఈ మొదటి సినిమా అందమైన అనుభవాన్ని మిగిల్చింది. షూట్‌కు వెళ్లేముందు కాస్త టెన్షన్‌ పడ్డాను కానీ రషెస్‌ చూశాక- ‘‘అనుకున్నదానికన్నా బాగా చేశావు’’ అని బంగారు తాతయ్య (ఆదిశేషగిరిరావు) మెచ్చుకున్నారు. దాంతో నా కాన్ఫిడెన్స్‌ పెరిగింది.

తాత సూపర్‌ స్టార్‌.. బాబాయ్‌ ఇంకో సూపర్‌ స్టార్‌.. ఈ వారసత్వ ఒత్తిడి నీపై ఉందా?

చిన్నప్పటి నుంచి వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్లిద్దరూ శిఖరాలు. వాళ్ల రేంజ్‌ చాలా పెద్దది. వాళ్ల వారసత్వం నాకొక అవకాశం. వారసత్వ ఒత్తిడి కన్నా.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడే ఎక్కువగా ఉంది.

హీరో కావాలని ఎప్పుడు అనుకున్నావు?

చిన్నప్పుడు చాలా అస్పష్టత ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండేవాడిని. అందరూ ఏడిపిస్తూ ఉండేవారు. బొద్దుగా ఉన్న పిల్లలను ఏడిపించటం మామూలే కదా! అది పెద్ద సమస్య కాదు. అయితే పెద్దయిన తర్వాత ఏం చేయాలనే విషయంపై అంత స్పష్టత లేదు. బాబాయ్‌ సినిమాలు చూస్తూ పెరగటం వల్ల హీరో అవ్వాలని ఉండేది. కానీ హీరోగా సెట్‌ అవుతానా? లేదా అనే అనుమానం మాత్రం ఉండేది. నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కృష్ణ తాతయ్య నా భవిష్యత్తు గురించి మాట్లాడారు. ‘నీలో ఆ స్పార్క్‌ ఉంది’ అని ప్రొత్సహించారు. మా నాన్న (రమేశ్‌బాబు) కెరీర్‌ అనుకున్నంత సాగలేదు కాబట్టి.. నాన్న కోసం అయినా నేను కష్టపడి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని 16 ఏళ్లకే గట్టిగా డిసైడ్‌ అయ్యాను.


చిన్నప్పుడు బొద్దుగా ఉండేవాడివి కదా.. ఇప్పుడంత స్లిమ్‌గా ఎలా తయారయ్యావు?

ఒకానొక సమయంలో నేను 110 నుంచి 115 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు నా బరువు సుమారు 80 కేజీలు. అంటే దాదాపు 35 కేజీలు తగ్గాను. బరువు తగ్గటమనేది- శారీరకంగా, మానసికంగా చాలా కష్టమైన ప్రయాణం. అయినా కష్టపడ్డా.. సాధించా..

నువ్వు అమ్మ కూచివి అని విన్నాం..

అవును. నేను మా అమ్మతో చాలా సన్నిహితంగా ఉంటాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమ్మ(మృదుల) సత్తెన్నపల్లి సమీపంలో ఒక చిన్న పట్టణం నుంచి వచ్చింది. తను సెలబ్రిటీ కుటుంబం నుంచి రాలేదు. అందువల్ల ఇంట్లో మధ్యతరగతి విలువలే ఉండేవి. మా అమ్మ మమల్ని చాలా క్రమశిక్షణతో పెంచిందనే చెప్పాలి. పది మందిలో ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయంలో తను చాలా కఠినంగా పెంచింది. కాస్త అటుఇటు అయితే రెండు తగిలించేది కూడా! అమ్మకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను పెద్ద హీరో అవ్వాలనుకోవటానికి తను కూడా ఒక కారణం. నేను తనకు గర్వకారణమవ్వాలనేదే నా లక్ష్యం.

మీ నాన్నగారితో ఎలాంటి అనుబంధం ఉండేది?

