Share News

అమ్మ పేరుతో...అందరికీ అండగా

ABN , Publish Date - Apr 16 , 2026 | 02:50 AM

ప్రజా సేవకు అంకితమైన తండ్రిని చూసి పొందిన స్ఫూర్తి మంత్రం... సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా సర్దుబాటు చేయకుండా... దాని మూలాలకు వెళ్లి పరిష్కరించాలన్న దృఢ సంకల్పం...

అమ్మ పేరుతో...అందరికీ అండగా

ప్రజా సేవకు అంకితమైన తండ్రిని చూసి పొందిన స్ఫూర్తి మంత్రం... సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా సర్దుబాటు చేయకుండా... దాని మూలాలకు వెళ్లి పరిష్కరించాలన్న దృఢ సంకల్పం... చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను ఆమె భుజానికెత్తుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా... పేదరికం లేని సమాజ నిర్మాణమే ఆశయంగా... వేలమందికి ఉచితంగా విద్య, వైద్యం తదితర సదుపాయాలు అందిస్తున్నారు. అమ్మ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి... అట్టడుగు వర్గాలవారికి అండగా నిలుస్తున్న... ‘జయప్రద ఫౌండేషన్‌’ వైస్‌చైర్మన్‌ గౌతమి సరోజ తొండపుతో ‘నవ్య’ మాటామంతి.

‘‘నం జీవిస్తున్న సమాజం... మన చుట్టూ ఉన్న సమూహం... ఎప్పుడూ మన కోసం మనమే కాకుండా... తోటివారి గురించి కూడా ఆలోచించాలి. సేవను బాధ్యతగా భావించాలి. ఇది మా నాన్న తొండపు దశరథ జనార్దన్‌ నుంచి నేర్చుకున్నాను. ఆయన ఏపీలో టీడీపీ నేషనల్‌ వైస్‌ప్రెసిడెంట్‌, మాజీ ఆప్కాబ్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం లింగాల మాది. అహ్మదాబాద్‌ నల్సార్‌లో లా చదివాను. తరువాత ఒక లా ఫర్మ్‌లో పని చేశాను. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరిగాను. ఆయన ప్రజా ప్రస్థానం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎవరొచ్చి ఏ సాయం అడిగినా నాన్న చేసేవారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచేవారు. ఆయన స్ఫూర్తితో నాకు, మా అన్నయ్య రాజవర్ధన్‌కు ఒక ఆలోచన వచ్చింది... స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి, దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేపడితే మరింతమందికి లబ్ధి చేకూరుతుందని, నిరంతరం వీటిని కొనసాగించవచ్చని. వెంటనే దానికి రూపం ఇవ్వాలని నిర్ణయించాం. అలా 2018లో మా అమ్మ పేరు మీద ‘జయప్రద ఫౌండేషన్‌’ నెలకొల్పాం. మా నాన్న దానికి చైర్మన్‌.

మూడు గ్రామాలు దత్తత...

సంస్థ ప్రారంభించగానే మొదటగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలోని లింగాల, పోచవరం, గంగవల్లి గ్రామాలను దత్తత తీసుకున్నాం. ఆ ఊళ్లల్లో వైద్య శిబిరాలు నిర్వహించాం. పేదలకు కావల్సిన మందులు ఇచ్చాం. సేంద్రియ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో రైతులకు విత్తనాలు అందించాం. క్రమంగా సేవా కార్యక్రమాలు పెంచుకొంటూ వెళ్లాం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాం. ఇవాళ నాలుగైదు గ్రామాల్లో ఒకేసారి శిబిరాలు ఏర్పాటు చేయగలుగుతున్నాం. మేం ఎక్కడ క్యాంపు పెట్టినా కనీసం ఆరేడు వందలమంది వస్తున్నారు. వారందరికీ బీపీ, షుగర్‌ తదితర వ్యాధులకు సంబంధించి పూర్తి కోర్సు మందులు, అంటే మూడు నాలుగు నెలలకు సరిపడా ఉచితంగా ఇస్తున్నాం.


సత్వర పరిష్కారం...

అలాగే ఎవరికైనా చికిత్సలు అవసరమైతే మాకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తాం. బిల్స్‌లో కొంతమొత్తం ఫౌండేషన్‌ భరిస్తోంది. మిగిలినది ప్రభుత్వ పథకాల ద్వారా సత్వరమే సాయం అందేలా చూస్తున్నాం. పాఠశాలల్లో కూడా క్యాంపులు నిర్వహిస్తున్నాం. లెక్కకు మించి ఉచిత కంటి పరీక్షల శిబిరాలు పెడుతున్నాం. గత ఏడాది కాలంలో 30 వేల మందికి పరీక్షలు జరిగాయి. 14 వేల మందికి కళ్లజోళ్లు ఇచ్చాం. కేటరాక్ట్‌ తదితర సర్జరీలకూ సాయం చేస్తున్నాం.

ఆడపిల్లల ఆరోగ్యంపై దృష్టి...

