అందమైన మెడ కోసం...
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:00 AM
ఒక్కోసారి మెడ ముందు వెనక భాగాల్లో చర్మం వదులుగా మారి ముడతలు, గీతలు ఏర్పడి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. వీటిని సులువుగా మాయం చేసే చిట్కాల గురించి తెలుసుకుందాం...
ఒక్కోసారి మెడ ముందు వెనక భాగాల్లో చర్మం వదులుగా మారి ముడతలు, గీతలు ఏర్పడి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. వీటిని సులువుగా మాయం చేసే చిట్కాల గురించి తెలుసుకుందాం...
ముందుగా మెడ భాగాలను గోరువెచ్చటి నీటితో ఆపైన క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. చిన్న గిన్నెలో అయిదు చెంచాల ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని గోరువెచ్చగా వేడిచేయాలి. ఈ నూనెను మునివేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుంటూ మెడకు పట్టించి గుండ్రంగా రుద్దుతూ పావుగంట సేపు మర్దన చేయాలి. దీనివల్ల అక్కడి చర్మం తేమతో నిండి బిగుతుగా మారుతుంది. ముడతలు, గీతలు మాయమై మెడ అందంగా మారుతుంది.
తరచూ మెడను ఇరు పక్కలకూ, ముందుకూ, వెనక్కూ వంచుతూ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలు ఉత్తేజితమై కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మెడ చర్మం బిగుతుగా మారుతుంది.
రక్తప్రసరణ సజావుగా జరగడం వల్ల మెడ ఛాయగా కనిపిస్తుంది.
ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల సొన, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు ప్యాక్‌లా పట్టించి పావుగంట సేపు ఆరనివ్వాలి. ఆపైన గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే మెడ అందంగా కాంతివంతంగా మారుతుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల పెరుగు, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలితో తీసుకుంటూ మెడ భాగాల మీద నెమ్మదిగా మర్దన చేయాలి. ఆపైన గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు మెడ భాగాలకు ప్యాక్‌లా వేయాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చాలు. నాలుగు రోజుల్లో ముడతలు తగ్గి మెడ అందంగా
మెరిసిపోతుంది.