నాన్నగారు పక్కా సినీ అభిమాని. ఆయన హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలను విపరీతంగా చూసేవారు. నాకు చిన్నతనంలోనే ‘గాడ్‌ ఫాదర్‌’ లాంటి సినిమాలు చూపించేవారు. సినిమా అనేది ఒక గొప్ప ఆర్ట్‌ఫామ్‌ అనే భావన బలంగా నాటుకోవటానికి నాన్నే కారణం. నాన్నకు నాతో ఒక సినిమా నిర్మించాలని ఉండేది. ‘నువ్వు బాగా కష్టపడి ఒక మంచి పొజిషన్‌కు రావాలి’ అని ఎప్పుడూ చెబుతుండేవారు.

బాబాయ్‌ మహేష్‌తో నీ అనుబంధమేమిటి?

నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. చిన్నప్పటి నుంచి కృష్ణ తాతయ్యతో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని కానీ ఇంకెవ్వరితో మాట్లాడలన్నా సిగ్గుపడేవాడిని. బాబాయ్‌ సినిమాలు చూస్తూ పెరిగాను కదా.. ఆయన నాకు ఎప్పుడూ సూపర్‌స్టార్‌లాగే కనిపిస్తారు. తను కనబడగానే మాట్లాడటానికి బెరుకుగా ఉండేది. నాన్నగారి మరణం తర్వాత ఒక రోజు బాబాయ్‌నాతో కూర్చున్నారు. నా అభిప్రాయాలు అడిగారు. ‘‘నేను కూడా హీరో కావాలనుకుంటున్నా’’ అని చెప్పా! అప్పుడు ఆయన- ‘నువ్వు సినిమాలో నటించాలనుకుంటే- 50 శాతం కాదు. వంద శాతం ఇవ్వాలి. ముందు శిక్షణ తీసుకో! ప్రస్తుతం ఇండస్ట్రీ మారిపోతోంది. నువ్వు ఘట్టమనేని వారసుడివా? కాదా? అనే విషయం ప్రేక్షకులకు అనవసరం. నువ్వు బాగా చేయకపోతే నిన్ను చూడరు’’ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఆయన నన్ను చాలా బాగా గైడ్‌ చేశారు. ఆ తర్వాత చాలా కష్టపడేవాని. రోజుకు రెండుమూడు సినిమాలు చూస్తూ ఏది మంచి సినిమా, ఏది కాదు అని నాలో నేనే బేరీజు వేసుకొనేవాడిని. ముందు ముంబైలో.. ఆ తర్వాత న్యూయార్క్‌లో నటనలో శిక్షణ తీసుకున్నా. మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్స్‌, తైక్వాండో, కిక్‌బాక్సింగ్‌లు కూడా నేర్చుకున్నా.

4.jpg


అలివేలు మంగాపురం సినిమా నీకు ఏం నేర్పించింది?

నటన అనేది అనుభవం ద్వారా మాత్రమే వస్తుందని నేర్చుకున్నాను. మీరు ఎన్ని క్లాసులకు వెళ్లినా, కెమెరా ముందుకు వచ్చి నిలబడి నటిస్తేనే మనలో సత్తా ఏమిటో తెలుస్తుంది. ఈ సినిమా కోసం నేను 93 రోజులు షూటింగ్‌ చేశా. మొదటి రోజుకు.. 93 రోజుకు మధ్య ఉన్న తేడా నాకే తెలిసింది. నా రెండో సినిమాలో ఇంకా బాగా చేస్తాననే నమ్మకం నాకు ఉంది.

ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.. అమ్మ, అక్క ఏమన్నారు?

మా సినిమా టీజర్‌ను బాబాయ్‌ మహేశ్‌బాబు రిలీజ్‌ చేశారు. అది రిలీజ్‌ అయినప్పుడు నేను ఇంకా షూటింగ్‌లోనే బిజీగా ఉన్నాను. ఆడియన్స్‌ ఏమనుకుంటున్నారు? కామెంట్స్‌లో తిడుతున్నారా? అని ఆలోచించే టైం కూడా లేదు. ఒక షాట్‌ బ్రేక్‌లో అమ్మ ఫోన్‌ చేసింది. అక్క (భారతి) కూడా పక్కనే ఉంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. బయటి వాళ్లకు ఇది నా తొలి సినిమా కావచ్చు. కానీ అమ్మకు, అక్కకు ఇది పదేళ్ల ప్రయాణం. బొద్దుగా ఉన్న నేను.. ఒక హీరోగా మారటం ఒక సుదీర్ఘ ప్రస్థానం. దాంతో వాళ్లు బాగా ఎమోషనల్‌ అయిపోయారు. ఆ క్షణం నాకు లైఫ్‌లో ఏదో సాధించాననే ఆనందం కలిగింది. సినిమా విజయం సాధిస్తుందా? లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. మా ఇంట్లో వాళ్లందరూ ఆనందంగా ఉన్నారు. అది చాలా తృప్తిని ఇస్తోంది.