మా సేవలు పేదలు అందరికీ. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళల విషయంలో మరింత శ్రద్ధ తీసుకొంటున్నాం. నెలసరి సమయంలో పరిశుభ్రత, ఫర్టిలిటీ తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకూ ఫర్టిలిటీ శాతం పడిపోతోంది. ఆహారపు అలవాట్లు, హర్మోనల్‌ సమస్యలు, ప్రస్తుత జీవన శైలే ఇందుకు కారణం. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న పరిస్థితులు, వారు తీసుకోవాల్సిన బాధ్యతలను బేరీజు వేస్తే ముందు ముందు ఫర్టిలిటీ చాలా పెద్ద సమస్య అవుతుందని అంచనా. సాధారణంగా ఇంట్లో అందరూ తిన్న తరువాత మిగిలింది ఇల్లాలు తింటుంది. అసలు పోషకాహారం కావల్సిందే ఆమెకు. కానీ తన ఆహారానికి కొంచెం కూడా ప్రాధాన్యం ఇచ్చుకోదు. అలాగే కేన్సర్‌, రక్తహీనత, ఊబకాయం తదితర సమస్యలు కూడా మహిళల్లో అధికంగా ఉన్నాయని గమనించాం. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వీటన్నిటిపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా కేన్సర్‌ స్ర్కీనింగ్‌ మీద దృష్టి పెట్టాం. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనేది మేం గ్రహించిన వాస్తవం.

ఒక ఉద్యమంలా...

ఈ కార్యక్రమాలన్నీ మేం ఒక ఉద్యమంలా చేస్తున్నాం. ఇన్నేళ్లుగా ఇంత విజయవంతంగా ఫౌండేషన్‌ నడుస్తోందంటే అందుకు కారణం... మాకున్న అద్భుతమైన టీమ్‌. ఉన్నత చదువులు చదివినవారు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనేకొనేవారు ఇందులో భాగస్వాములయ్యారు. వారి మార్గదర్శకత్వంతో పాటు అన్నయ్య రాజవర్ధన్‌, మావారు తమ్మారెడ్డి నిశాంత్‌ సహకారంవల్లనే ఇదంతా సాధ్యమైంది. ‘సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా సర్దుబాటు చేయడం కాకుండా... దాని మూలాల నుంచి పరిష్కరించాలి’... అన్నది నాన్న నుంచి నేర్చుకున్నా. దానికి అనుగుణంగానే ముందుకు వెళుతున్నా. అన్నీ ప్రభుత్వాలే చేయాలంటే చేయలేవు. మనందరం కూడా పూనుకొంటేనే సమాజంలో అసలైన మార్పును చూడగలుగుతాం.


చదువుతోనే సాధ్యమని...

విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపే సాధనమనేది నా నమ్మకం. అందుకే మా ఫౌండేషన్‌ ద్వారా 25 మంది పేద పిల్లలను చదివిస్తున్నాం. వీరిలో తండ్రి లేని ముగ్గురు ఆడపిల్లలను దత్తత తీసుకున్నాం. అంతేకాకుండా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఫీజులు కట్టి, వారి ఉన్నతికి బాటలు వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభారతి స్కూల్స్‌లో తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ... హిమగ్లోబిన్‌, కంటి పరీక్షలు చేస్తున్నాం. సమస్య ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. గంజాయి లాంటి మత్తు పదార్థాలు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత గురించి కూడా చెబుతున్నాం. ఏదిఏమైనా పేదరికం లేని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నావంతు ప్రయత్నం చేస్తున్నాను. దీనికోసం పూర్తి సమయం ఫౌండేషన్‌ కోసమే కేటాయిస్తున్నాను. మా కార్యక్రమాలు చూసి వందలో ఓ పదిమంది స్ఫూర్తి పొందినా చాలు... అది మాకు పెద్ద విజయమే.’’

హనుమా

రెండు లక్షలమందికి పైగా...

ఇప్పటివరకు ‘జయప్రద ఫౌండేషన్‌’ ద్వారా లబ్ధి పొందినవారు రెండు లక్షలమందికి పైగా ఉంటారు. వారిలో దాదాపు యాభై వేలమంది విద్యార్థులే. ఇది ఒక్కరి ఆలోచనలతో నడిచే సంస్థ కాదు. అందరి సలహాలు, సూచనలతో సాగే సమష్టి ప్రయత్నం. అంతేకాదు... సంక్రాంతికి లింగాలలో ఊరు మొత్తాన్నీ ఒక చోటకు చేర్చి, కోలాటాలు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీల లాంటివి ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకు భోగిపండ్లు పోస్తాం. సామూహిక స్ఫూర్తిని, మన సంస్కృతిని సజీవంగా ఉంచాలన్న ఉద్దేశం. ఎన్‌టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహించింది కూడా మా ఫౌండేషనే.

మిమ్మల్ని మీరు ప్రేమించండి...

పేదరికం, పోషకాహార లోపం, అవగాహన లేకపోవడం... ఇవన్నీ మహిళల అభ్యున్నతికి అవరోధంగా మారుతున్నాయి. అందుకే... మీ కుటుంబానికి, ఉద్యోగానికి మీరు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో మీకు కూడా మీరు అంతటి ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. మీ శరీరాన్ని మీరు ప్రేమించాలి. ఎందుకంటే నేటి ఆరోగ్యవంతమైన ఆడపిల్ల రేపటి ఆరోగ్యవంతమైన తల్లి అవుతుంది. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుంది.

Updated Date - Apr 16 , 2026 | 02:50 AM