Share News

సహనమే ఆయుధంగా..!

ABN , Publish Date - Jul 06 , 2026 | 02:56 AM

నాన్న ఎలక్ర్టీషియన్‌. అమ్మ టైలరింగ్‌ పని. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా... సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా... పోల్‌వాల్ట్‌లో...

సహనమే ఆయుధంగా..!

నాన్న ఎలక్ర్టీషియన్‌. అమ్మ టైలరింగ్‌ పని. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా... సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా... పోల్‌వాల్ట్‌లో అద్భుతం సాధించింది జి.సింధుశ్రీ. వేరొకరి పోల్‌ అరువు తీసుకొని జాతీయ రికార్డును తిరగరాసింది. ‘నాకు స్పాన్సర్లు లేరు. ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. ఆటపై ఉన్న మక్కువ... దేశానికి ఆడాలన్న సంకల్పమే నన్ను నడిపిస్తోంది’ అంటున్న 25 ఏళ్ల సింధుశ్రీ కథ ఇది.

‘‘ఆసియా క్రీడల్లో పతకం... ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఇదొక్కటే. తద్వారా మా నాన్నకు ఘనమైన నివాళి ఇవ్వాలని అనుకొంటున్నా. భువనేశ్వర్‌లో ఇటీవల ముగిసిన జాతీయ అంతర్రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో జాతీయ రికార్డు నెలకొల్పానంటే... అందుకు ప్రధాన కారణం మా నాన్నే. నా విజయాన్ని ఆయన కళ్లారా చూడకుండానే వెళ్లిపోయారు. నాలుగేళ్ల కిందట గుండెపోటుతో నాన్న మరణించారు. నన్ను ఒక మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. ఆయన ఎలక్ర్టీషియన్‌గా పని చేసేవారు. ఆ వచ్చే కొద్దిపాటి సంపాదనతోనే నాకు క్రీడాపరికరాలు కొనిచ్చారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతి మా సొంతూరు. నేను, మా చెల్లి. ఇద్దరు సంతానం. కుటుంబ అవసరాల కోసం అమ్మ టైలరింగ్‌ చేస్తుంది. వచ్చే డబ్బుతో చెల్లిని చదివిస్తోంది.

రన్నింగ్‌తో మొదలై...

క్రీడాకారిణిగా నా ప్రయాణం మొదలైంది రన్నర్‌గా. తొలి రోజుల్లో 400 మీటర్ల పరుగు పందేల్లో పాల్గొనేదాన్ని. మెరుగైన శిక్షణ, మార్గదర్శకత్వం కోసం 2016లో బెంగళూరులోని ‘స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (సాయ్‌) హాస్టల్‌లో చేరాను. కొన్నాళ్లు నా సామర్థ్యాన్ని గమనించిన తరువాత స్థానిక కోచ్‌ ఒకరు నన్ను పోల్‌వాల్ట్‌ను ప్రయత్నించమన్నారు. ఎందుకని అడిగితే... ‘పరుగులో కంటే పోల్‌వాల్ట్‌లో నువ్వు బాగా రాణిస్తావని అనిపిస్తోంది’ అన్నారు. అలా 2017లో రన్నింగ్‌ వదిలేసి ఇటువైపు వచ్చాను. క్రమంగా అందులో నైపుణ్యం పెంచుకున్నాను.


నాన్న చనిపోయాక...

నాలుగేళ్ల కిందట గుండె పోటుతో మా నాన్న మరణించారు. ఆయన లేని లోటు అప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది. తను రోజూ ఉదయం నన్ను రన్నింగ్‌కు తీసుకువెళ్లేవారు. నేను దేశం తరుఫున ఆడాలని కలలు కన్నారు. అంతర్జాతీయ ఈవెంట్లలో నన్ను చూసి మురిసిపోవాలని తపించారు. కానీ ఇవేవీ చూడకుండానే ఆయన నాకు దూరమయ్యారు. ఆ బాధను దిగమింగుకుని... నాన్న ఆకాంక్షను నెరవేర్చాలనే పట్టుదలతో కృషి చేశాను. రెండేళ్ల కిందట జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర పోటీల్లో పోల్‌వాల్ట్‌లో రజత పతకం గెలిచాను. వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌కు అర్హత సాధించాను.

సరైన పరికరాలు లేక...