ఈ సినిమా పూర్తయింది.. వేరే సినిమాలేవైనా లైన్‌అ్‌పలో ఉన్నాయా?

కృష్ణ తాత ఒకే సారి ఐదారు సినిమాలు చేసేవారట! నాకు అంత తొందర లేదు. ఒకే సారి ఐదారు సినిమాలు ఒప్పేసుకొని చేయాలని అనుకోవటం లేదు. నా దృష్టిలో కథ చాలా ముఖ్యం. దానికే నేను ఎక్కువ గౌరవమిస్తాను. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల చర్చలు నడుస్తున్నాయి.

నీ డ్రీమ్‌ రోల్‌ ఏమిటి?

నా దృష్టిలో నేను ఒక హీరోనో..స్టార్‌నో కాదు. ఒక నటుడిని. నన్ను నేను ఛాలెంజ్‌ చేసుకొనేలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నా! ఇక వ్యక్తిగతంగా నాకు యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ‘జాన్‌ విక్‌’ లాంటి పక్కా గ్రిట్టీ, రియలిస్టిక్‌ యాక్షన్‌ సినిమాలు చేయటమే నా డ్రీమ్‌!


అక్కకు కూడా...

మా అక్కకి చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. తనకి కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి. తను కూడా చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. మేమిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ‘నిన్ను ఎవరూ ఆపలేరు.. నువ్వు అనుకున్నది చేసుకో’ అని ఒకరికొకరం చెప్పుకుంటూ ఉంటాం.

3.jpg

కృష్ణ తాత ప్రభావం!

నేను చెన్నైలో పుట్టాను. చిన్నప్పుడు చెన్నై ఇంట్లో కృష్ణ తాతయ్యతో గడిపిన తీపి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది.. నాన్న గారు చనిపోయిన తర్వాత నేను చాలా ఒంటరిగా ఉండి.. జీవితం ఏంటి అని అనుకుంటున్న సమయంలో కృష్ణ తాతయ్య నన్ను పిలిచి మాట్లాడారు. ‘నువ్వు కచ్చితంగా చేయగలవు. న్యూయార్క్‌ వెళ్లి యాక్టింగ్‌ కోర్సు చెయ్యి. కెమెరా వెనుక ఉండే క్రాఫ్ట్స్‌, రైటింగ్‌, డైరెక్షన్‌ నేర్చుకో’’ అని నన్ను అమెరికా పంపించారు. కృష్ణగారి లాంటి లెజెండ్‌ నా మీద అంత నమ్మకం ఉంచిన ఆ క్షణాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన మాటలే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

సోషల్‌ మీడియాకు దూరం!

నాకు ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా ఖాతాలు లేవు. నేను అసలు పెద్దగా ఫోన్‌ వాడను. ఈ సినిమా షూటింగ్‌ జరిగిన 93 రోజుల్లో రెండుమూడు రోజులపాటు ఫోన్‌ చార్జింగ్‌ పెట్టకుండా మేనేజర్‌ దగ్గరే ఫోన్‌ పడేసిన రోజులూ ఉన్నాయి. నాకు సోషల్‌ మీడియా కంటే రియాలిటీలో, ఆ క్షణంలో బతకడం ఇష్టం. సెట్‌లో ఉన్నప్పుడు అందరినీ గమనిస్తూ ఉండేవాడిని. లైట్‌ బాయ్‌ నుంచి డీఓపీ దాకా అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవాడిని.

Updated Date - Jun 28 , 2026 | 02:56 AM