Share News

కార్న్‌తో కాంటినెంటల్‌ రుచులు..

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:05 AM

విటమిన్లు, ప్రొటీన్లు, పీచులతో నిండిన కార్న్‌ను ఇష్టపడని వారుండరు. దీనితో రకరకాల చిరుతిళ్లు తయారుచేసుకుని తింటుంటాం. పిల్లలయితే హోటల్‌ స్టయిల్‌ రెసిపీస్‌ కావాలని అడుగుతుంటారు. వాటిలో సులువుగా చేసుకోగలిగే కాంటినెంటల్‌ రుచులు మీకోసం...

కార్న్‌తో కాంటినెంటల్‌ రుచులు..

విటమిన్లు, ప్రొటీన్లు, పీచులతో నిండిన కార్న్‌ను ఇష్టపడని వారుండరు. దీనితో రకరకాల చిరుతిళ్లు తయారుచేసుకుని తింటుంటాం. పిల్లలయితే హోటల్‌ స్టయిల్‌ రెసిపీస్‌ కావాలని అడుగుతుంటారు. వాటిలో సులువుగా చేసుకోగలిగే కాంటినెంటల్‌ రుచులు మీకోసం...

  • మెక్సికన్‌ కార్న్‌ సలాడ్‌

కావాల్సిన పదార్థాలు :

కార్న్‌ గింజలు- కప్పు, కీర ముక్కలు- అర కప్పు, టమాటా ముక్కలు- అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు- పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా, కొత్తిమీర తరుగు- పావు కప్పు, మిరియాల పొడి- చెంచా, ధనియాల పొడి- అర చెంచా, కారం- అర చెంచా, చిక్కటి పెరుగు- నాలుగు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు, ఆలివ్‌ ఆయిల్‌- చెంచా, మయొనైజ్‌- రెండు చెంచాలు, వెన్న- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత

తయారీ విధానం:

ఒక గిన్నెలో పెరుగు, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఉంచుకోవాలి. వెడల్పాటి గిన్నెలో ముందుగా ఉడికించిన కార్న్‌, కీర ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు, వెల్లుల్లి తరుగు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలపాలి. ఆపైన ఆలివ్‌ ఆయిల్‌, మయొనైజ్‌, కరిగించిన వెన్న వేసి కలపాలి. తరువాత పెరుగు మిశ్రమం వేసి కలిపి పైన కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే రుచికరమైన మెక్సికన్‌ కార్న్‌ సలాడ్‌ రెడీ..!


  • క్రిస్పీ కార్న్‌ ఫ్రిట్టర్స్‌

కావాల్సిన పదార్థాలు

కార్న్‌ గింజలు- కప్పు, గోధుమ పిండి- అర కప్పు, క్యాప్సికమ్‌ తరుగు- పావు కప్పు, ఉల్లికాడల తరుగు- పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు- రెండు, మిరియాల పొడి- అర చెంచా, ఉప్పు- తగినంత, నూనె- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

వెడల్పాటి గిన్నెలో కార్న్‌ గింజలు, క్యాప్సికమ్‌ తరుగు, ఉల్లికాడల తరుగు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, గోధుమపిండి, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, చెంచా నూనె వేసి తగినన్ని నీళ్లు పోస్తూ గరిటె జారుగా కలపాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి షాలో ఫ్రైకి సరిపడేలా నూనె వేసి వేడిచేయాలి. ఆపైన చిన్న గరిటెతో కార్న్‌ మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న వడల మాదిరి వేయాలి. వీటిని రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఈ కార్న్‌ ఫ్రిట్టర్స్‌ని టమాటా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

  • క్రీమీ కార్న్‌ సూప్‌

కావాల్సిన పదార్థాలు:

కార్న్‌ గింజలు- కప్పు, కార్న్‌ పేస్టు- అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, బీన్స్‌ ముక్కలు- అర కప్పు, క్యారెట్‌ ముక్కలు- అర కప్పు, వెన్న- చెంచా, వెల్లుల్లి తరుగు- చెంచా, అల్లం తరుగు- చెంచా, మంచినీళ్లు- రెండు పెద్ద గ్లాసులు, ఉప్పు- చెంచా, కార్న్‌ఫ్లోర్‌- చెంచా, మిరియాల పొడి- అర చెంచా, సన్నగా తరిగిన ఉల్లి కాడలు- పావు కప్పు, ఫ్రెష్‌ క్రీమ్‌- చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం:

స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి వెన్న వేసి కరిగించాలి. అందులో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, ఉల్లిపాయ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు, కార్న్‌ గింజలు వేసి కలిపి మూతపెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. తరువాత కార్న్‌ పేస్టు వేసి కలపాలి. 2 నిమిషాల తరువాత నీళ్లు పోసి మరిగించాలి. ఆపైన ఉప్పు, పావు గ్లాసు నీటిలో కలిపిన కార్న్‌ఫ్లోర్‌, మిరియాల పొడి, ఉల్లి కాడల తరుగు వేసి కలపాలి. అయిదు నిమిషాలు మరిగిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించి ఫ్రెష్‌ క్రీమ్‌ వేసి కొత్తిమీర తరుగు చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.


  • క్రీమీ కార్న్‌ స్పినాచ్‌ బేక్‌

కావాల్సిన పదార్థాలు :

పాలకూర తరుగు- రెండు కప్పులు, కార్న్‌ గింజలు- రెండు కప్పులు, మైదా- రెండు చెంచాలు, వెన్న- రెండు చెంచాలు, పాలు- ఒకటిన్నర కప్పులు, ఫ్రెష్‌ క్రీమ్‌- పావు కప్పు, క్రీమ్‌ చీజ్‌- వంద గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా, మిరియాల పొడి- చెంచా, జాజికాయ పొడి- చిటికెడు, ఉప్పు- తగినంత, మొజారెల్లా చీజ్‌- కప్పు

తయారీ విధానం:

స్టవ్‌ మీద వెడల్పాటి పాన్‌ పెట్టి వెన్న వేసి కరిగించాలి. అందులో వెల్లుల్లి తరుగు, కార్న్‌ గింజలు, పాలకూర తరుగు వేసి దోరగా వేయించాలి. తరువాత మైదా వేసి కలపాలి. వెంటనే పాలు పోసి క్రీమ్‌ చీజ్‌, ఫ్రెష్‌ క్రీమ్‌ వేసి సాస్‌లా వచ్చే వరకు విస్క్‌ చేయాలి. ఆపైన ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి, జాజికాయపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ ట్రేలోకి తీసుకుని పైన మొజారెల్లా చీజ్‌ తురుము చల్లి 190 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద 20 నిమిషాలు బేక్‌ చేయాలి. తరువాత బయటికి తీసి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - Sep 26 , 2026 | 01:08 AM