ఆ తరువాత పలు పోటీల్లో పాల్గొన్నా... ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. దానికి ప్రధాన కారణం... నాకు సరైన క్రీడా పరికరాలు లేకపోవడం. ముఖ్యంగా భువనేశ్వర్‌ వెళ్లడానికి వారం ముందు వరకు నా దగ్గర పొడవాటి పోల్‌ లేదు. అప్పటివరకు పొట్టి పోల్‌తోనే అన్ని ఈవెంట్లలో పోటీపడ్డాను. అవికూడా ఒకటిరెండుసార్లు వాడినా సరైన సపోర్ట్‌ ఇచ్చేవికావు. నా టెక్నిక్స్‌, నైపుణ్యంలో ఎలాంటి లోపాలూ లేవని తెలుసు. అదే విషయం కోచ్‌లు కూడా చెప్పారు. కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలంటే అందుకు తగిన పరికరాలు కూడా చాలా ముఖ్యం. ఆర్థిక కారణాలవల్ల సొంతంగా పోల్‌ కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకంటే నాకు స్పాన్సర్లు లేరు. ఉద్యోగం లేదు. సరైన క్రీడా సామగ్రితో పాటు పోషకాలు నిండిన ఆహారం కూడా అథ్లెట్లకు కీలకం. దీంతో ప్రొఫెషనల్‌ క్రీడాకారిణిగా కొనసాగడం మరిన్ని సవాళ్లను విసిరింది. అయినా పట్టు వదల్లేదు. భువనేశ్వర్‌లో తలపడేముందు మిత్రుని సాయంతో పోల్‌ సమకూర్చుకున్నా. అరువు తెచ్చుకున్న పోల్‌తో బరిలోకి దిగాను.

ఆత్మవిశ్వాసం అండగా...

ఎప్పుడైతే నాకు సరిపడా పోల్‌ చేతిలోకి వచ్చిందో... అప్పుడు నా ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పోటీపడ్డాను. ఇందులో నా అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే కాదు, జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టాను. 4.25 మీటర్ల ఎత్తును అధిగమించి... గతంలో తమిళనాడు అథ్లెట్‌ బరనికా ఎలంగోవన్‌ నెలకొల్పిన 4.20 మీటర్ల రికార్డును తిరగరాశాను. ఆసియా క్రీడలకు అర్హత సాధించాను. తద్వారా మా నాన్న కలను నెరవేర్చబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముందు నా అత్యుత్తమ ప్రదర్శన 4 మీటర్లు.


పోరాడి... నిలబడి...

మా కుటుంబం మొత్తంలో ప్రొఫెషనల్‌ క్రీడాకారిణి నేనే. ఆడపిల్లలను ఆటలకు పంపడానికి బంధువులు ఎవరూ ఇష్టపడేవారు కాదు. అలాంటి సమయంలో నాన్న నాకు అండగా నిలిచారు. వారందరితో పోరాడి నన్ను ప్రోత్సహించారు. దాని ఫలితంగానే బెంగళూరు వెళ్లి ‘సాయ్‌’లో చేరగలిగాను. నాన్న మరణానంతరం అమ్మ ఇంటి బాధ్యతను తీసుకుంది. టైలరింగ్‌తో వచ్చే డబ్బును చెల్లి చదువు కోసం కేటాయిస్తోంది. ఆర్థికంగా మా తాతయ్య నాకు కొంతవరకు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం నా లక్ష్యం ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకం తేవడం. ఈ క్రీడల్లో కాంస్య పతక విజేత మార్క్‌ 4.30 మీటర్లు. దాన్ని అధిగమించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను.’’

అదే నా బలం...

నా బలం నాలోని సహనమేనని కోచ్‌లు చెబుతుంటారు. అందుకు కారణం లేకపోలేదు. నిన్నమొన్నటి వరకు సరైన ప్రదర్శన లేకున్నా ఆటలో కొనసాగాను. ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నా నైపుణ్యాన్ని నేను సందేహించలేదు. ఆసియా క్రీడల సన్నాహకాల్లో నేను టెక్నిక్స్‌పై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని కోచ్‌ విజయేష్‌ చెప్పారు. అది కలిసొచ్చే అంశం. మరింత కష్టపడితే ఆసియా క్రీడల్లో 4.30 మీటర్ల ఎత్తును అందుకోగలనని నాపై కోచ్‌కు ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టేందుకు వంద శాతం ప్రయత్నిస్తా.

Updated Date - Jul 06 , 2026 | 02:56 AM